Plant Gifting: ఇలా అందంగా ర్యాప్‌ చేద్దాం..!

పండగైనా, ప్రత్యేక సందర్భమైనా మనసుకు నచ్చిన వారికి మెచ్చిన బహుమతి ఇచ్చినప్పుడే వారికి సంతోషం, మనకు సంతృప్తి. క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి సందర్భాలు సైతం ఇందుకు మినహాయింపు కాదు.

Updated : 22 Dec 2023 14:06 IST

పండగైనా, ప్రత్యేక సందర్భమైనా మనసుకు నచ్చిన వారికి మెచ్చిన బహుమతి ఇచ్చినప్పుడే వారికి సంతోషం, మనకు సంతృప్తి. క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి సందర్భాలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. అయితే బహుమతి అనగానే ఈ రోజుల్లో మొక్కల్నే ఎంచుకుంటున్నారు చాలామంది! తద్వారా అందరిలో పర్యావరణ స్పృహ పెంచుతున్నారు. అలాగని మొక్కల్ని బహుమతిచ్చే క్రమంలో వాటిని కుండీతో పాటే నేరుగా అందిస్తే ఏం బాగుంటుంది చెప్పండి! అందుకే వాటిని కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో గిఫ్ట్‌ ర్యాప్‌ చేసి అందిస్తే.. ప్లాంట్‌ గిఫ్టింగ్‌ అదిరిపోతుంది.

⚛ కొన్ని మొక్కలు పెద్ద పెద్ద కుండీల్లో పెంచుతుంటాం. అలాగని వాటిని అదే కుండీతో బహుమతిగా అందిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే ఆ మొక్కల్ని చిన్న కుండీలోకి మార్చి గిఫ్ట్ ఇవ్వచ్చు.. లేదంటే అలాంటి ఓ కొత్త మొక్కను కొని.. ఆకర్షణీయమైన కుండీలో పెట్టి ఇచ్చినా సింపుల్‌గా ఉంటుంది.

⚛ కుండీల్ని అలాగే ఇవ్వడం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ క్రమంలోనే వాటికి అదనపు హంగులద్దాలనుకుంటారు. ఇలాంటి వారు జ్యూట్‌ క్యాత్‌తో కుండీని చుట్టేసి.. దాని పైనుంచి ఓ కలర్‌ఫుల్‌ రిబ్బన్‌తో ముడేస్తే ఆకర్షణీయంగా కనిపిస్తుంది.. పర్యావరణహితంగానూ ఉంటుంది.

⚛ మొక్కల్ని గిఫ్ట్‌గా ఇచ్చే వారు.. సాధారణ కుండీలు కాకుండా.. పెయింట్‌/ఆర్ట్‌తో కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దిన కుండీల్ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఇవి విభిన్న డిజైన్లలో మార్కెట్లో దొరుకుతున్నాయి.. లేదంటే ఉన్న కుండీకే స్వహస్తాలతో రంగులేసి కూడా అందించచ్చు.

⚛ ప్రస్తుతం మార్కెట్లో రంగురంగుల పేపర్‌ కవర్స్‌ దొరుకుతున్నాయి. వాటిపై బొమ్మలు, వివిధ డిజైన్లతో కూడినవీ లభ్యమవుతున్నాయి. మీరు బహుమతిగా ఇవ్వాలనుకునే పూల కుండీని నేరుగా ఈ పేపర్‌ బ్యాగ్‌లో పెట్టి అందిస్తే వైవిధ్యంగా ఉంటుంది.

⚛ కొంతమంది ఒకే మొక్క కాకుండా.. ఎక్కువ మొక్కలు గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటారు. అలాంటి వారు ఓపెన్‌ బాక్స్‌ గిఫ్టింగ్‌ పద్ధతిని ఎంచుకోవచ్చు. ఒక పెద్ద గిఫ్ట్‌ బాక్స్‌లో మీరు అందించాలనుకునే మొక్కల్ని ఉంచి.. మూత పెట్టి రిబ్బన్‌తో అలంకరించడమే ఈ గిఫ్టింగ్‌ పద్ధతి. ఇదీ సాధారణ గిఫ్టింగ్‌ పద్ధతిని పోలి ఉంటుంది.

⚛ మొక్కల్ని బహుమతిగా ఇవ్వాలనుకునే వారు.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘వికర్‌ బాస్కెట్స్‌’ని కూడా ఎంచుకోవచ్చు. వెదురు, కేన్‌.. వంటి మెటీరియల్స్‌తో అల్లిన ఈ బుట్టలు వివిధ ఆకృతుల్లో దొరుకుతున్నాయి. గిఫ్టింగ్‌ కోసం వీటిని ఎంచుకుంటే వింటేజ్‌ స్టైల్‌ ఉట్టిపడుతుంది.

⚛ బహుమతిగా ఇచ్చే మొక్కల్ని ఫ్లవర్ బొకే తరహాలో ర్యాప్‌ చేసి కూడా అందించచ్చు. ఇందుకోసం మీకు నచ్చిన రంగు ర్యాప్‌ షీట్‌/పేపర్‌ని ఎంచుకొని.. మొక్క పైభాగం కాస్త బయటికి కనిపించేలా బొకే తరహాలో ఆ పేపర్‌ని చుట్టేయచ్చు.. కావాలంటే కింద ఓ కలర్‌ఫుల్‌ రిబ్బన్‌తో ముడేస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

⚛ కలర్ ర్యాప్‌ షీట్‌/పేపర్‌ నచ్చని వారు.. ట్రాన్స్‌పరెంట్‌ ప్లాస్టిక్‌ కవర్‌లో కుండీని ఉంచి.. పైభాగంలో ముడేయచ్చు.. ముడి కనిపించకుండా ఉండేందుకు గోల్డ్‌/సిల్వర్‌/ఇతర రంగుల్లో ఉండే రిబ్బన్‌తో కవర్‌ చేసేయచ్చు.

⚛ పుట్టినరోజు, పండగలు, పెళ్లిళ్లు.. వంటి పలు ప్రత్యేక సందర్భాల్లో బహుమతులిస్తుంటాం. ఈ క్రమంలోనే ఆయా సందర్భాన్ని ప్రతిబింబించేలా గిఫ్ట్‌ కార్డ్స్‌, యాక్సెసరీస్‌, ఇతర వస్తువుల్ని.. మొక్కలకు వేలాడదీస్తే మరింత ప్రత్యేకంగా ఉంటుంది.


ఇవి గుర్తుంచుకోండి!

పర్యావరణ స్పృహతో మొక్కల్ని బహుమతిగా ఇవ్వడమే కాదు.. ఈ క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు.

⚛ కొంతమందికి కొన్ని రకాల మొక్కలంటే అలర్జీ ఉంటుంది. ఉదాహరణకు.. కొందరికి పూల వాసన పడకపోవచ్చు.. మరికొందరికి తీగలా పాకే మొక్కలంటే ఇష్టం ఉండకపోవచ్చు. కాబట్టి మీరిచ్చే ప్లాంట్‌ గిఫ్టింగ్‌లో అవతలి వారికి అన్ని విధాలా అనుగుణంగా ఉండే మొక్కల్ని ఎంచుకోవడం మంచిది.

⚛ మీ స్నేహితురాలు పెట్‌ లవరా? అయితే పెంపుడు జంతువులపై విష ప్రభావం చూపే మొక్కలూ కొన్నుంటాయని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ క్రమంలో పెట్‌-ఫ్రెండ్లీ మొక్కల్ని ఎంచుకోవడం ఉత్తమం.

⚛ అలాగే ఇంట్లో చిన్న పిల్లలుంటే వారికీ కొన్ని రకాల మొక్కలు అసౌకర్యాన్ని కలిగించచ్చు. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని గిఫ్టింగ్‌ మొక్కల్ని ఎంచుకోవడం మంచిది.

⚛ మీరు అంత ప్రేమగా మొక్కల్ని బహుమతిచ్చినా.. అవతలి వారికి మొక్కల పెంపకంపై ఆసక్తి లేదనుకోండి! వృథానే కదా.. ఇలాంటప్పుడు ఎక్కువ కేరింగ్‌ అవసరం లేకుండా.. సులభంగా, వాటంతటవే పెరిగే మొక్కల్ని గిఫ్టింగ్‌ కోసం ఎంచుకోవడం శ్రేయస్కరం!

⚛ కొంతమంది బహుమతి పుచ్చుకున్నాక రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటారు. అలాంటి వారు మొక్కల్ని ఎంచుకుంటే.. వాటిని అందంగా ర్యాప్‌ చేశాక.. ‘థ్యాంక్యూ’ అని రాసున్న చిన్న కార్డ్‌ని.. ఆ గిఫ్ట్‌ ర్యాప్‌కు జత చేయడం మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్