షుగర్‌ పడిపోయి వణుకు వస్తోంది....

నా వయసు 50. ఏడాదిగా మధుమేహం, కొలెస్ట్రాల్‌ సమస్యలు ఉన్నాయి. దాంతో వ్యాయామం చేస్తూనే, చిరుధాన్యాలతో చేసిన చపాతీలు, కాయగూరలూ ఆహారంలో భాగం చేసుకుంటున్నా.

Updated : 14 Mar 2024 14:12 IST

నా వయసు 50. ఏడాదిగా మధుమేహం, కొలెస్ట్రాల్‌ సమస్యలు ఉన్నాయి. దాంతో వ్యాయామం చేస్తూనే, చిరుధాన్యాలతో చేసిన చపాతీలు, కాయగూరలూ ఆహారంలో భాగం చేసుకుంటున్నా. అయినప్పటికీ ఒక్కోసారి ఫాస్టింగ్‌ షుగర్‌ 200 వరకూ ఉంటోంది. అకస్మాత్తుగా 50కి తగ్గిపోయి వణుకు వస్తోంది. నా ఆహార నియమాల్లో ఏమైనా లోపం ఉందా? అసలు నేను ఏం తినాలి?

పద్మజ. చెల్లూరు.

డయాబెటిస్‌ ఉన్నప్పుడు వాడే మందులు, తీసుకునే ఆహారం... రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. మీ చక్కెర స్థాయిని బట్టి డాక్టర్లు మందులు ఇస్తుంటారు. శరీర బరువు, చేసేపని దృష్టిలో పెట్టుకుని ఒక క్రమపద్ధతిలో ఆహార నియమాలను పాటించాలి. మీరు ఎలాంటి భోజనం తీసుకుంటున్నారు. ఏ సమయంలో, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు అనేదీ ముఖ్యమే. మామూలుగా ఫాస్టింగ్‌ షుగర్‌ 90- 120 మధ్యలో ఉండాలి అప్పుడే ఆరోగ్యానికి మంచిది. కానీ మీకు 200 వరకూ ఉందన్నారు. కాబట్టి కచ్చితంగా డాక్టర్ల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాకాదని మీరు ఆరోగ్యకరమైన ఆహారమే కదాని మోతాదుకు మించి తిన్నా లేదా సమయానికి తినకపోయినా ఇలా హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. కాబట్టి భోజనంలో నిదానంగా జీర్ణమయ్యే, ఎక్కువ పీచు, అవసరమైన మేరకు మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే ఏదైనా వేడి పానీయం లేదా ఐదారు నట్స్‌ తీసుకోవాలి. అల్పాహారంగా పెసరట్టు, జొన్నఇడ్లీ, లావు గోధుమ రవ్వ ఉప్మా వంటివి తీసుకోవాలి. మధ్యలో మజ్జిగ, కీర, క్యారెట్‌ తినొచ్చు. సాయంత్రం పూట మొలకెత్తిన గింజలు, ఓట్స్‌ జావ, పండ్లు చిరుతిండిగా తీసుకోవచ్చు. రాత్రి భోజనంలోకి తృణధాన్యాలతో చేసిన చపాతీ లేదా రోటీకి గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పు చేర్చుకుని తినండి. రాత్రివేళల్లో లో షుగర్‌ అనిపించినా మజ్జిగ, పాలు తాగొచ్చు. అంతేకాదు, క్రమం తప్పకుండా రోజూ శారీరక శ్రమ చేస్తుంటారు కాబట్టి ఓసారి వైద్యుల్ని సంప్రదించి వారి సూచనల మేరకు ఆహార మోతాదు తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్