365 రోజులు.. 365 పనులు.. ఈ అమ్మాయి ఐడియాకు ప్రపంచం ఫిదా!

ఒత్తిడి, ఆందోళనలు మనకు కొత్త కాదు.. ఇక కరోనా తర్వాత అవి మరింత పెరిగాయని చెప్పచ్చు. అయితే వీటిని దూరం చేసుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని అనుసరిస్తారు. ఫలితం లేకపోతే వాటిని మధ్యలోనే వదిలేస్తుంటారు. ఇంగ్లండ్‌కు చెందిన జెస్‌ మెల్‌ మాత్రం అలా చేయలేదు. తనలోని మానసిక సమస్యల్ని జయించడానికి.....

Updated : 07 Jan 2023 16:18 IST

(Photos: Instagram)

ఒత్తిడి, ఆందోళనలు మనకు కొత్త కాదు.. ఇక కరోనా తర్వాత అవి మరింత పెరిగాయని చెప్పచ్చు. అయితే వీటిని దూరం చేసుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని అనుసరిస్తారు. ఫలితం లేకపోతే వాటిని మధ్యలోనే వదిలేస్తుంటారు. ఇంగ్లండ్‌కు చెందిన జెస్‌ మెల్‌ మాత్రం అలా చేయలేదు. తనలోని మానసిక సమస్యల్ని జయించడానికి ఓ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. నెల కాదు, రెండు నెలలు కాదు.. ఏడాది పాటు క్రమం తప్పకుండా తన ఆలోచనను ఆచరణలో పెట్టింది.. ఫలితంగా డిప్రెషన్‌ను జయించడమే కాదు.. గతంలో కంటే రెట్టింపు ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నానంటోంది. మరి, జెస్‌ తన ఆందోళనను జయించడానికి ఏం చేసింది? ఆ సీక్రెట్‌ ఏంటో మీరే చదివేయండి!

ఆగ్నేయ ఇంగ్లండ్‌కు చెందిన 34 ఏళ్ల జెస్‌ మెల్‌.. మనలాగే ఒక సాధారణ అమ్మాయి. కరోనా సమయంలో మనం ఎంతలా కుంగిపోయామో.. తానూ అంతే ఆందోళనకు గురైంది. కరోనా తర్వాత కూడా మనలాగే తానూ కుదురుకోలేకపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సమస్యలు తన శారీరక ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం చూపడం గమనించింది జెస్‌. ఎలాగైనా తన జీవనశైలిని మార్చుకొని ఈ సమస్యల్ని జయించాలని నిర్ణయించుకుందామె.

వంద రోజులనుకొని..!

ఇలా ఆలోచిస్తోన్న క్రమంలోనే జెస్‌కు ఓ ఆలోచన తట్టింది. రోజుకో కొత్త పనిచేస్తూ వాటిలోనే ఆనందం వెతుక్కోవాలనుకుంది. ఇలా తొలుత వంద రోజులు చేయాలనుకొని 2021, డిసెంబర్‌ 27న ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టిందామె. మొదటి రోజున ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ప్రారంభించడం దగ్గర్నుంచి మొదలుపెట్టి.. ల్యాంప్‌షేడ్‌ తయారుచేయడం, మొక్క నాటడం, హాట్‌ యోగా చేయడం, జుట్టుకు రంగేసుకోవడం, మఫిన్స్‌ తయారీ, ట్యాటూ వేయించుకోవడం, వీగన్‌ వంటకం తయారీ, కుట్టుపని నేర్చుకోవడం, తేనెటీగల పెంపకం, వ్యాన్‌ నడపడం, తాబేలు సంరక్షణ, జుంబా నేర్చుకోవడం, కొత్త వంటకాలు తినడం, రక్తదానం చేయడం.. ఇలా రోజుకో పని చేస్తూ బిజీగా మారిపోయింది జెస్‌. ఈ క్రమంలో ఆయా మెలకువలు నేర్చుకోవడమే కాదు.. ఈ పనులన్నీ తనలోని మానసిక ఒత్తిళ్లను దూరం చేసి ప్రశాంతతను అందించాయంటోందీ ఇంగ్లిష్‌ లేడీ.

‘గతేడాది ఏప్రిల్‌ నాటికి నా వంద రోజుల ఛాలెంజ్‌ పూర్తిచేశా. రోజుకో పని చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించేది. నాలో మార్పును చూసుకొని నేనే ఆశ్చర్యపోయేదాన్ని. అందుకే ఈ ప్లాన్‌ని 365 రోజులకు విస్తరించాలనుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది జెస్.

ఈ పనుల్లో ప్రశాంతత దొరికింది!

ఇక ప్లాన్‌ను కొనసాగించాలనుకున్న తర్వాత కూడా.. మరికొన్ని కొత్త పనులను తన లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకుంది జెస్‌. ఈ క్రమంలో గుమ్మడికాయలు కోయడం, ఐస్‌ హాకీ మ్యాచ్‌కి వెళ్లడం, ఎస్కలేటర్‌కు వ్యతిరేక దిశలో పరిగెత్తడం, ఆన్‌లైన్‌ వంటల తరగతులకు హాజరవడం, స్కేటింగ్‌, గోల్ఫ్‌ ఆడడం, వివిధ దేశాల్లో పర్యటించడం, విమాన ప్రయాణం చేయడం, లైన్‌ డ్యాన్సింగ్‌, స్పీడ్‌ డేటింగ్‌.. ఇలా మరికొన్ని సరికొత్త పనులతో ఇటీవలే ఏడాదిని పూర్తి చేసుకుందీ బ్రిటిష్‌ అమ్మాయి. రోజుకో కొత్త పని చొప్పున 365 రోజుల పాటు తాను చేసిన 365 పనులకు సంబంధించిన విషయాల్ని, ఫొటోల్ని, వీడియోల్ని ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేసింది జెస్.

‘నేను చేసిన పనుల్లో కొన్ని సాహసాలున్నాయి.. మరికొన్ని సులభంగా పూర్తయ్యేవి ఉన్నాయి.. ఇంకొన్ని మీకు సిల్లీగానూ అనిపించచ్చు. కానీ వీటిలో నాకు బోలెడంత ఆనందం దొరికిందన్నది మాత్రం వాస్తవం. ఈ పనులతో ఇంతకుముందెన్నడూ లేనంత ప్రశాంతగా ఉన్నాననిపిస్తోంది. అందుకే 365 రోజుల ఛాలెంజ్‌ పూర్తైనప్పటికీ మరిన్ని కొత్త పనులు చేస్తూ.. ఇకపైనా ఈ ఛాలెంజ్‌ని కొనసాగించాలనుకుంటున్నా..’ అంది జెస్.

ఇలా ఈ ఇంగ్లిష్‌ అమ్మాయి ఇటీవలే పూర్తిచేసిన ఈ ఛాలెంజ్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరలవుతోంది. చాలామంది ఈ బ్రిటిష్‌ బ్యూటీని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందాం.. మేమూ మీలాగే రోజుకో కొత్త పని చేస్తూ ఒత్తిడిని అధిగమిస్తాం..’ అంటున్నారు. మొత్తానికి జెస్‌ ఛాలెంజ్‌ భలే కొత్తగా ఉంది కదూ! అయితే ఆలస్యమెందుకు? మనమూ ట్రై చేద్దామా మరి?!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్