పనివాళ్లకు డబ్బు పాఠాలు

సాధారణంగా ఇంటర్మీడియట్‌ చదివే అమ్మాయిలు సినిమాలూ షికార్లంటూ కాలక్షేపం చేస్తారు. కానీ, బెంగళూరుకు చెందిన అనయ జేతానందని ఆ వయసుకే పెద్దరికం తెచ్చుకుని ఎందరికో చేయూతనందిస్తోంది.

Updated : 13 Feb 2023 04:46 IST

సాధారణంగా ఇంటర్మీడియట్‌ చదివే అమ్మాయిలు సినిమాలూ షికార్లంటూ కాలక్షేపం చేస్తారు. కానీ, బెంగళూరుకు చెందిన అనయ జేతానందని ఆ వయసుకే పెద్దరికం తెచ్చుకుని ఎందరికో చేయూతనందిస్తోంది. వారాంతాల్లో వర్క్‌షాపులు నిర్వహిస్తూ... ఎందరో మహిళల్ని ఆర్థిక సాధికారత దిశగా నడిపిస్తోంది.

‘బెంగళూరు ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో పదకొండో తరగతి చదువు తున్నా. గతేడాది ఓ రోజు మా వంటమనిషి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమైందని అడిగితే భర్త మద్యానికి బానిసయ్యాడని, తన సంపాదనతోనే ఇల్లు గడుస్తున్నా అతడిదే ఆధిపత్యమని, పిల్లల చదువుకోసం కూడా డబ్బు ఆదా చేయలేకపోతున్నానంటూ చెప్పింది. ఆ సంఘటన నన్ను కదిలించింది, మార్పునకు ప్రేరేపించింది. నాకున్న ఆర్థిక సమానత్వం వీళ్లకెందుకు లేదని పరిశోధన చేశాను. కష్టపడి సంపాదించిన సొమ్ము మీద వాళ్లకు నియంత్రణ ఉండదు. ఆర్థిక స్వాతంత్య్రం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునే లక్ష్యంతో వాళ్లకి బ్యాంకు ఖాతాలున్నాయా, ఖర్చు మీద నియంత్రణ ఉందా, భర్తలు లేదా తండ్రులే ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తారా- అంటూ సర్వేలు నిర్వహించాం. వాటితో సమస్య తీవ్రత అర్థమైంది.  పురుషాధిక్య సమాజంలో ఆర్థిక స్వాతంత్య్రం, వృత్తి నైపుణ్యాలు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అర్థమయ్యాక సాయం చేయాలనుకున్నా. వాళ్ల ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలుసుకున్నా. నిపుణులతో, నాకు మార్గదర్శకులైన అమ్మానాన్నలతో, శ్రేయోభిలాషులతో మాట్లాడా. మహిళలూ-ఆర్థిక అంశాలు-అధికారం అనే విషయాలకు సంబంధించి కోర్సు కూడా చేశాను. ఇలా అనేక అంశాలపట్ల అవగాహన పెంచుకుని ఫిన్విన్‌ స్థాపించాను. సొసైటీకి చెందిన వాళ్ల కథలు దయనీయం.

ఫిన్‌విన్‌ ఆర్థిక అక్షరాస్యత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఇందులో వాళ్ల ఖర్చులను ట్రాక్‌ చేయడం, 50:30:20 నిష్పత్తిలో బడ్జెట్‌ తయారుచేయడం, ఎక్కడ ఖర్చు చేయొచ్చు, ఎక్కడ తగ్గించాలి, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం, బ్యాంకు ఖాతా తెరవడం, వివిధ మోసాల పట్ల అప్రమత్తత లాంటివెన్నో నేర్పుతాం. మొబైల్‌ క్లినిక్‌లు నిర్వహిస్తూ బ్యాంకులకూ సహకరిస్తున్నాం. 

మా సాసైటీలో ఒకరైన మాలతి తాను ఖాతా తెరవాలని ప్రయత్నిస్తే ఏవో పత్రాలు అడుగుతారు. చాలా సమయం పడుతుంది, కిట్‌లు స్టాక్‌లో లేవు, తర్వాత వస్తాయంటూ... కారణాలు చెప్పి  పంపించేస్తున్నారని చెప్పింది. అది వినగానే వర్క్‌షాప్‌ తీరు మార్చేశాను. వాళ్ల ఆధార్‌ కార్డ్‌తో ఖాతా తెరిపించి, అరగంటలో గూగుల్‌ పే యాక్టివేట్‌ చేయడంతో, ప్రభుత్వ పథకాలను పొందగలుగుతున్నారు, వారి ఖాతాకు జీతాలు బదిలీ అవుతున్నాయి, పొదుపు చేయగలుగుతున్నాం, అవసరమైన వస్తువులు కొనుక్కుంటున్నామని సంతోషిస్తున్నారు. వీళ్లలో చాలామందికి ఫోన్‌ లేదు. భర్త లేదా తండ్రి నంబర్‌ ఆధార్‌కార్డుకు లింక్‌చేసి ఉంటుంది. అందుకే ఖాతా తెరవబోతే విఫలమవుతుంటుంది. అందుకే ఆధార్‌ నంబర్లను అప్‌డేట్‌ చేస్తున్నాం. ఇంతవరకూ బెంగళూరు చుట్టుపక్కల సర్జాపూర్‌, జైనగర్‌ వంటి ప్రాంతాలకు చెందిన 750 మంది స్త్రీలకు శిక్షణ ఇచ్చాం. 200 మంది స్త్రీలకు ఖాతాలు తెరిచాం. మురికివాడల్లో 15 వర్క్‌షాపులను నిర్వహించాం. నాకు లాభాపేక్ష కానీ ప్రశంసల మీద మోజు కానీ లేదు. వీళ్ల జీవితాలు బాగుండాలనేదే ఆశయం. అది నెరవేరితే చాలు’.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్