‘కిచిడీనా.. ఎవరు తింటారు’ అనేవారు!

జీవితంలో కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి.. అప్పుడే విజయ శిఖరాలకు చేరుకుంటాం. ఈ మాటలు అభా సింఘాల్‌కు సరిగ్గా నప్పుతాయి. 12 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నా.. హాస్టల్‌లో ఉంటూ కష్టపడి చదువుకుంది.

Published : 07 Nov 2023 12:23 IST

(Photos: Instagram)

జీవితంలో కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి.. అప్పుడే విజయ శిఖరాలకు చేరుకుంటాం. ఈ మాటలు అభా సింఘాల్‌కు సరిగ్గా నప్పుతాయి. 12 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నా.. హాస్టల్‌లో ఉంటూ కష్టపడి చదువుకుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి పార్ట్‌ టైం ఉద్యోగం చేసింది. చదువులో చక్కటి ప్రతిభ కనబరిచి స్కాలర్‌షిప్‌తో లండన్‌లో ఎంబీయే చేసింది. అయితే సొంతంగా ఎదగడం కోసం ఇంటి నుంచి బయటికొచ్చేసిన ఆమె పలు కష్టాలు అనుభవించింది. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ఓ ఫుడ్‌ వ్యాపారం ప్రారంభించిన అభా.. ఇప్పుడు కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. మరి, కష్టాలకే సవాలు విసురుతూ తాను సాగిస్తోన్న వ్యాపార ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..!

నా బాల్యమంతా సవాళ్లతోనే సాగింది. అమ్మానాన్నలు నాకు 12 ఏళ్లు ఉన్నప్పుడు విడాకులు తీసుకున్నారు. దానివల్ల తల్లిదండ్రులతో సంతోషంగా గడపాల్సిన నా బాల్యం హాస్టళ్లు, బోర్డింగ్‌ స్కూల్స్‌లోనే గడిచిపోయింది. భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒక్కటే మార్గం అనిపించింది. కష్టపడి చదివి లండన్‌లో ఎంబీయే సీటు సంపాదించా. స్కాలర్‌షిప్‌కూ ఎంపికయ్యాను. అయితే ఆ డబ్బులు సరిపోయేవి కావు. దాంతో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ ఎంబీయే పూర్తిచేశాను. ఆపై ఇండియాకు తిరిగొచ్చా.

ఫ్రెండ్‌ సలహాతో..!

వయసొచ్చాక పెళ్లి చేసుకోవాలి.. వివాహమయ్యాక ఇంటికే పరిమితమవ్వాలి.. అన్న మూసధోరణులకు నేను విరుద్ధం. అందుకే ముందు నా కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకున్నా. ఈ ఆలోచనతోనే ముంబయికి చేరుకున్నా. ఓ స్నేహితురాలితో కలిసి చిన్న గదిని అద్దెకు తీసుకొని ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించా. ఓ సంస్థలో ఉద్యోగమొచ్చింది. జీతంలో సగం డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోయేవి. ఖర్చులు తగ్గించుకోవడానికి పదే పదే కిచిడీ చేసుకొని తినేదాన్ని. కొన్నిసార్లు కిచిడీనే కొత్తగా ట్రై చేసేదాన్ని. ఓసారి ఇంటికొచ్చిన నా ఫ్రెండ్‌కూ ఓ వెరైటీ కిచిడీ వంటకాన్ని రుచి చూపించాను. అది తనకు బాగా నచ్చడంతో ‘కిచిడీతోనే వ్యాపారం ప్రారంభించచ్చుగా’ అని సలహా ఇచ్చారు. అదీ నాకు నచ్చడంతో స్టార్టప్‌ ప్రయత్నాలు ప్రారంభించా.

‘కిచిడీ ఎక్స్‌ప్రెస్‌’ అలా!

