Published : 03/12/2022 18:56 IST

గుడ్డు పెంకులతో చర్మ సౌందర్యం!

వ్యర్థాలు అంటూ వంటింట్లో చాలా పదార్థాల్ని పడేస్తుంటాం.. కానీ వాటితోనూ బోలెడన్ని ఉపయోగాలున్నాయని తెలుసుకొని ఆశ్చర్యపోతుంటాం. గుడ్డు పెంకులు కూడా అలాంటివే! ఇంటి మొక్కలకు ఎరువుగా, చీడపీడల్ని నివారించడానికి.. ఇలా పలు రకాలుగా ఉపయోగపడే ఇవి చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలోనూ దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు.

ముఖానికి మెరుపు!

చర్మంపై ఏర్పడే మృతకణాల వల్ల ముఖం అంద విహీనంగా కనిపిస్తుంది. అయితే వాటిని తొలగించి.. వాటి స్థానంలో కొత్త కణాల్ని ఉత్పత్తి చేసే గుణాలు గుడ్డు పెంకుల్లో ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులోని క్యాల్షియం కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా.. కొన్ని గుడ్డు పెంకుల్ని తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని మెత్తటి పొడిలా చేసుకొని.. ఒక గుడ్డు తెల్లసొనలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని అరగంటయ్యాక కడిగేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ వల్ల ముఖానికి తేమ అందుతుంది.. ఇది చర్మానికి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. తద్వారా మృతకణాలు తొలగిపోయి ముఖం మెరుపును సంతరించుకుంటుంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే సత్వర ఫలితం ఉంటుంది.

సున్నితమైన చర్మమా?

సున్నితమైన చర్మం ఉన్న వారు ఏ వాతావరణాన్నీ తట్టుకోలేరు. ఎండ వేడికి త్వరగా కందిపోవడం, చల్లటి వాతావరణంలో చర్మం పొడిబారిపోవడం, ఎర్రటి దద్దుర్లు.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వారు గుడ్డు పెంకుల్ని ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం గుడ్డు పెంకుల్ని బాగా కడిగి పొడి చేసుకోవాలి. ఒక బౌల్‌ యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ తీసుకొని.. ఈ పొడిని అందులో వేసి బాగా కలుపుకొని ఐదు రోజుల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఒక కాటన్‌ బాల్‌ని ఈ మిశ్రమంలో ముంచి, పిండి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ఆయా సమస్యలు తగ్గుముఖం పట్టడం గమనించచ్చు.

మంచి ఫలితాన్నిస్తుంది కదా అని ఏదైనా అతిగా వాడితే అనర్థమే.. అలాగే గుడ్డు పెంకుల్లోని క్యాల్షియం కూడా మోతాదుకు మించితే మంచిది కాదంటున్నారు నిపుణులు. కాబట్టి ఏ ప్యాక్‌లో ఎంత వాడాలన్న విషయంలో వ్యక్తిగత సౌందర్య నిపుణుల్ని సంప్రదించడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని