అలాంటి విషయాల గురించి పిల్లలకు ఎలా చెప్పాలి?

పిల్లలు సున్నిత మనస్కులు. ఎవరేం చెప్పినా నమ్మేస్తారు.. కళ్లతో చూసిందే నిజమనుకుంటారు. అయితే ఇవి వారిలో సానుకూల దృక్పథం నింపేవైతే సమస్య లేదు. కానీ వారిలో అనవసర ఆసక్తిని రేకెత్తించే సున్నితమైన అంశాలైతే.. వారిని పెడదోవ పట్టించే ప్రమాదం ఉంటుంది. శృంగారం, నెలసరి, గర్భనిరోధక పద్ధతులు....

Published : 02 Nov 2022 14:48 IST

పిల్లలు సున్నిత మనస్కులు. ఎవరేం చెప్పినా నమ్మేస్తారు.. కళ్లతో చూసిందే నిజమనుకుంటారు. అయితే ఇవి వారిలో సానుకూల దృక్పథం నింపేవైతే సమస్య లేదు. కానీ వారిలో అనవసర ఆసక్తిని రేకెత్తించే సున్నితమైన అంశాలైతే.. వారిని పెడదోవ పట్టించే ప్రమాదం ఉంటుంది. శృంగారం, నెలసరి, గర్భనిరోధక పద్ధతులు, అత్యాచారాలు, భార్యాభర్తల మధ్య విడాకులు, వివాహేతర సంబంధాలు.. ఈ విషయాలన్నీ ఆ కోవలోకే వస్తాయి. చాలామంది తల్లిదండ్రులు వీటి గురించి పిల్లలకు వివరించడానికి ఆసక్తి చూపరు. దీంతో వీటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇంటర్నెట్‌లో శోధించడం, స్నేహితుల ద్వారా తెలుసుకోవడం.. వంటివి చేస్తారు. ఫలితంగా వారు పెడదోవ పట్టేందుకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. వీటి గురించి తెలుసుకోవడానికి వాళ్లు ఇతర మార్గాల్ని అన్వేషించకముందే పేరెంట్సే ఆయా విషయాల గురించి సానుకూలంగా వివరించడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ముందు మీరు సిద్ధం కండి!

ఏ విషయం గురించైనా లోతుగా తెలుసుకోవాలన్న ఆసక్తి పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక ఇలాంటి సున్నితమైన అంశాలైతే మరీనూ! ఇలాంటప్పుడు ఆయా అంశాల గురించి వారికి సానుకూలంగా వివరించాలంటే.. ముందు తల్లిదండ్రులకు దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. అంతేకానీ.. ఏదో మీకున్న మిడి మిడి జ్ఞానంతో ఆయా అంశాల గురించి వారికి పరిచయం చేసి వదిలేస్తే.. దానికి సంబంధించిన సందేహాలు, ప్రశ్నల గురించి తెలుసుకోవడానికి వారు ఇతర మార్గాల్ని వెతుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రమాదకరం కూడా! కాబట్టి ముందుగా మీరు సిద్ధమై పిల్లలకు సోదాహరణపూర్వకంగా వివరించడంతో పాటు.. వారికి ఏమైనా సందేహాలుంటే నిర్మొహమాటంగా మిమ్మల్నే అడగమని చెప్పండి. ఫలితంగా వారు పెడదోవ పట్టకుండా జాగ్రత్తపడచ్చు.

ఆ సమయాల్లో వద్దు!

ఈతరంలో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య కమ్యూనికేషన్‌ అంతంత మాత్రంగానే ఉంటోంది. ఎందుకంటే పేరెంట్స్‌ ఆఫీస్‌/బిజినెస్‌/ఇతర పనుల హడావిడిలో రోజంతా నిమగ్నమై ఉండడం, పిల్లలకు స్కూల్‌-హోమ్‌వర్క్‌తో సమయం సరిపోవడంతో.. ఉదయం లేవగానే ఓ గుడ్‌మార్నింగ్‌, రాత్రి పడుకునే ముందు గుడ్‌నైట్‌, ఆ మధ్యలో డైనింగ్‌ టేబుల్‌ దగ్గర వీలుంటే కొన్ని విషయాల గురించి చర్చించుకోవడం.. చాలామంది ఇళ్లలో ఇదే రొటీన్‌ కొనసాగుతోంది. ఈ నిర్లక్ష్యమే పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరం పెంచుతుందంటున్నారు నిపుణులు. ఇక కొంతమంది పేరెంట్స్ వారికి ఇలాంటి సున్నితమైన అంశాల గురించి వివరించాలనుకున్నా.. వాళ్లు నిద్రపోయే సమయంలోనో లేదంటే వీళ్లకు కాస్త ఖాళీ దొరికినప్పుడో హడావిడిగా ముగించేస్తుంటారు. ఇలాంటి విషయాల గురించి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఈ ఆదరాబాదరా కూడదంటున్నారు నిపుణులు. దీనివల్ల సమాచారం పూర్తిగా వారికి అందదు. తద్వారా లేనిపోని ఆలోచనలు వారిలో రేకెత్తించినవారవుతారు. కాబట్టి ఇలాంటి విషయాల గురించి పిల్లలతో మాట్లాడాలనుకుంటే.. మీరు ఖాళీగా ఉన్న సమయాలు, వారి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు వివరిస్తే సానుకూల ఫలితాలుంటాయి.

అపోహలు తొలగించాలి!

పిల్లలు ఏ విషయం గురించైనా లోతుగా తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఏదైనా కొత్త అంశం గురించి చెప్తే.. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటారు. వీటికి తోడు వారి చిన్ని మనసులో బోలెడన్ని సందేహాలు, అపోహలు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకునే దాకా వారి మనసు మనసులో ఉండదు. కాబట్టి మీరు ఆయా అంశాల గురించి వారికి వివరించినప్పుడు వారి మనసులో ఉన్న సందేహాలన్నీ అడగనివ్వండి.. అపోహలు నివృత్తి చేసుకోనివ్వండి. అంతేకానీ.. ‘ఈ విషయం గురించి ఇంకేమీ అడగొద్దు.. నీకు అనవసరం’ అంటూ వారిని వారించే ప్రయత్నం చేస్తే మాత్రం మొండి పట్టుదలతో ఇతర మార్గాల్ని అన్వేషించడం ఖాయం. కాబట్టి ఇలా జరగకుండా చూసే బాధ్యత మీదే!

ఆ భరోసా ఇవ్వండి!

ప్రతి టాపిక్‌లో సానుకూల, ప్రతికూల అంశాలుంటాయి. కాబట్టి వాటి గురించి సానుకూలంగా వివరిస్తే పిల్లలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. అదే అందులోని నెగెటివ్‌ కోణాల్ని స్పృశించాల్సి వస్తే మాత్రం వారి మనసుపై కాస్త ప్రతికూల ప్రభావం పడడం సహజం. ఉదాహరణకు.. ఓ అత్యాచార సంఘటన గురించి చెప్పాల్సి వస్తే.. అది కచ్చితంగా వారి మనసుపై ప్రతికూల ప్రభావం పడే అంశమే! ఇలాంటి పరిస్థితే తమకూ ఎదురైతే ఎలా అన్న ఆలోచన వారిని మరింత భయపెడుతుంది. కాబట్టి ఇలాంటి ఘటన గురించి చెబుతూనే.. వీటిని నివారించే మార్గాల గురించి కూడా పిల్లలకు చెప్పాలి. ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం, అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండడం.. వంటి జాగ్రత్తల వల్ల ముప్పును తప్పించుకోవచ్చన్న కొన్ని చిట్కాలు వారికి వివరించి చూడండి.. అంతేకాదు.. ఆయా జాగ్రత్తలు చెప్పడం, మీ చిన్నారులకూ ఆత్మ రక్షణ విద్యలు నేర్పించడం వల్ల అటు వారికి, ఇటు మీకూ మేలు కలిగిస్తుంది.

ఇలా ఇవన్నీ ఇంట్లో ఆడ, మగ పిల్లలుంటే వేర్వేరుగా కాకుండా.. కలిపే వివరించడం, సమానంగా పెంచడం వల్ల పిల్లలు పెడదోవ పట్టకుండా, వారి వల్ల సమాజానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్