ఆ గొంతే లక్షలు సంపాదించి పెడుతోంది!

పాయల్‌ గొంతు విని అందరూ నవ్వేవారు. కానీ తనెప్పుడూ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అదే ఆమెకు బలం, గర్వం కూడా. నిరుపేద కుటుంబంలో పుట్టి, కనీస సౌకర్యాలు కూడా లేకుండా పెరిగిన ఆమె ఆ గొంతుతోనే ప్రత్యేకత సాధించింది

Updated : 31 May 2022 08:55 IST

పాయల్‌ గొంతు విని అందరూ నవ్వేవారు. కానీ తనెప్పుడూ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అదే ఆమెకు బలం, గర్వం కూడా. నిరుపేద కుటుంబంలో పుట్టి, కనీస సౌకర్యాలు కూడా లేకుండా పెరిగిన ఆమె ఆ గొంతుతోనే ప్రత్యేకత సాధించింది. నెలకో అయిదు వేలు వస్తే చాలనుకున్న అమ్మాయి పట్టుదలతో లక్షలు సంపాదిస్తోంది.

పాయల్‌ తండ్రి కార్పెంటర్‌, తల్లి టైలరింగ్‌ చేసి కుటుంబాన్ని పోషించే వారు. తనకొ ఓ తమ్ముడూ ఉన్నాడు. వీరిద్దరినీ బాగా చదివించాలనుకునేవారా తల్లిదండ్రులు. కానీ రెక్కలు ముక్కలు చేసుకున్నా నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడం చాలా కష్టం అయ్యేది. ఇదంతా చూసి పదో తరగతి పూర్తవగానే ఏదైనా చిన్న ఉద్యోగం చేసి కుటుంబానికి సాయపడాలనుకునేది పాయల్‌. నెలకు కనీసం రూ.5 వేలు వచ్చినా చాలన్నది అప్పటి తన కల. కాళ్లూ, చేతులూ అరిగిపోయేలా కుట్టుమిషన్‌పై పనిచేస్తున్న అమ్మకి తను సంపాదించి విశ్రాంతివ్వాలనుకునేది. పదోతరగతికి ఏం ఉపాధి దొరుకుతుంది? అయినా తను నిరుత్సాహపడలేదు. ప్రయత్నాలు మానలేదు. ఓసారి స్నేహితుల దగ్గర టిక్‌టాక్‌ గురించి తెలుసుకుంది. 19వ ఏట తమ్ముడితో కలిసి లిప్‌ సింకింగ్‌తో వీడియోలు తీసి టిక్‌టాక్‌లో పొందుపరచడం ప్రారంభించింది. అలా ఒక వీడియోను 20 రోజుల్లో 10 వేల మంది వీక్షించారు. ఎన్ని కష్టాలున్నా చాలా సరదాగా మాట్లాడటం, జోకులు వేయడం పాయల్‌కు అలవాటు. తనకో ప్రత్యేకత ఉండాలని ఆలోచించినప్పుడు ఇవే గుర్తుకొచ్చాయి తనకు. అప్పటి నుంచి హాస్య వీడియోలు తీసి పొందు పరచడం మొదలుపెట్టింది. ఇందులో అమ్మ కూడా సాయం చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌ అయ్యింది. దాంతో క్రమంతా తనకు వాటి మీద పట్టొచ్చింది, పేరూ వచ్చింది.

లాక్‌డౌన్‌కు ముందు...
కొవిడ్‌ ప్రారంభ సమయంలో పాయల్‌ వీడియోలకు రెండు లక్షలమంది వీక్షకులుండేవారు. ఆ తర్వాత టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం మన దేశంలో నిలిపివేసింది. అప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో పొందుపరచడం మొదలుపెట్టింది. ఇందులో తొలిసారి ఉంచి వీడియోను లక్షమంది వీక్షకులు చూశారు. అలా వాటి ద్వారా వచ్చిన డబ్బుల్ని పొదుపు చేసి నాన్నకు స్కూటర్‌ కొనిచ్చా అని సంతోషంగా చెప్పింది పాయల్‌. ‘నా వీడియోలకు వస్తున్న స్పందన చూసి నాలాంటివారు కొందరు నన్ను కలవడం ప్రారంభించారు. వారితో కలిసి కూడా వీడియోలు చేయడం మొదలుపెట్టా. కొన్ని యాప్స్‌ వాళ్లు నా వీడియోలను తీసుకునే వాళ్లు. వాటి ద్వారా నెలకు రూ.30 వేల దాకా వచ్చేది. ఇది కొవిడ్‌ సమయంలో మా కుటుంబానికి ఆర్థికంగా కష్టం లేకుండా చేసింది. దాంతోపాటు నేను విడిగా పొందుపరుస్తున్న వీడియోల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలిపి ఇల్లు కొనగలిగా. రూ.4 లక్షలతో ఫర్నిచర్‌ను తీసుకొన్నా. అమ్మానాన్నకు కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేశా. నాన్నకు కారు, ఐ ఫోన్‌ వంటివి కొనిచ్చా. ప్రస్తుతం నెలకు రూ.6 లక్షలు సంపాదించగలుగుతున్నా. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నను సంతోషంగా ఉంచాలనుకునే దాన్ని. ఆ ఆశ నెరవేరింది. తమ్ముడిని చదివిస్తున్నా. సంతోషంగా ఉంది. టిక్‌టాక్‌ చేసేటప్పుడు చాలామంది నన్ను విమర్శించేవారు. ఎందుకూ పనికిరావు అన్నారు. నాపై నాకున్న నమ్మకమే ఈ రోజు ఆర్థికంగా నిలబెట్టింది. మనసుకు నచ్చింది చేస్తే విజయం మనదే’ అని చెబుతున్న ఇండోర్‌కు చెందిన 23 ఏళ్ల పాయల్‌ కథ ఇది. ప్రస్తుతం పాయల్‌ ఇన్‌స్టాకు 16 లక్షలమంది ఫాలోవర్స్‌ ఉండటం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్