ఈ జాగ్రత్తలతో ఆ సమస్యకు చెక్ పెట్టచ్చు!

ఒక్కోసారి కొంతమందిలో చేతి, కాలి వేళ్లు ఉన్నట్లుండి ఎర్రగా వాచిపోతుంటాయి. నొప్పి కూడా బాగా వస్తుంటుంది. ఆ సమయంలో చేతులు, కాళ్లను కదపాలన్నా ఎంతో కష్టంగా ఉంటుంది. దీనిని ‘గౌట్’ అంటారు. రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయులు పెరగడమే దీనికి...

Published : 15 Oct 2022 19:52 IST

ఒక్కోసారి కొంతమందిలో చేతి, కాలి వేళ్లు ఉన్నట్లుండి ఎర్రగా వాచిపోతుంటాయి. నొప్పి కూడా బాగా వస్తుంటుంది. ఆ సమయంలో చేతులు, కాళ్లను కదపాలన్నా ఎంతో కష్టంగా ఉంటుంది. దీనిని ‘గౌట్’ అంటారు. రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయులు పెరగడమే దీనికి కారణం. ఇదే కాదు... యూరిక్‌ యాసిడ్‌ మోతాదు మించితే కడుపులో మంట, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలు కూడా తలెత్తుతాయి.

యూరిక్‌ యాసిడ్‌... మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో ఇది కూడా ఒకటి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్‌’ అనే రసాయనం విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా విసర్జితమవుతుంటుది. అయితే విసర్జన సరిగా జరగకపోయినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి.

కారణాలివే!

✬ హైపో థైరాయిడిజం

✬ అధిక బరువు

✬ రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు ఎక్కువగా వాడడం

✬ ప్యూరిన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం

✬ మూత్రపిండాల్లో సమస్యలు

✬ శారీరక శ్రమ లేకపోవడం

✬ వయసు పైబడడం.. ఇలా శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయులు పెరగడానికి చాలా కారణాలున్నాయి.

అయితే ఆహారంలో మార్పులతో పాటు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య తీవ్రతరం కాకుండా జాగ్రత్తపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించండి!

✬ నీళ్లు ఎక్కువగా తాగాలి. ప్రత్యేకించి పగటిపూట వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరంలోని యూరిక్‌ యాసిడ్‌తో పాటు ఇతర వ్యర్థపదార్థాలు బయటకు పోతాయి. రోజూ కనీసం 2-3 లీటర్ల నీటిని తాగాలి.

✬ శరీరంలో నీటి స్థాయులను పెంచుకోవడానికి సీజనల్‌ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా అరటి పండ్లు తినడం వల్ల యూరిక్‌ యాసిడ్‌ కారణంగా తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులోని ఫైబర్‌ శరీరంలోని యూరిక్‌ యాసిడ్‌తో పాటు బ్లడ్‌ షుగర్‌ స్థాయులను కూడా తగ్గిస్తుంది.

✬ పాలు, పెరుగు, మజ్జిగ..ఈ మూడు పదార్థాలు రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయులను తగ్గిస్తాయి. ముఖ్యంగా పెరుగు, ఎండుద్రాక్ష ప్రతిరోజూ తీసుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. మజ్జిగ శరీరంలోని నీటి స్థాయులను పెంచడంతో పాటు కండరాలు, కీళ్ల ఆరోగ్యానికి సహకరిస్తుంది.

✬ నట్స్‌, స్ర్పౌట్స్‌ను నీటిలో నానబెట్టి తీసుకోవాలి.

✬ రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలను తీసుకోవాలి.

వీటిని దూరం పెట్టండి!

✬ కెచప్‌లు, టెట్రా ప్యాక్‌ జ్యూస్‌లు దూరం పెట్టాలి.

✬ చాక్లెట్స్‌, చిప్స్‌, బిస్కట్లు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ను మానేయాలి.

✬ ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు. మధ్యమధ్యలో పండ్ల రసాలు, స్నాక్స్ వంటివి తీసుకోవాలి.

✬ రాత్రి పడుకునే ముందు స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లను పక్కన పెట్టుకోవద్దు. వీలైనంత ప్రశాంతంగా నిద్రపోవాలి.

శారీరక శ్రమ తప్పనిసరి!

✬ కదలకుండా ఎక్కువసేపు కూర్చోవద్దు. ప్రతి అరగంటకోసారి 3 నిమిషాల పాటు అటూ ఇటూ నడవాలి.

✬ వారంలో కనీసం రెండుసార్లు స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ ఎక్సర్‌ సైజులు, వ్యాయామాలు, యోగాసనాలు చేయాలి.

ఇవి కూడా!

✬ పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయులు పెరగవు.

✬ పాలు, పాల ఉత్పత్తులు కూడా తీసుకోవచ్చు. పెరుగు, మజ్జిగ అయితే మరీ మంచిది.

✬ రోజూ రెండు గుడ్ల వరకు తినవచ్చు.

✬ చికెన్‌, మటన్‌, చేపలు కూడా ఆహారంలో భాగం చేసుకోచ్చు. అయితే వారంలో 2-3 సార్లకు మించకుండా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఎప్పటికప్పుడు వైద్యుల సూచనలను కూడా పాటించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్