Published : 31/01/2023 00:37 IST

చనుబాలు దానం చేసి... పసిపిల్లల ఆకలి తీర్చి..

దానాలన్నింటిలోనూ అన్నదానం గొప్పదంటారు. తన చనుబాలనే దానం చేసి వేలమంది చిన్నారుల కడుపునింపిన ఈ తల్లి కూడా అందరి మనసుల్లోనూ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమే తమిళనాడుకు చెందిన శ్రీవిద్య. తనలాంటి తల్లులకెందరికో స్ఫూర్తిగా నిలిచారు.

మొదటి ప్రసవం తర్వాత తన బిడ్డకు పట్టగా మిగిలిన చనుబాలను మరికొందరు పిల్లలకు పంచాలనుకున్నారు శ్రీవిద్య. భర్త భైరవ్‌కు తన ఆలోచననూ చెప్పారు. తీరా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురుకావడంతో అనుకున్నట్లు తన పాలను దానం చేయలేకపోయారీమె. కోయంబత్తూరుకు చెందిన 27ఏళ్ల శ్రీవిద్య గతేడాది రెండోసారి గర్భందాల్చి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ప్రసవించిన అయిదోరోజు నుంచే తన పాలను దానం చేయడం మొదలుపెట్టారు.

అందుకు తృప్తి..

వాటి నిల్వ, పంపిణీ విధానాలపైనా అవగాహన తెచ్చుకున్నారీమె. ‘తిరుపూరుకు సమీపంలో ‘అమృతం బ్రెస్ట్‌ మిల్క్‌ డొనేషన్‌ క్యాంపు’ పేరుతో తల్లిపాల దానంపై ఒక ఎన్జీవో అవగాహన కలిగిస్తోంది. అక్కడి నిర్వాహకులను కలుసుకొని నా ఆలోచన చెప్పా. పాలను అందించాల నుకుంటున్నట్లు చెప్పి, వారి సహకారం, ప్రోత్సాహంతో ప్రసవించిన వారంలోపే పాలను నిల్వ చేయడం ప్రారంభించా. ఆ తర్వాత వాటిని కోయంబత్తూరు గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలోని మిల్క్‌ బ్యాంకుకు అందించే దాన్ని. తక్కువ బరువుతో పుట్టే నవజాత శిశువులకు, తల్లివద్ద పాల ఉత్పత్తి సరిగాలేని చిన్నారులు, పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన పసి పిల్లల ఆకలి తీర్చడం చాలా సంతోషంగా అనిపించేది. నా బిడ్డతోపాటు నా పిల్లల్లాంటి మరికొందరు పసివాళ్ల ఆకలి తీరుస్తున్నందుకు తృప్తిగా ఉండేది. కోవై ప్రభుత్వాసుపత్రిలో ప్రతిరోజూ ప్రసవాలు జరుగుతూనే ఉంటాయి. వీటిలో కొందరు నవజాత శిశువులను పుట్టిన వెంటనే ఇంక్యుబేటర్స్‌లో ఉంచాల్సిన పరిస్థితి. అటువంటి చిన్నారులకు నా పాలనెక్కువగా పంపిణీ చేసేవారు. అలా ఏడు నెలలపాటు నిరంతరాయంగా 105 లీటర్ల పాలను దానం చేయగలిగా. ఇప్పుడు మా పాపకు పదినెలలు. నేను దానం చేసిన పాలు దాదాపు 2,500మంది పసిపిల్లల ఆకలి తీర్చగలిగాయి. వీరిలో చాలామంది తక్కువ బరువుతో పుట్టినవారే. ఒక తల్లికే మరో తల్లి కష్టం తెలుస్తుంది. కన్నబిడ్డకు స్తన్యం ఇవ్వలేని తల్లి అనుభవించే వేదన మాటల్లో చెప్పలేం. ఆకలితో అలమటించే చిన్నారి ఆకలిని తీర్చగలిగే అవకాశం ఈ సృష్టిలో మరోతల్లికే ఉంది. దీనిపై తల్లులందరూ అవగాహన పెంచుకోవాలి. అందరూ పాలదానం చేయడానికి ముందుకు రావాలి. ఏడు నెలల్లో 105 లీటర్ల పాల దానంతో పురస్కారాలు పొందడం కన్నా.. వేలమంది చిన్నారుల ఆకలి తీర్చగలిగినందుకు గర్వంగానూ, తృప్తిగానూ ఉంది’ అని చెబుతున్న శ్రీవిద్య తల్లులందరికీ స్ఫూర్తిదాయకం కదూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి