నాన్న కోసం.. సినిమాలో ఎన్టీఆర్‌లా 16 ఏళ్లు పోరాడింది!

స్టూడెంట్‌ నం.1 సినిమా గుర్తుందా? ఉద్దేశపూర్వకంగా ఇరికించిన కేసులో నిర్దోషి అయిన తన తండ్రిని విడిపించడానికి లాయర్గా హీరో చేసే ప్రయత్నం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది. బంగ్లాదేశ్‌కు చెందిన షెగుఫ్తా తబసుమ్ అహ్మద్‌ కథ కూడా అచ్చం ఈ సినిమా కథనే తలపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా తన తండ్రిని హత్య చేసిన నరహంతకులకు......

Updated : 12 Apr 2022 20:49 IST

స్టూడెంట్‌ నం.1 సినిమా గుర్తుందా? ఉద్దేశపూర్వకంగా ఇరికించిన కేసులో నిర్దోషి అయిన తన తండ్రిని విడిపించడానికి లాయర్‌గా హీరో చేసే ప్రయత్నం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది. బంగ్లాదేశ్‌కు చెందిన షెగుఫ్తా తబసుమ్ అహ్మద్‌ కథ కూడా అచ్చం ఈ సినిమా కథనే తలపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా తన తండ్రిని హత్య చేసిన నరహంతకులకు తగిన శిక్ష పడేలా చేసేందుకు ఏకంగా ఆమె న్యాయవిద్యనే అభ్యసించింది. సుమారు 16 ఏళ్ల పాటు పోరాడి తాజాగా కేసులో గెలవడమే కాదు.. ఎన్నటికైనా న్యాయానిదే తుది విజయం అని నిరూపించింది. తండ్రి కోరిక మేరకు లాయరై.. ఆయన కేసునే వాదించి గెలిచిన ఈ కూతురి కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బంగ్లాదేశ్‌కు చెందిన తాహెర్‌ అహ్మద్‌ అక్కడి ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించేవారు. మరో వైపు భార్యాపిల్లలతో హాయిగా జీవితం సాగిస్తున్నారు. ఈ తరుణంలోనే 2006, ఫిబ్రవరి 1న ఆయన కిడ్నాప్‌కు గురయ్యారు. మరో రెండు రోజుల అనంతరం తాహెర్‌ శవం ఓ మ్యాన్‌హోల్‌లో దొరికింది. దీంతో కన్నీరుమున్నీరైన ఆయన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా ఈ హత్య వెనుక ఆరుగురు నిందితులున్నట్లు తేల్చారు.

ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది!

తాహెర్‌కు తన కూతురు షెగుఫ్తా తబసుమ్ అహ్మద్‌ను లాయర్‌ చేయాలని కోరిక. ఆమెకు దానిపై పెద్దగా ఆసక్తి లేకపోయినా నాన్న మాటను కాదనలేకపోయింది. దీంతో తాహెర్‌ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తనే స్వయంగా తన కూతురిని స్థానిక లా కాలేజీలో చేర్పించారు. ఆ తర్వాత తండ్రిని కోల్పోవడంతో కొన్ని రోజుల పాటు తన చదువుకు బ్రేక్‌ పడింది. ఇక అదే సమయంలో కేసులో ప్రధాన నిందితుడు బెయిల్‌పై విడుదలవడం జీర్ణించుకోలేకపోయింది షెగుఫ్తా. ఏ పాపం ఎరుగని తన తండ్రిని పొట్టన పెట్టుకున్న రాక్షసుల్ని వదలకూడదని గట్టిగా అనుకుంది. ఈ కేసును ఎవరో వాదిస్తే తన తండ్రికి న్యాయం జరగదని, ఆయన ఆత్మ శాంతించదని అనుకున్న ఆమె.. తానే లాయరై కేసును టేకప్‌ చేయాలని నిర్ణయించుకుంది.. పట్టుబట్టి న్యాయవిద్యను అభ్యసించింది.

ఎవ్వరూ ముందుకు రాలేదు!

‘నాన్న హత్యకు కారణమైన వారికి తగిన శిక్ష పడేలా చేయాలని నేను ఎక్కని కోర్టు మెట్టు లేదు. కానీ వెళ్లిన ప్రతిచోటా నాకు మొండిచేయే ఎదురైంది. అందుకే న్యాయం కోసం ఎక్కడా చేయి చాచకూడదని నిర్ణయించుకున్నా. ఇక అదే సమయంలో కేసులో ప్రధాన నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. దాంతో అమ్మ, సోదరుడితో చర్చించి నాన్న కోసం న్యాయవాద వృత్తినే కెరీర్‌గా మార్చుకోవాలనుకున్నా. నిజానికి లాయర్‌ అవ్వాలన్నది నా ఆశయం కాదు.. దానిపై నాకు ఆసక్తి కూడా లేదు. కానీ అన్యాయపు ముసుగులో న్యాయానికి చోటు లేదని తెలిసి సహించలేకపోయా. నాన్న చేర్పించిన BRAC యూనివర్సిటీ నుంచే న్యాయవిద్యలో పట్టా అందుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది షెగుఫ్తా.

తొమ్మిదేళ్ల పోరాట ఫలితమిది!

ఆపై ఢాకా బార్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్న ఆమె.. తన తండ్రి కేసును టేకప్‌ చేసింది. కేసు విచారణ సమయంలో నిందితులు పలుమార్లు తప్పించుకోవాలని చూసినా.. చేసిన తప్పుకు శిక్ష పడాలని పట్టుబట్టిందీ యంగ్‌ లాయర్‌. ఈ క్రమంలోనే పూర్వాపరాలు పరిశీలించిన రాజ్‌షాహీ సిటీ కోర్టు 2008లో నలుగురు దోషులకు మరణ దండన విధిస్తూ తీర్పునివ్వడంతో పాటు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో నిందితులు అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. 2013లో హైకోర్టు ఈ నలుగురిలో ఇద్దరు నిందితులకు మరణ దండన, మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పట్నుంచి తొమ్మిదేళ్ల పాటు ఈ కేసుపై పోరాటం చేస్తూ వచ్చిన షెగుఫ్తాకు ఆఖరికి విజయం దక్కింది.

తెలిసిన వారే గోతులు తవ్వారు!

నిజానికి ఈ కేసులోని దోషులు తాహెర్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన యూనివర్సిటీలో చదువుకున్న వారు, ఆయనతో కలిసి పనిచేసిన వారే. వీరంతా డబ్బు, ఉన్నత పదవుల కోసమే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టారని విచారణలో తెలుసుకున్న సుప్రీం కోర్టు అప్పీలు విభాగం.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దోషుల్లో ఇద్దరికి మరణ దండన, మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తుది తీర్పు వెల్లడించింది. దీంతో చేపట్టిన తొలి కేసుతోనే గెలుపు రుచి చూసిందీ డేరింగ్‌ లాయర్‌. ఇలా మొత్తానికి కేసు ప్రారంభం నుంచి 16 ఏళ్ల పాటు అలుపు లేకుండా అంకితభావంతో, పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడింది. ‘ఎట్టకేలకు 16 ఏళ్లకు విజయం దక్కింది. ఈ క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నా.. మరెన్నో విషయాలు తెలుసుకున్నా.. ఆఖరికి న్యాయం గెలిచినందుకు సంతృప్తిగా, సంతోషంగా అనిపిస్తోంది. ఈ రోజున నాన్న ఆత్మకు శాంతి చేకూరుతుంది..’ అంటూ విజయదరహాసం చేస్తోంది.

తనకు ఇష్టం లేకపోయినా నాన్న కోసం న్యాయవిద్యను ఎంచుకొని.. ఆయన కేసునే వాదించి గెలిచిన ఈ యంగ్‌ లాయర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ అమ్మాయి పట్టుదల, అంకితభావం ఎంతోమందికి ఆదర్శం అని చెప్పడంలో సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్