అయితే వ్యాపారమంటే మాట్లాడుకున్నంత సులభం కాదు. బోలెడంత పెట్టుబడి కావాలి. నష్టమొచ్చినా భరించేంత ధైర్యం కావాలి. మధ్యమధ్యలో వచ్చే సవాళ్లనూ ఎదుర్కొనే ఓర్పు-నేర్పు ఉండాలి. ఇవన్నీ ఆలోచించి ముందు మార్కెటింగ్‌ నైపుణ్యాలపై మరింత పట్టు పెంచుకున్నా. ఆ తర్వాతే నా ఫ్రెండ్‌తో కలిసి 2019లో ‘కిచిడీ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో హైదరాబాద్‌ వేదికగానే వ్యాపారం ప్రారంభించా. దీనికి క్లౌడ్‌ కిచెన్‌ పద్ధతిని ఎంచుకున్నాం. ఇక మా కిచిడీ రెసిపీస్‌లో భాగంగా.. పాలకూర, పుట్టగొడుగులు, ఛీజ్‌, సోయా, క్వినోవా వంటి ఆరోగ్యకరమైన పదార్థాలతో రుచికరమైన కిచిడీ వంటకాలను వండి వార్చుతున్నాం. ముఖ్యంగా సాబుదానా కిచిడీ, పాలక్‌ కార్న్‌ కిచిడీ, టొమాటో కిచిడీ, క్వినోవా కిచిడీ, స్ప్రౌట్స్‌ కిచిడీ.. వంటివి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.

కరోనాతో కలిసొచ్చింది!

‘కిచిడీ ఎక్స్‌ప్రెస్‌’ ప్రారంభించిన మొదట్లో చాలా విమర్శలొచ్చాయి. ‘ఒంట్లో బాగోలేనప్పుడు తినే కిచిడీని రోజూ ఎవరు తింటారు?’ అనే వారు.. ‘వ్యాపారంలో నష్టాలూ ఉంటాయి.. చక్కగా ఉద్యోగం చేసుకోక.. ఎందుకీ వృథా ప్రయాస?’ అన్న వారూ లేకపోలేదు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. వాళ్లందరి అభిప్రాయం తప్పని నిరూపించాలనుకున్నా. అయితే హైదరాబాద్‌లో బిర్యానీకే ఎక్కువగా ఆదరణ ఉంటుంది. దాంతో మొదట్లో మాకు ఆర్డర్లు కూడా తక్కువగా వచ్చేవి. అదే సమయంలో మాకు ‘ప్రొ కబడ్డీ లీగ్‌’లో క్యాటరింగ్‌ చేసే అవకాశమొచ్చింది. మా వంటకాలకు వారి నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. అలా క్రమంగా ఆర్డర్లు పెరగడం మొదలయ్యాయి. ఇక కరోనా సమయంలో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కానీ, మా స్టార్టప్‌కు మాత్రం అది అనుకూల సమయమని చెప్తా. కిచిడీ ఆరోగ్యకరమైన ఆహారం కావడంతో అప్పుడు చాలామంది మా కిచిడీనే ఆర్డర్‌ చేసుకునేవారు. అది మాకు మరింతగా కలిసొచ్చిన అంశం. ఈ సమయంలో కొంతమందికి ఉచితంగానే కిచిడీ పంపిణీ చేశాం. ఇలా ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేయడం కోసం మూడు లక్షలతో ప్రారంభించిన మా వ్యాపారం ఇప్పుడు 50 కోట్ల టర్నోవర్‌ను అందుకుంది. కాలక్రమేణా మా బ్రాంచ్‌లనూ విస్తరించాం. ప్రస్తుతం మాకు హైదరాబాద్‌, ముంబయిలలో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 8 బ్రాంచ్‌లు ఉన్నాయి. మరో మూడు బ్రాంచ్‌లను త్వరలోనే ప్రారంభించబోతున్నాం. భవిష్యత్తులో ‘కిచిడీ ఎక్స్‌ప్రెస్‌’ని అంతర్జాతీయంగా 300 శాఖల్లో విస్తరించాలన్న ఆలోచన ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్