Motivation: పారిపోవద్దు.. పోరాడుదాం

ఇద్దరు అమ్మాయిలు.. ఎన్నో లక్ష్యాలు, ఆశలతో ఉన్నత చదువులవైపు వెళ్లారు. వేధింపుల బారినపడి తనువు చాలించారు. ఆత్మహత్య.. పిరికితనం అనుకుంటాం.

Updated : 28 Feb 2023 11:56 IST

ఇద్దరు అమ్మాయిలు.. ఎన్నో లక్ష్యాలు, ఆశలతో ఉన్నత చదువులవైపు వెళ్లారు. వేధింపుల బారినపడి తనువు చాలించారు. ఆత్మహత్య.. పిరికితనం అనుకుంటాం. కానీ.. చావుని ఆహ్వానించడానికి చాలా ధైర్యం కావాలి! దానిలో ఒక్కశాతమైనా ఎదురు తిరగడానికీ, ఎదిరించడానికి వాడి చూడండి.. సాయమందించే చేతులెన్నో!


ఆ ధైర్యం కావాలి
- అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

వేధింపులను ఎదుర్కొనేవారు ఒంటరిననే స్థితిలోకి జారుకుంటారు. అందరికీ దూరంగా ఉండాలనుకుంటారే తప్ప.. నలుగురిలోకి రావాలనుకోరు. దీంతో చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. నెగెటివ్‌ ఆలోచనలు, బాధ పెరిగిపోయి.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. అప్పుడే ఆత్మహత్య ఆలోచనలొచ్చేది! నెగెటివ్‌ ఆలోచనలొస్తే.. నలుగురితో కలవండి. అప్పుడే ‘నాకే కాదు.. వేరే వాళ్లకీ ఇదే సమస్య’న్నది అర్థమవుతుంది. ఆలోచన పరిష్కారం వైపు వెళుతుంది. కనీసం ఎవరైనా బయటకు తీసుకొచ్చే ప్రయత్నమైనా చేస్తారు. ఇక అమ్మానాన్నలు.. పిల్లల మనస్తత్వాలు వాళ్లకే బాగా తెలుస్తుంది. మాటల్లో బేలతనం కనిపించగానే వాళ్లనో కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్లు చెప్పడానికి ఇష్టపడకపోయినా పదే పదే అడగండి.. అప్పుడే బయటపడతారు. వాళ్ల సమస్యని చిన్నదే అని కొట్టిపారేయక స్థైర్యమివ్వాలి. ఇంకా పెద్ద కష్టాలు భవిష్యత్తులో వస్తాయని ధైర్యం చెప్పాలి. మీరు దాటిన పరిస్థితులను ఉదాహరణగా చెబుతూ.. వాళ్ల కష్టం చిన్నది అనిపించేలా మాట్లాడాలి. నిజానికి చిన్నకుటుంబాల ధోరణి మొదలయ్యాక పిల్లలు చాలా సెన్సెటివ్‌గా తయారవుతున్నారు. సర్దుకుపోవడం, ఒక మాట పడటం లాంటివి కనిపించట్లేదు. ఓవర్‌ పేరెంటింగ్‌ చేస్తున్నారేమో చూసుకోవడమూ ముఖ్యమే!


మౌనంగా భరించొద్దు!
- శిఖా గోయల్‌, అడిషనల్‌ డీజీపీ, తెలంగాణ మహిళా భద్రత విభాగం

ళాశాల, ఆఫీసులు, పబ్లిక్‌ ప్రదేశాలేవైనా..ర్యాగింగ్‌, వేధింపుల నివారణకు బలమైన యంత్రాంగం పనిచేస్తోంది. నిజానికి కళాశాలలు, ఆఫీసుల్లో వీటికి వ్యతిరేకంగా పనిచేసే ప్రత్యేక విభాగాలు ఉండాలి. ఫిర్యాదు అందగానే ఇవి తగిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ పట్టించుకోవట్లేదు అనిపించినా మౌనంగా భరించొద్దు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ఇది కూడా ఇబ్బంది అనుకుంటే 100/ 102కి ఫోన్‌ చేయొచ్చు షీ టీమ్‌కి వాట్సాప్‌ లేదా హాక్‌ఐ, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ విమెన్‌ సేఫ్టీ ఖాతాల ద్వారా కూడా సంప్రదించొచ్చు. మీ వివరాలు బయట పెట్టకుండానే సమస్యను పరిష్కరిస్తాం. కాబట్టి, నిర్భయంగా ముందుకు రండి. ఐపీసీ 504- ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ఐపీసీ 506- బెదిరింపులు, ఐపీసీ 354 (ఎ)- లైంగిక వేధింపులు సహా 18 ఏళ్లలోపు అయితే పోక్సో చట్టం, 1997 ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ర్యాగింగ్‌ యాక్ట్‌.. లాంటి ఎన్నో చట్టాలు అమ్మాయిలకు అండగా నిలుస్తున్నాయి. చేయాల్సిందల్లా.. మీ సమస్యను బయటపెట్టడమే! అవసరమైతే బాధితులకు నిపుణులతో మానసిక ఆరోగ్యంపై కౌన్సెలింగ్‌నీ ఇప్పిస్తాం. కాబట్టి, భయపడొద్దు.. పోరాడండి.


పదేళ్ల వరకూ శిక్ష!
- జి. వరలక్ష్మి, న్యాయవాది

ర్యాగింగ్‌ యాక్ట్‌ ప్రకారం... అవమానించడం, భయపెట్టడం, వ్యక్తిత్వానికి చెడు చేయాలనుకోవడం వంటివన్నీ ర్యాగింగ్‌కి అర్థాలే. కాలేజైనా, బయటైనా తోటి విద్యార్థులను హేళన చేయడం, శారీరకంగా, మానసికంగా బాధించడం వంటి పనుల్ని నేరంగా పరిగణిస్తారు. వీటిల్లో నిర్భంధం, లైంగిక వేధింపులు, ఆత్మహత్య ప్రేరేపణలను తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. వీటికి పాల్పడిన వారికి పదేళ్ల వరకూ జైలు శిక్ష పడొచ్చు. ర్యాగింగ్‌ జరుగుతోందని ఫిర్యాదొస్తే సంబంధిత విద్యాసంస్థ దాన్ని తీవ్రంగా పరిగణించి ఎంక్వయిరీకి ఆదేశించాలి. నిజమని నిరూపణయితే ఆ విద్యార్థిని సస్పెండ్‌ చేయాలి. వైద్య విద్యార్థిని ప్రీతి విషయంలో నిందితుడు సీనియర్‌ విద్యార్థిననే ఆధిపత్య ధోరణి ప్రదర్శించినట్లు అర్థమవుతోంది. తనది పై చేయి అని చూపించడానికి ఆ అమ్మాయి కుంగుబాటుకు గురయ్యే పరిస్థితులను కల్పించాడు. అవమానించటం, ఇతర విద్యార్థులనూ ఆమెపైకి ఉసికొల్పడం, ఒంటరిని చేయడం వంటివన్నీ ర్యాగింగ్‌గానే పరిగణిస్తారు. ప్రీతి ఫిర్యాదు చేసిన వెంటనే యాజమాన్యం తీవ్రంగా పరిగణించి ఉంటే ఆమె బతికుండేది. ఇప్పటికైనా ఇలాంటి వాటిని మూలాల నుంచి పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే, ఈ దురాగతాలకు అడ్డుకట్ట వేయగలం.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్