పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!

వేసవిలో పాలు త్వరగా తోడుకోవడమే కాదు.. తోడుకున్న పెరుగూ కాసేపటికే పులుపెక్కడం చూస్తుంటాం. ఫ్రిజ్‌లో పెట్టినా దాని రుచి మారిపోతుంటుంది. అయితే ఇలా పుల్లబడిన పెరుగును చాలామంది బయటపడేస్తుంటారు.

Published : 19 Mar 2024 13:31 IST

వేసవిలో పాలు త్వరగా తోడుకోవడమే కాదు.. తోడుకున్న పెరుగూ కాసేపటికే పులుపెక్కడం చూస్తుంటాం. ఫ్రిజ్‌లో పెట్టినా దాని రుచి మారిపోతుంటుంది. అయితే ఇలా పుల్లబడిన పెరుగును చాలామంది బయటపడేస్తుంటారు. కానీ ఇలా వృథా చేయకుండా దీంతో రుచికరమైన వంటకాలూ చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

అదనపు రుచి..!

పుల్లటి పెరుగును కొన్ని రకాల వంటకాల తయారీలో ఉపయోగించడం వల్ల వాటి రుచిని, మృదుత్వాన్ని పెంచచ్చని చెబుతున్నారు నిపుణులు.

⚛ సాధారణంగా ఇడ్లీ, దోసె పిండిని రాత్రంతా పులియబెట్టడం మనకు అలవాటే! అయితే అప్పటికప్పుడు వీటిని సిద్ధం చేసుకోవాలంటే.. పుల్లటి పెరుగు, కొన్ని నీళ్లతో పిండి మిశ్రమాన్ని తయారుచేసుకుంటే సరిపోతుంది. తద్వారా ఈ వంటకాలు మెత్తగా, మృదువుగా వస్తాయి.. రుచిగానూ ఉంటాయి.

⚛ ధోక్లా స్పాంజి తరహాలో మెత్తగా, మృదువుగా రావాలంటే అందులో సాధారణ పెరుగుకు బదులు పుల్లటి పెరుగును జత చేయాలి. తద్వారా అది తింటుంటే నోటికి ఒక రకమైన పులుపుదనం తగిలి మరింత రుచికరంగా ఉంటుంది.

⚛ జొన్న పిండి, రాగి పిండి, రవ్వతో అప్పటికప్పుడు దోసెలు వేసుకునే వారు నీళ్లతో పాటు కాస్త పుల్లటి పెరుగుతో పిండి మిశ్రమాన్ని కలుపుకొంటే.. వాటి రుచి పెరుగుతుంది. అవి మెత్తగానూ వస్తాయి.

⚛ ఛోలే భటూరే, గుత్తి వంకాయ, మిర్చీ కా సలాన్‌, దహీ ఆలూ.. వంటి గ్రేవీ వంటకాల్లో.. పల్లీలు, నువ్వులు, గసగసాలు, కొబ్బరి తురుము.. వంటివి వాడడం మనకు తెలిసిందే! అయితే వీటితో పాటు కాస్త పుల్లటి పెరుగు కూడా వేస్తే కూర ఇట్టే నోరూరిస్తుంది. గ్రేవీ మరింత చిక్కగానూ ఉంటుంది.

⚛ సాధారణ పెరుగుతోనే కాదు.. పుల్లటి పెరుగుతోనూ రుచికరమైన పెరుగన్నం తయారుచేసుకోవచ్చు. అయితే పులుపుదనం నోటికి తగలకూడదంటే.. దాన్ని తాలింపు పెడితే సరి!

⚛ బ్రెడ్‌, ఇతర బేకింగ్‌ వంటకాలు తయారుచేసే క్రమంలో.. పిండిని పులియబెట్టడానికి ఈస్ట్‌ కలుపుతుంటాం. అయితే దీనికి బదులు కాస్త పుల్లటి పెరుగు వాడితే.. అందులోని ప్రొబయోటిక్‌ సమ్మేళనాలు పొట్ట ఆరోగ్యాన్ని పెంచుతాయి.. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు.. ఆయా పదార్థాలకు మృదుత్వం వస్తుంది.

⚛ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చికెన్‌ వింగ్స్‌, సలాడ్స్‌.. వంటివి క్రీమ్‌ ఛీజ్‌లో ముంచుకొని తినడం చాలామందికి ఇష్టం. అయితే దీని తయారీలో కొద్దిగా పుల్లటి పెరుగు వాడితే.. నోటికి పుల్లపుల్లగా తగులుతుంది. మరింత రుచికరంగానూ ఉంటుంది.

⚛ మజ్జిగ చారు చాలామందికి ఫేవరెట్‌. అయితే దీన్ని సాధారణ పెరుగుతో కంటే పుల్లటి పెరుగుతో తయారుచేస్తే మరింత రుచిగా ఉంటుంది.

⚛ దహీ వడ కోసం సాధారణ పెరుగు కాకుండా.. కాస్త పుల్లబడిన పెరుగు ఉపయోగిస్తే రుచి అదిరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్