ఇటు ఫుడ్ బిజినెస్.. అటు ‘మాస్టర్ చెఫ్’ టైటిల్ వేటలో..!

కొంతమంది మహిళలు ఇంటి కోసం కెరీర్‌ను త్యాగం చేస్తుంటారు.. మరికొందరు వృత్తి ఉద్యోగాల్లో పడిపోయి ఇంటికి తగిన సమయం కేటాయించలేకపోతారు. అయితే ఈ రెండింట్లో దేన్నీ త్యాగం చేయడానికి ఇష్టపడని వారూ కొందరుంటారు. కెరీర్‌ దారి కెరీర్‌దే.. ఇల్లు-పిల్లల బాధ్యతా ముఖ్యమే అంటారు.

Published : 24 Oct 2023 15:11 IST

(Photos: Twitter)

కొంతమంది మహిళలు ఇంటి కోసం కెరీర్‌ను త్యాగం చేస్తుంటారు.. మరికొందరు వృత్తి ఉద్యోగాల్లో పడిపోయి ఇంటికి తగిన సమయం కేటాయించలేకపోతారు. అయితే ఈ రెండింట్లో దేన్నీ త్యాగం చేయడానికి ఇష్టపడని వారూ కొందరుంటారు. కెరీర్‌ దారి కెరీర్‌దే.. ఇల్లు-పిల్లల బాధ్యతా ముఖ్యమే అంటారు. కశ్మీర్‌ లోయకు చెందిన డాక్టర్‌ రుక్సార్‌ సాఖిబ్‌ ఖాద్రి కూడా ఇదే మాట చెబుతున్నారు. ఆసక్తితో, పిల్లలకూ తగిన సమయం కేటాయించచ్చన్న ఉద్దేశంతో ఉద్యోగానికి బదులు వ్యాపారానికి ప్రాధాన్యమిచ్చారామె. ఓ ఫుడ్‌ వెంచర్‌ ప్రారంభించి కశ్మీర్‌ రుచుల్ని సరికొత్తగా ఆహార ప్రియులకు చేరువ చేస్తూ అనతికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న రుక్సార్‌.. ఇప్పుడు ‘మాస్టర్‌ చెఫ్‌ ఇండియా’ రియాల్టీ షోలోనూ దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపికైన తొలి కశ్మీరీ మహిళగా ఘనత సాధించిన ఆమె.. తాజాగా టాప్‌-12కు చేరుకున్నారు. మరి, అమ్మగా, వ్యాపారవేత్తగా బిజీగా ఉన్న రుక్సార్‌ ప్రయాణం మాస్టర్‌ చెఫ్‌ దాకా ఎలా సాగిందో తెలుసుకుందాం రండి..

కశ్మీర్‌ పుల్వామాలోని పామ్‌పోర్‌ అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది రుక్సార్‌. ఆహారంపై మక్కువతో తనను తాను ఫుడ్‌ లవర్‌గా పరిచయం చేసుకునే ఆమె.. ఇంట్లో ఖాళీ సమయాల్లో విభిన్న రకాల వంటకాలు తయారుచేసేది. అంతేకాదు.. వివిధ రకాల వంటకాలు, వాటి తయారీ, ప్రిజర్వేటివ్స్‌ ఉపయోగించకుండా సహజసిద్ధంగానే వాటిని నిల్వ చేసే పద్ధతులు.. తదితర విషయాల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపేది. ఇలా ఆహారంపై ఆమెకున్న అమితాసక్తితోనే ఫుడ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది రుక్సార్.

వంకలు పెట్టేవారు!

అయితే చదువు పూర్తయ్యాక ప్రభుత్వోద్యోగం చేసే అవకాశం వచ్చింది రుక్సార్‌కి. కానీ ఉద్యోగం కంటే తనకున్న పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించాలనుకున్నట్లు చెబుతున్నారామె.

‘చిన్నప్పట్నుంచి వంట చేయడమన్నా, రుచుల్ని ఆస్వాదించడమన్నా ఎంతో ఇష్టపడేదాన్ని. ఇంట్లో నేను చేసిన వంటలకు మా ఇంట్లో వాళ్లే వంకలు పెట్టేవారు. ఆ వంటకంలో ఏ లోపాలున్నా నిర్మొహమాటంగా చెప్పేవారు. ఒక రకంగా ఇది నన్ను నేను మెరుగుపరచుకునేందుకు దోహదపడింది. అమ్మాయిలు ఇలానే ఉండాలి, అదే చేయాలి అన్న ఆంక్షలేవీ నాకు లేవు. అమ్మానాన్న నా ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమిచ్చేవారు. వాళ్ల ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు వంటల పోటీల్లో పాల్గొని బహుమతులూ అందుకున్నా. ఇంట్లోనే విభిన్న రకాల స్నాక్స్‌ తయారుచేసి పలు ఫుడ్‌ ఎగ్జిబిషన్లలోనూ ప్రదర్శించా. ఇక పెళ్లయ్యాక భర్త ప్రోత్సాహం కూడా తోడైంది. కానీ పిల్లలు పుట్టాక ఇంటి బాధ్యతలు, వాళ్ల ఆలనా పాలనతో వ్యాపారం ఆలోచన కొన్నాళ్ల పాటు వాయిదా వేశాను..’ అంటోన్న రుక్సార్‌.. తన ఇద్దరు పిల్లలు కాస్త పెద్దయ్యాక తిరిగి తన వ్యాపార ఆలోచనను ఆచరణలో పెట్టానంటున్నారు. అలా 2019లో ‘Khalis Foods’ పేరుతో ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించారామె.

రుచికే కాదు.. శుచికీ ప్రాధాన్యం!

శీతలీకరించిన ఆహార పదార్థాల్ని (Frozen Foods) అందించే వేదిక ఇది. ఈ క్రమంలో మాంసాహారంతో చేసిన స్నాక్స్‌, బేకింగ్‌ పదార్థాలు.. ఇలా ప్రతిదీ విభిన్న రుచుల్లో ఆరోగ్యకరంగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు రుక్సార్.

‘ఉద్యోగం చేస్తే నేనొక్కదాన్నే లాభపడతాను. అదే వ్యాపారం ప్రారంభిస్తే మరికొందరికి ఉపాధి కల్పించచ్చు. పైగా ఎదిగే పిల్లలకు తల్లి అవసరం చాలానే ఉంటుంది. కాబట్టి ఇటు బిజినెస్‌ పనులు చేసుకుంటూనే.. అటు పిల్లల్నీ చూసుకోవచ్చనిపించింది. అందుకే ప్రభుత్వోద్యోగం చేసే అవకాశం వచ్చినా దాన్ని వదులుకున్నా. ఇక మార్కెట్లో ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ చాలానే ఉన్నాయి.. అయితే వాటిలోనూ కృత్రిమ ప్రిజర్వేటివ్స్‌ కలిపినవి, కల్తీ ఉన్నవే ఎక్కువగా దొరుకుతున్నాయి. అందుకే వీటికి భిన్నంగా పూర్తి ఆరోగ్యకరంగా, సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్స్‌ కలిపి తయారుచేసిన ఫ్రోజెన్‌ ఫుడ్స్‌నే మార్కెట్లోకి తీసుకొస్తున్నా. కశ్మీర్‌లో ప్రాచుర్యం పొందిన రుచులకు ప్రాధాన్యమిస్తున్నా. ప్రస్తుతం మా వద్ద.. చికెన్‌ కీమా సమోసా, కలరీ ఛీజ్‌ సమోసా, చికెన్‌ పాప్‌కార్న్‌, చికెన్‌ స్ట్రిప్స్‌, చికెన్‌ స్ప్రింగ్‌ రోల్స్‌.. ఇలా వెరైటీ మాంసాహార స్నాక్స్‌, శాకాహార స్నాక్స్‌, ఇతర బేకింగ్‌ ఐటమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఆయా పదార్థాల్ని బట్టి ఎన్ని రోజుల వరకు వాటిని ఉపయోగించచ్చో లేబుల్‌పై పొందుపరుస్తాం. ఇలా వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల్లో తయారుచేసుకొని తినేయచ్చు. తినడానికి సిద్ధంగా ఉన్న ఇలాంటి పదార్థాలు స్కూలుకెళ్లే పిల్లలకు, ఉద్యోగాలు చేసే మహిళలకు.. ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.. అందుకే మా ఉత్పత్తుల్ని చాలామంది మహిళలు/అమ్మలు ఆదరిస్తున్నారు..’ అంటున్నారీ ఫుడ్‌ లవర్.

‘మాస్టర్‌ చెఫ్‌’ టైటిల్‌ వేటలో..!

ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా తన ఉత్పత్తుల్ని విక్రయిస్తోన్న రుక్సార్‌.. త్వరలోనే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికల పైకీ తన వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు చెబుతున్నారు. అయితే తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని మరింతమందికి చేరువ చేసే అరుదైన అవకాశాన్ని ‘మాస్టర్‌ చెఫ్‌ ఇండియా’ రియాల్టీ షో ఆమెకు అందించింది. ఈ క్రమంలోనే జూన్‌లో ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన రుక్సార్‌.. ప్రస్తుతం జరుగుతోన్న సీజన్‌-8లో పోటీ పడుతోంది. ఇలా ఈ ప్రముఖ రియాల్టీ షోకు ఎంపికైన తొలి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిన ఆమె.. తాజాగా టాప్‌-12లో చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో విభిన్న కశ్మీరీ రుచుల్ని తయారుచేసి జడ్జిల మనసు గెలుచుకుంటూ ముందుకు సాగుతోన్న ఆమె.. టైటిల్‌ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
‘ఆంక్షలు, కట్టుబాట్ల కారణంగా మా ప్రాంతంలో చాలామంది అమ్మాయిలు ఆసక్తి ఉన్నా ఇలాంటి కార్యక్రమాల్లో, పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈ మూసధోరణుల్ని బద్దలు కొడుతూ ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. అప్పుడే మన శక్తిసామర్థ్యాలేంటో బయటపడతాయి. ఇలాంటి ఔత్సాహిక యువతీ యువకుల్ని ప్రోత్సహించడానికే భవిష్యత్తులో ఓ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నా. పాకశాస్త్రంలోని మెలకువల్ని వారికి నేర్పించాలనుకుంటున్నా. ఫలితంగా వారికి ఉపాధీ దొరుకుతుంది.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లగలుగుతారు..’ అంటూ తనలోని సామాజిక స్పృహ చాటుకుంది రుక్సార్‌. ఇలా తన పాకశాస్త్ర ప్రావీణ్యానికి గుర్తింపుగా పలు అవార్డులు-రివార్డులూ ఆమె సొంతమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్