World Cup: మైదానంలో మాటల పరవళ్లు!

ప్రస్తుతం జరుగుతోన్న క్రికెట్‌ ప్రపంచకప్‌లో పలువురు విదేశీ మహిళా స్పోర్ట్స్‌ ప్రజెంటర్లూ సందడి చేస్తున్నారు. మరి, వారెవరో తెలుసుకుందాం రండి..

Published : 16 Oct 2023 12:26 IST

(Photos: Instagram)

ఆటలంటే వీరికి ఆరో ప్రాణం.. ఈ మక్కువకు తమ మాటల చతురతను జోడించి.. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్‌ ప్రజెంటర్లుగా పేరు తెచ్చుకున్నారు. నాన్న స్ఫూర్తితో ఈ రంగంలోకి వచ్చిన వారు ఒకరైతే.. భర్త ప్రోత్సాహంతో రాణిస్తున్నారు మరొకరు.. తన వాక్చాతుర్యం, క్రీడల పట్ల లోతైన విశ్లేషణతో దేశానికే పేరు తెచ్చారు ఇంకొకరు. ఇలా ప్రస్తుతం జరుగుతోన్న క్రికెట్‌ ప్రపంచకప్‌లో పలువురు విదేశీ మహిళా స్పోర్ట్స్‌ ప్రజెంటర్లూ సందడి చేస్తున్నారు. మరి, వారెవరో తెలుసుకుందాం రండి..

మోడల్‌ టు యాంకర్!

తన అందం, ఆకట్టుకునే మాటతీరుతో స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా వరుస అవకాశాలు అందుకుంటోంది యువ యాంకర్‌ నష్‌ప్రీత్‌ కౌర్‌. సోషల్‌ మీడియాలో నాషీ సింగ్‌గా ఆమె పాపులర్‌. ఫిజీలో జన్మించిన ఆమె.. మెల్‌బోర్న్‌ యూనివర్సిటీలో ‘బయోమెడిసిన్‌’ ప్రధాన సబ్జెక్టుగా ఫార్మకాలజీ పూర్తి చేసింది. కాలేజీలో ఉన్నప్పట్నుంచే మోడలింగ్‌ చేసిన కౌర్‌.. పలు అంతర్జాతీయ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్లకు మోడల్‌గా పనిచేసింది. ‘స్ట్రింగ్స్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2013లో ‘కాస్మోపాలిటన్‌ మోడల్‌ సెర్చ్‌ కాంపిటీషన్‌’లో పాల్గొన్న ఆమె.. మెల్‌బోర్న్‌లో నిర్వహించిన నేషనల్‌ ఫైనల్స్‌లో 5వ స్థానం సొంతం చేసుకుంది. 2020 ఐపీఎల్‌తో స్పోర్ట్స్‌ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన కౌర్‌.. ప్రతి సీజన్లోనూ అలరిస్తుంటుంది. ఆపై టీ20 ప్రపంచకప్‌, హాకీ ప్రపంచకప్‌లోనూ మెరిసిన ఈ బ్యూటీ.. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ సందడి చేస్తోంది. వెకేషన్లను ఎక్కువగా ఇష్టపడే కౌర్‌.. తాను వెళ్లిన పర్యటక ప్రదేశం అందాల్ని కెమెరాలో బంధిస్తూ.. ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటుంది. ఈ ముద్దుగుమ్మకు.. ఓ సోదరుడు, ఓ కవల సోదరి ఉన్నారు.


నాన్న స్ఫూర్తితో..!

ఆస్ట్రేలియన్‌ డ్యాషింగ్‌ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌ గుర్తున్నాడా? ఆయన కూతురే గ్రేస్‌ హెడెన్‌. చిన్న వయసు నుంచి తండ్రి ఆటతీరును చూస్తూ పెరిగిన ఆమె.. క్రీడలపై మక్కువ పెంచుకుంది. టీవీ ప్రజెంటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన గ్రేస్‌.. ప్రస్తుతం జరుగుతోన్న ప్రపంచకప్‌తో స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్లో భారత్‌ను సందర్శించిన గ్రేస్‌కు ఇక్కడి పర్యటక ప్రదేశాలు, బీచ్‌లు బాగా నచ్చాయట!

‘నాన్న ఇండియా గురించి పదే పదే చెబుతుండేవారు. తనకు భారత్‌ అంటే చాలా ఇష్టం. క్రికెట్‌కు ప్రాణమిచ్చే ఈ దేశ ప్రజలంటే ఆయనకు ఎనలేని అభిమానం. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్లో భారత్‌ను సందర్శించినప్పుడు చాలా ఎంజాయ్‌ చేశా..’ అంటోందీ క్రికెట్‌ ప్రజెంటర్.


15 ఏళ్ల కెరీర్‌లో..!

పశ్చిమ ఆస్ట్రేలియాలోని కోలీ అనే చిన్న పట్టణానికి చెందిన నెరోలీ మెడాస్‌ గత 15 ఏళ్లుగా స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా కొనసాగుతోంది. క్రీడల ప్రత్యక్ష ప్రసారాలు, మ్యాగజీన్‌ షోస్‌, క్రీడా వార్తల్లో యాంకరింగ్‌ చేసే ఈ చక్కనమ్మ.. క్రీడా రంగానికి చెందిన ప్రముఖుల ఇంటర్వ్యూలు చేయడంలోనూ ముందుంటుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలోని ప్రముఖ స్పోర్ట్స్‌ టీవీ ఛానల్స్‌లో వ్యాఖ్యాతగా, సహ-వ్యాఖ్యాతగా, బ్రాడ్కాస్టర్‌గా వ్యవహరించిన ఆమె.. ‘ఆస్ట్రేలియన్‌ టెలివిజన్‌’లో ప్రసారమైన టెస్ట్‌మ్యాచ్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన తొలి మహిళగా పేరు తెచ్చుకుంది. తన సుదీర్ఘ కెరీర్‌లో అంతర్జాతీయంగా దాదాపు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ మ్యాచులకు ప్రజెంటర్‌గా పనిచేసిన నెరోలీ.. బిగ్‌బాష్‌ లీగ్‌, పలు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకూ వ్యాఖ్యాతగా వ్యవహరించింది.


బహుముఖ ప్రజ్ఞాశాలి!

ఎరిన్‌ విక్టోరియా హోలండ్‌.. ఈమెను స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ అనడం కంటే.. బహుముఖ ప్రజ్ఞాశాలి అనడమే కరక్ట్‌ అనిపిస్తుంది. ఎందుకంటే గాయనిగా, టీవీ వ్యాఖ్యాతగా, స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా, మోడల్‌గా, డ్యాన్సర్‌గా.. ఇలా ఎన్నో నైపుణ్యాలు ఆమె సొంతం. 2013లో ‘మిస్‌ వరల్డ్‌ ఆస్ట్రేలియా’, ‘మిస్‌ వరల్డ్‌ ఓషియానా’.. రెండు కిరీటాలు గెలుచుకున్న ఈ బ్యూటీ.. ‘పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌’ 4, 5, 7, 8.. సీజన్లకు స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలో ఓవైపు మైదానంలో ప్రవాహం లాంటి తన మాటతీరుతో కట్టిపడేస్తూనే.. మరోవైపు మ్యాచ్‌ ముగిశాక జరిగిన వివిధ కార్యక్రమాలకూ హోస్ట్గా వ్యవహరించింది ఎరిన్‌. అంతేకాదు.. జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లు, ఇతర టోర్నమెంట్లకు ప్రజెంటర్‌గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రముఖ క్రీడాకారుల ఇంటర్వ్యూలూ తీసుకుంటుంది. పలు టీవీ సిరీస్‌ల్లోనూ నటించింది. ఆసీస్‌ క్రికెటర్‌ బెన్‌ కటింగ్‌ను వివాహమాడిన ఎరిన్‌.. సమాజ సేవలోనూ ముందుంటుంది. పిల్లలకు సంబంధించిన సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఈ ఆసీస్‌ బ్యూటీ.. ఉత్తర ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతమైన లిల్లా కమ్యూనిటీకి సహాయ సహకారాలు అందిస్తుంటుంది.


భర్తకు తగ్గ భార్య!

న్యూజిలాండ్‌ డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గుప్తిల్‌ సతీమణిగానే కాకుండా.. స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా తనకంటూ ప్రత్యక గుర్తింపు సంపాదించుకుంది లారా గోల్డ్‌రిక్‌. రేడియో హోస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. న్యూస్‌ ప్రజెంటర్‌గా, స్పోర్ట్స్‌ రిపోర్టర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. క్రీడా ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేయడం, క్రీడలకు సంబంధించిన టీవీ సిరీస్‌లు, రేడియో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి పాపులర్‌గా మారిన ఈ చిన్నది.. 2014లో ‘వెస్ట్‌ సైడ్‌’ అనే టీవీ సిరీస్‌లో నటించి.. నటిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కేవలం స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గానే కాదు.. తన భర్త ఆడే ప్రతి మ్యాచ్‌కూ హాజరవుతూ.. ఆయన్ని ప్రోత్సహిస్తుంటుంది లారా. అందుకే తన సక్సెస్ సీక్రెట్‌ తన భార్యేనంటూ ఓ సందర్భంలో చెబుతూ మురిసిపోయాడీ కివీస్‌ క్రికెటర్‌. ఈ ముద్దుల జంటకు ఇద్దరు కూతుళ్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్