Published : 21/01/2023 20:07 IST

తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోందా?

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, నీళ్లు ఎక్కువగా తాగినప్పుడు ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం సహజం. కానీ ఇది మరీ మితిమీరితే మాత్రం నిర్లక్ష్యం చేయద్దంటున్నారు వైద్యులు. ఎందుకంటే రోజులో పది కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే అది ఇతర అనారోగ్యాలకు కూడా సూచన కావచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఒకవేళ అలాంటి అనుభవం ఎదురైనట్లయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.

సాధారణంగా మనం రోజులో ఆరు నుంచి ఎనిమిది సార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటాం. అదే కాస్త ఎక్కువ నీళ్లు తాగినా లేదంటే వాతావరణం చల్లగా ఉన్నా.. పది కంటే ఎక్కువసార్లు వెళ్లం. అయితే కొంతమందిలో ఈ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది.

అలాంటప్పుడు చల్లదనం వల్లే తమకు ఇలా అవుతుందేమోనని కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధగా వ్యవహరిస్తుంటారు. కానీ ఇలా మరీ అసాధారణంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే మాత్రం అది ఇతర అనారోగ్యాలకు కూడా సూచన కావచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మధుమేహం ఉందేమో!

సాధారణంగా కొంతమందిలో నీళ్లు ఎక్కువగా తాగినా, తాగకపోయినా పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. అలాంటి వాళ్లు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్య పరిస్థితుల్ని చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే తరచూ ఇలా మూత్రానికి వెళ్లాల్సి రావడమనేది టైప్‌-1, టైప్‌-2 డయాబెటిస్‌కు ప్రారంభ సంకేతం కావచ్చంటున్నారు వైద్యులు. ఈ క్రమంలో మన రక్తంలో ఒక రకమైన చక్కెరలు ఉత్పత్తవుతాయి. అత్యధిక గ్లూకోజ్‌ను ఫిల్టర్‌ చేసేలా మూత్రపిండాలపై ఇవి ఒత్తిడి తీసుకొస్తాయి. తద్వారా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వహించకుండా అసలు మీకు మధుమేహం ఉందో, లేదో డాక్టర్‌ పర్యవేక్షణలో చెకప్‌ చేసుకొని తెలుసుకోండి. ఆపై వైద్యుల సలహా మేరకు తగిన మందులు వాడితే ఆదిలోనే ఈ సమస్యను అదుపు చేసుకోవచ్చు.

ఇన్ఫెక్షన్‌ కూడా కారణమే!

మూత్ర వ్యవస్థలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు కూడా పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడానికి ఓ కారణమే అంటున్నారు నిపుణులు. సాధారణంగా పురుషులతో పోల్చితే ఇలాంటి ఇన్ఫెక్షన్లు మహిళల్లోనే ఎక్కువట! బ్యాక్టీరియా మూత్రాశయం, మూత్రపిండాలు.. వంటి భాగాలపై ప్రతికూల ప్రభావం చూపడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు వైద్యులు. తద్వారా సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. అయితే దీంతో పాటు కొంతమందికి యూరిన్‌లో మంట, రక్తస్రావం కావడం.. వంటివీ జరుగుతుంటాయి. ఏదేమైనా ఇలాంటి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తే మీ సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది.

రాళ్లున్నా కూడా!

సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తోందంటే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడం వల్ల కూడా కావచ్చంటున్నారు నిపుణులు. మూత్రంలో ఉండే ఖనిజాలు, ప్రొటీన్లు స్ఫటికాలుగా మారి రాళ్లు ఏర్పడుతుంటాయి. చాలామందిలో ఇవి నొప్పిని కలుగజేస్తాయి. అయితే మూత్రాశయానికి దగ్గర్లో ఉండే రాళ్ల కారణంగా పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇదే నిజమైతే అశ్రద్ధ చేయకుండా వైద్యుల సలహా మేరకు మందులు వాడడం, నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రాళ్లను బయటికి పంపించేయచ్చు. అయితే కాస్త పెద్దగా ఉన్న రాళ్లనైతే ప్రత్యేక పద్ధతి ద్వారా విచ్ఛిన్నం చేసి తొలగిస్తారు.

గర్భిణుల్లో సహజమే!

గర్భం ధరించిన సమయంలోనూ పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. కడుపులో బిడ్డ ఎదుగుతున్న కొద్దీ గర్భాశయం పెరిగి మూత్రాశయంపై ఒత్తిడి పడుతుంది. తద్వారా సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా శరీరంలోని మలినాలు బయటికి వెళ్లిపోతాయి. ఇక నెలలు నిండే కొద్దీ యూరినేషన్‌ ఫ్రీక్వెన్సీ మరింతగా పెరుగుతుంది. ఈ క్రమంలో మంట, ఇతర అసౌకర్యాలేమైనా ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. తద్వారా కడుపులోని బిడ్డపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు.

ఇవి కూడా!

కెఫీన్‌ ఎక్కువగా ఉండే పానీయాలు, వివిధ అనారోగ్యాల్ని తగ్గించుకోవడానికి వాడే మందుల కారణంగా కూడా మూత్రవిసర్జన ఎక్కువగా జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఉద్రేకం, ఒత్తిళ్లు కూడా కొందరిలో అతి మూత్ర విసర్జనకు కారణమవుతాయట!

ఇంటర్‌స్టీషియల్‌ సిస్టైటిస్ అనే సమస్య వల్ల కూడా తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఇది ఎక్కువగా వస్తుందట! ఇది మూత్రాశయంపై తీవ్ర ఒత్తిడిని కలిగించడంతో పాటు నొప్పిని కూడా కలుగజేస్తుంది. తద్వారా పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. అయితే ఇది పూర్తిగా నయం కాకపోయినా.. నిపుణుల సలహా మేరకు రాత్రి పడుకునే ముందు కొన్ని ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల.. సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు.

అయితే ఇలా పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడంతో పాటు మూత్రంలో రక్తం కనిపించడం - దుర్వాసన, అలసటగా అనిపించడం, జ్వరం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి, ఆకలి/దాహం ఒక్కసారిగా పెరిగిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదించడం మంచిది. తద్వారా వారు అసలు సమస్యేంటో పరీక్షించి తగిన మందులు సూచిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని