Deepfake: అలాంటి ఫొటోలు.. వీడియోల్లో ఏది ఫేక్‌.. ఏది రియల్‌.. గుర్తించడమెలా?!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌.. వంటి సాంకేతికతలు మన పనుల్ని సులభతరం చేస్తుంటే మురిసిపోతున్నాం.. మన ప్రమేయం లేకుండా కొన్ని పనులు వాటంతటవే చేసేస్తుంటే రిలాక్సవుతున్నాం.

Published : 08 Nov 2023 12:56 IST

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌.. వంటి సాంకేతికతలు మన పనుల్ని సులభతరం చేస్తుంటే మురిసిపోతున్నాం.. మన ప్రమేయం లేకుండా కొన్ని పనులు వాటంతటవే చేసేస్తుంటే రిలాక్సవుతున్నాం. కానీ ఇదే కృత్రిమ మేధ మనల్ని పెడదారి పట్టిస్తే.. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తే..?? తాజాగా ప్రముఖ నటి రష్మిక మార్ఫింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినప్పట్నుంచి ఇదే చర్చ జరుగుతోంది. సమాజంలో పలుకుబడి ఉన్న సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్య మహిళల్ని ఈ ఫేక్‌ టెక్నాలజీ బారి నుంచి ఎవరు కాపాడతారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఎవరి కోసమో ఎదురుచూడకుండా, పరిస్థితి ఇంత దాకా రాకుండా ఉండాలంటే.. సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసే ఫొటోలు, వీడియోల విషయంలో ఎవరికి వారే పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం రండి..

ఏంటీ డీప్‌‘ఫేక్’?

ఒక వ్యక్తి రూపాన్ని మరో వ్యక్తి రూపంతో చూపించే మార్ఫింగ్‌ గురించి మనకు తెలిసిందే! అయితే డీప్‌ఫేక్‌లో రూపంతో పాటు ఆ వ్యక్తే మాట్లాడుతున్నట్లుగా క్రియేట్ చేయచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక వ్యక్తికి డూప్‌ని సృష్టించడం ఈ టెక్నాలజీతో సాధ్యమవుతుంది. డీప్‌ఫేక్‌లో భాగంగా ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతల సహాయంతో ఫొటోలు, ఆడియో, వీడియోలకూ నకిలీ సృష్టించచ్చు. అయితే ఈ క్రమంలో వాస్తవికతకు ఎంత దగ్గరగా వీటిని రూపొందించాలని ప్రయత్నించినా నకిలీ నకిలీనే అంటున్నారు నిపుణులు. ఇలాంటి ఫేక్‌ వీడియోలు/ఆడియోలు/ఫొటోలు వాస్తవికతకు చాలావరకు దగ్గరగానే కనిపించినా.. అవి నకిలీవి అని తేల్చడానికి వాటిలో దాగి ఉన్న సూక్ష్మమైన లొసుగుల్ని పసిగట్టగలిగితే చాలంటున్నారు.

ఈ తేడాలున్నాయా?

మామూలుగా ఎవరైనా సరే తమకు సంబంధించిన ఏదైనా అసభ్యకరమైన వీడియో/ఫొటో నెట్టింట్లో కనిపిస్తే ఒక్కసారిగా భయపడతారు. అందరూ దాన్ని చూసేస్తే పరువు పోతుందని ఆందోళన చెందుతారు అంతేకాదు కొంతమంది క్షణికావేశంతో ఆత్మహత్యలకూ పాల్పడుతుంటారు. అయితే ఈ సమయంలో ఆవేశంతో కాకుండా.. ఆలోచన/సమయస్ఫూర్తితో వ్యవహరించడం అవసరం అంటున్నారు నిపుణులు. అసలు ఈ వీడియో/ఫొటో తమదేనా? లేదంటే కావాలనే ఎవరైనా మార్ఫింగ్‌ చేశారా? వీటిలో ఎంతవరకు నిజం ఉంది? అని ఒక్క క్షణం ఆలోచించగలిగితే.. అసలు విషయం అర్థమవుతుందంటున్నారు. ఈ క్రమంలో సంబంధిత ఫొటో/వీడియో/ఆడియోలో కొన్ని తేడాల్ని కనిపెట్టగలిగితే.. అది అసలా? నకిలీదా అన్న విషయం ఇట్టే గుర్తించచ్చంటున్నారు.

కళ్ల కదలికల్ని బట్టి డీప్‌ఫేక్‌ వీడియోల్ని గుర్తించచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే అసలైన వీడియోల్లో వ్యక్తి మాట్లాడే మాటలు, చేతలు, కంటి కదలికలు.. ఇలా అన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అదే ఫేక్‌ వీడియోల్లో మాటలు/చేతలు ఒకలా ఉంటే కంటి కదలికలు మరోలా ఉంటాయి.. కాస్త పసిగట్టి చూస్తే ఈ తేడాను ఇట్టే గుర్తించచ్చు.

మార్ఫింగ్‌ అయినా డీప్‌ఫేక్‌ అయినా.. అచ్చు గుద్దినట్లుగా ప్రతిదీ తిరిగి సృష్టించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ముఖాన్ని మరో వ్యక్తి ముఖంతో రీప్లేస్‌ చేసినప్పుడు.. ఆ వాతావరణానికి తగినట్లుగా ముఖంపై లైటింగ్‌ను, ఆయా పరిసర ప్రాంతాల్లో రంగులు, వెలుతురును కచ్చితంగా ఎడ్జస్ట్ చేయడం కుదరకపోవచ్చు. కాస్త పరిశీలిస్తే ఈ తేడాలు సులభంగా అర్థమవుతాయి.

ఒక్కోసారి డీప్‌ఫేక్‌ వీడియోలకు కృత్రిమ మేధతో సృష్టించిన ఆడియోను జత చేస్తుంటారు. కానీ కాస్త సునిశితంగా పరిశీలిస్తే.. ఆడియో నాణ్యతకు, వీడియో కంటెంట్‌కు ఎక్కడా పొంతన కుదరకపోవడం లేదంటే అటూఇటుగా తేడాలుండడం గమనించచ్చంటున్నారు నిపుణులు. అంతేకానీ.. ఈ రెండూ కచ్చితంగా కలవడమనేది దాదాపు అసాధ్యమని చెబుతున్నారు.

ఒక్కొక్కరి శరీరాకృతి ఒక్కోలా ఉంటుంది. అలాంటప్పుడు ఒకరి ముఖాన్ని మరొకరి ముఖంతో రీప్లేస్‌ చేస్తే.. ముఖానికి, శరీర భాగాలకు పొంతన కుదరదు. అంటే.. కాస్త సన్నగా, పొడవుగా ఉన్న ముఖాన్ని.. లావుగా ఉన్న వారి శరీరానికి జత చేస్తే ఎలా ఉంటుందో అలాగన్న మాట! పైగా వీళ్ల చేతలు, ముఖ కవళికలూ మ్యాచ్‌ కాకపోవచ్చు కూడా!

డీప్‌ఫేక్‌ సాఫ్ట్‌వేర్‌ వాస్తవిక ముఖ కవళికల్ని కచ్చితంగా ప్రతిబింబించకపోవచ్చు. కాబట్టి మాటతీరుకు ముఖకవళికలకు తేడా ఉన్నా, వీడియో సందర్భానికి సంబంధం లేనట్లుగా ముఖకవళికలున్నా.. అది ఫేక్‌ వీడియోగా పరిగణించాలంటున్నారు నిపుణులు.

మార్ఫింగ్‌/డీప్‌ఫేక్‌ చేసేటప్పుడు.. ముఖాన్ని సరిగ్గా అమర్చకపోయినా నకిలీని గుర్తించడం సులువవుతుంది. అలాగే సదరు వ్యక్తి ముఖంలో కొత్త ముఖం ఎడ్జస్ట్ కాకపోయినా ఆ తేడా తెలుస్తుంది.

డీప్‌ఫేక్‌ వీడియోలు/ఫొటోలు సహజ శరీర భంగిమల్ని ఎక్కువ సమయం కొనసాగించలేకపోవచ్చు. కాబట్టి శరీర భంగిమలు, కదలికల్ని నిశితంగా గమనిస్తూ.. ఏ కాస్త తేడా కనిపించినా అది ఫేక్‌గా గుర్తించచ్చు.

ఇవన్నీ గమనించాక.. ఆ వీడియో ఫేక్‌ అన్న సందేహం కలిగితే.. దాన్ని రుజువు చేసుకోవడానికి గూగుల్‌లో ‘సెర్చ్‌ బై ఇమేజ్‌’ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం వీడియో స్క్రీన్‌షాట్‌ తీసి.. ఆ ఫొటోను ఈ ఆప్షన్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. దానికి సంబంధించిన వీడియోలన్నీ కనిపిస్తాయి. అందులో అసలు వీడియో, దాన్ని ఉపయోగించి మార్ఫింగ్‌ చేసిన ఇతర వీడియోలు అన్నీ కనిపిస్తాయి.

ఇలాంటి సందర్భాలలో కంగారు పడకుండా, ఊరికే ఆందోళన చెందకుండా సంబంధిత పోలీసు విభాగం వారికి వెంటనే ఫిర్యాదు చేయాలి. ఆయా వీడియోలను తొలగించి, సదరు పనికి పాల్పడిన వారికి తగిన శిక్ష పడేలా చేయాలి.


ముందు జాగ్రత్తగా..!

అలాగే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ముందే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. కాబట్టి డీప్‌ఫేక్‌/మార్ఫింగ్‌ బారిన పడకుండా ఉండాలంటే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసే ఫొటోలు, వీడియోలు, సమాచారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు.

సోషల్‌ మీడియాలో సమాచారం సురక్షితంగా ఉండాలంటే ప్రైవసీ సెట్టింగ్స్‌ చేసుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో మీకు నమ్మకమైన వ్యక్తులకే మీ అకౌంట్‌ కనిపించేలా సెట్‌ చేసుకోవచ్చు.

మీరు పంచుకునే సమాచారానికి/ఫొటోలు/వీడియోలకు ఎవరి నుంచైనా నెగెటివ్‌ కామెంట్లు వస్తే వారిని వెంటనే బ్లాక్‌ చేసేయాలి. తద్వారా తదనంతర ముప్పును తప్పించుకోవచ్చు.

సమాచారమైనా/ఫొటోలైనా/వీడియోలైనా.. మీరు అప్‌లోడ్‌ చేసే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి.. అవి అందరూ చూడడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని తేల్చుకున్నాకే వాటిని పోస్ట్ చేయడం మంచిది. అలాగే వ్యక్తిగత ఫొటోలు, ఇతరులు అభ్యంతరం తెలిపేలా ఉన్న ఫొటోలు/వీడియోలు/సమాచారం పోస్ట్‌ చేయకుండా ఉండడమే మంచిది.

కొంతమంది తమ సామాజిక హోదాకు సంబంధించిన విషయాల్నీ సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు. అయితే దీనివల్ల మీ ఫొటోలు/వీడియోల్ని మార్ఫింగ్‌/డీప్‌ఫేక్‌ చేసి డబ్బు కోసం మిమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోండి.

కాఫీ షాప్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌, షాపింగ్‌ మాల్స్‌లో ఉచితంగా లభించే వైఫై నెట్‌వర్క్‌ని వాడుతుంటారు కొందరు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు పాస్‌వర్డ్ ఎంటర్‌ చేయాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు మీ మొబైల్‌లోని సమాచార భద్రత దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో అందించే ఉచిత వైఫైని ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

సోషల్‌ మీడియాలో చాటింగ్‌, ఫొటోలు/వీడియోలు షేర్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో సాధారణ విషయాలు తప్ప వ్యక్తిగత విషయాలు పంచుకోకపోవడమే మంచిది. ఎందుకంటే కొంతమంది చాటింగ్‌ స్క్రీన్‌షాట్లను, ఫొటోలు/వీడియోల్ని దుర్వినియోగపరిచే ప్రమాదం ఉంది.

ఒక్కోసారి కొన్ని లింకులు, వాయిస్‌ మెసేజ్‌లు మీ స్నేహితురాలు పంపినట్లుగా వస్తుంటాయి. అయితే అందులోనూ కీడెంచి మేలెంచమంటున్నారు నిపుణులు. వాటిని ఓపెన్‌ చేసే ముందు ఒకసారి వాళ్లకు ఫోన్‌ చేసి ఇవి వాళ్లు పంపించినవేనా అనేది తేల్చుకోవడం మంచిదంటున్నారు. తద్వారా హ్యాకర్ల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

సోషల్‌ మీడియా అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవాలంటే.. కఠినమైన పాస్‌వర్డ్‌ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో.. పదే పదే వాటిని మార్చుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి!

సోషల్‌ మీడియా అకౌంట్స్‌/యాప్స్‌లో వస్తోన్న మార్పుల విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూనే.. ఆయా సంస్థల పాలసీల్ని కూడా పదే పదే చెక్‌ చేసుకోవడం వల్ల ఖాతాను సురక్షితంగా కొనసాగించచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్