ఈ తప్పులు చేస్తే బాస్‌తో తిప్పలే
close
Published : 17/11/2021 20:40 IST

ఈ తప్పులు చేస్తే బాస్‌తో తిప్పలే!

ఆఫీస్ ఏదైనప్పటికీ చాలా సందర్భాల్లో అందరూ కలిసి కోరస్‌గా తిట్టుకునేది ఒకరి గురించే... ఆ ఒక్కరు మరెవరో కాదు...బాసే. చాలామంది దృష్టిలో బాస్ అంటే పెద్ద భూతమే. కానీ ఆయన కోణంలోంచి చూస్తే మనవైపు నుంచి బోలెడన్ని తప్పులు కనిపించవచ్చు. మనల్ని మధ్య మధ్యలో కోప్పడనూవచ్చు. ఈ క్రమంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులను సరిదిద్దుకుంటే బాస్‌తో కూడా రిలేషన్ బాగుండడానికి అవకాశం ఉంటుంది.

లేట్‌గా వెడుతున్నారా?

మీరు ఆఫీస్‌కి తరచుగా ఆలస్యంగా వెళ్తున్నారా? ఇలా చేస్తే ఏ బాస్‌కైనా కోపం వస్తుంది. అలా కాకుండా సమయానికి వచ్చి మీపని మీరు పూర్తి చేసుకుని వెళ్లిపోతే ఏ సమస్యా ఉండదు. ఆలస్యంగా రావడం వల్ల మీరెంత బాగా పనిచేసినప్పటికీ మీపై నెగెటివ్ ఇంప్రెషన్ అలాగే ఉండిపోతుంది. పని వాతావరణాన్ని మీరు దెబ్బతీస్తున్నట్టే లెక్క. ఎందుకంటే మిమ్మల్ని చూసి మిగిలినవాళ్లు కూడా మీలా చేయడం మొదలుపెడతారు. కాబట్టి తప్పు మీవైపే ఉందని తెలుసుకోండి.

సడన్‌గా సెలవు తీసుకోవడం...

అప్పుడప్పుడూ అనుకోని సంఘటనలు జరిగితే ఓకే. అలాకాకుండా ముందస్తు సమాచారం లేకుండా తరచుగా అప్పటికప్పుడు సెలవు తీసుకుంటే బాస్‌కి కోపం రావడం సముచితమే. సడన్‌గా సెలవు తీసుకోవడం వల్ల మీరు పూర్తిచేయాల్సిన పని ఆగిపోతుంది. మీ బాస్‌పై వేరొక బాస్ ఉండవచ్చు. పని కానందుకు వాళ్లకు సమాధానం మీ బాసే చెప్పుకోవాల్సి వస్తుంది. అలా బాస్‌ని ఇబ్బంది పెట్టడం ఉత్తమ ఉద్యోగుల లక్షణం కాదు.

ఆఫీస్‌లో ముచ్చట్లు

ఆఫీస్‌కి రాగానే ముచ్చట్లు పెట్టుకోవడం చాలామందికి మామూలే. నోరు విప్పారంటే చాలు పక్కవారితో అలాగే మాట్లాడేస్తుంటారు. దీని వలన పని కాస్తా ఆగిపోతుంది. కంపెనీ ఉద్యోగమిచ్చింది కబుర్లు చెప్పుకోవడం కోసం కాదనే విషయం మనకు తెలిసిందే. మిమ్మల్ని పర్యవేక్షించే బాధ్యతను యాజమాన్యం నమ్మకంతో మీ బాస్‌కి అప్పగించింది. మీలాంటివారిపై కోపగించుకోవడం బాస్ విధిలో భాగమే.

తక్కువ పని చేయడం...

సాధారణంగా ఎక్కువ పని చేసేవాళ్లనే బాస్ ఇష్టపడడం జరుగుతుంది. ఏదో ఆఫీసుకి వచ్చాం కదా అని చెప్పి మొక్కుబడిగా పనిచేసి 'మమ' అనిపించుకుంటే మీపై సదభిప్రాయం ఎలా కలుగుతుంది? మీ పని శ్రద్ధగా పూర్తిచేసి, వేరే అసైన్‌మెంట్లు ఏవైనా ఉంటే వాటిని స్వీకరించడానికి మీరు సిద్ధమైనప్పుడే బాస్‌కి మీరంటే ఇష్టం ఏర్పడుతుంది. అలాగే పనికి సంబంధించి మీ ఆలోచనలూ పంచుకోవాలి. ఏవైనా విలువైన సూచనలు ఉంటే చెప్పాలి.

చేసిన తప్పులే మళ్లీమళ్లీ...

అప్పుడప్పుడు పనిలో తప్పులు జరగడం సహజమే. అలా కాకుండా తరచూ తప్పులు జరుగుతున్నాయంటే మనసు పెట్టకుండా పనిచేయడమే దీనికి కారణం. ప్రతిసారీ మీ తప్పులు గుర్తించి సరిచేయడం బాస్‌కి సాధ్యపడకపోవచ్చు. కొన్నిసార్లు అవి అలాగే పై అధికారుల వద్దకు వెళ్తాయి. ఇలాంటి సందర్భాల్లో మీ తప్పుకి కూడా మీ బాసే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరికైనా తప్పు చేసిన వారిపైన కోపం రావడం సహజం. అందుకే సాధ్యమైనంత వరకు మీ ద్వారా పనిలో ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి.

బ్రేక్‌లు, ఫోన్‌లో కబుర్లు

చాలామంది ఆఫీస్‌లో చేసే పని తక్కువ. తీసుకునే బ్రేక్‌లు ఎక్కువ. కొంతమంది ఫోన్‌లో మాట్లాడడమే మా ఉద్యోగం అన్నట్లుగా ఉంటారు. సీట్లో గట్టిగా గంట కూర్చోవడం వారికి తెలీదు. అలాంటివారిని చూడగానే బాస్‌కి కోపం రాకుండా ఉంటుందని ఎలా అనుకోగలం?

బాధ్యతలు తీసుకోకపోవడం

ఏదైనా పనిని మీకు అప్పగించినప్పుడు దాన్ని మీరు చేయడానికి ముందుకు రాకపోతే బాస్‌కి మీరు దూరమైనట్టే. మీలాగే అందరూ వెనుకంజ వేస్తే ఆ పని అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలోనూ బాస్ కోపంలో అర్థవంతమైన కారణం ఉంది.

ఎదుటివాళ్లపై తప్పు నెట్టడం

మీకు అప్పగించిన పని పూర్తికానప్పుడు ఆ తప్పును మీరు సులువుగా ఎదుటివాళ్లపై నెట్టేయచ్చు. కానీ నిజానికి ఆ పని బాధ్యత మీది. కాబట్టి బాస్ వాళ్లని కాకుండా మిమ్మల్నే టార్గెట్ చేయడం సహజం.

చూశారుగా...బాస్ కోణంలో ఆలోచిస్తే మన వైపు నుంచి ఎన్ని తప్పులు ఉంటాయో...సంస్థ ప్రతి ఉద్యోగినీ పర్యవేక్షించలేదు. అందుకే కొందర్ని బాస్ స్థానంలో కూర్చోబెట్టి పనులు చేయిస్తుంది. మీతో పని చేయించడం బాస్ కర్తవ్యం. ఈ క్రమంలో మీ పని మీరు బాధ్యతగా చేసి, ఆఫీస్ నియమావళి ప్రకారం నడుచుకుంటే బాస్ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. లేకుంటే మాత్రం బాస్‌తో మీకు తిప్పలు తప్పవు. అది మీ కెరీర్‌కి శాపమే.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని