అందాల.. గిరి కన్య

అందాల పోటీల్లో చాలా వర్గాల అమ్మాయిలను చూస్తుంటాం. కానీ కొన్ని వర్గాలు ఇప్పటికీ వీటికెంతో దూరం. దీన్ని మార్చాలని రియాటిర్కా తపించింది. అందుకోసం ఎనిమిదేళ్లు తపించింది. ఫెమినా మిస్‌ ఇండియా 2022 వేదికపై గ్రాండ్‌ ఫినాలే వరకు చేరుకుంది. విజేత కాలేకపోయినా...

Published : 06 Jul 2022 01:23 IST

అందాల పోటీల్లో చాలా వర్గాల అమ్మాయిలను చూస్తుంటాం. కానీ కొన్ని వర్గాలు ఇప్పటికీ వీటికెంతో దూరం. దీన్ని మార్చాలని రియాటిర్కా తపించింది. అందుకోసం ఎనిమిదేళ్లు తపించింది. ఫెమినా మిస్‌ ఇండియా 2022 వేదికపై గ్రాండ్‌ ఫినాలే వరకు చేరుకుంది. విజేత కాలేకపోయినా... ఎందరో మనసుల్ని గెలుచుకుంది. ప్రముఖుల ప్రశంసలనూ సొంతం చేసుకున్న 24 ఏళ్ల రియా మనోగతమిది. 

నేనో గిరిజన కుటుంబంలో పుట్టా.. నాకు బాగా చదువుకోవాలని ఉండేది. ఇక్కడ ఆడపిల్లల చదువంటే చాలా పెద్ద విషయం. అటువంటిది అమ్మ, అక్క అందించిన ప్రోత్సాహంతో రాంచీలో ఇంటర్‌ వరకు చదివా. విజయవాడలో సిద్దార్థ కళాశాలలో డిగ్రీ చదువుకున్నా. ఆ తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. 2000లో బిహార్‌ నుంచి ఝార్ఖండ్‌ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రంతో మా బతుకులు బాగుపడతాయి అనుకున్నారు మా వాళ్లు. అయితే ఇప్పటికీ ఇక్కడ గిరిజనులు తమ గుర్తింపు కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నేను గిరిజన కుటుంబానికి చెందినదాన్ని కావడంతో స్కూల్లో సీటు ఇవ్వనన్నారు. ఇటువంటి ఇబ్బందుల ప్రభావమే నన్ను ఏదైనా ప్రత్యేకంగా సాధించేలా ప్రేరణ కలిగించింది. అందుకే నా మనసుకు నచ్చిన లక్ష్యాన్నే ఎంచుకున్నా. మోడలింగ్‌తో మొదలుపెట్టి, నటిగానూ స్థిరపడ్డా. ఈ అందాల పోటీల ప్రపంచంలోకి రావాలనే ఆసక్తి 2015లో వచ్చింది. అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా. ఎన్నో అవాంతరాలు, అన్నింటినీ సహనంతో దాటుకుంటూ వచ్చా. ఆ వేదికపై గిరిజనుల ప్రతినిధిగా నిలబడాలనుకున్నా. ఈ ఏడాది ఫెమినా మిస్‌ ఇండియా 2022 గ్రాండ్‌ ఫినాలేలో స్థానాన్ని దక్కించుకున్నా. ఈ కల నెరవేరడానికి ఎనిమిదేళ్లు పట్టింది. జీవితంలో ఏది జరిగినా.. దాని వెనుక ఏదో ఒక కారణం తప్పక ఉంటుంది. మనం నమ్మకంతో, సహనంగా ఉండాలి. ఫైనల్‌ లిస్ట్‌లో స్థానాన్ని దక్కించుకున్న తొలి గిరిజన యువతి నేను కావడం గర్వంగా ఉంది. 

బోలెడు ఆశయాలున్నాయి..

మా గిరిజన సంప్రదాయాల్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి, పెద్ద వ్యాపారవేత్త కావాలి, పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజల్లో చైతన్యాన్ని తేవాలి.. గిరిజనులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలి... ఇవీ నా లక్ష్యాలు. చిన్నప్పటి నుంచి జంతు ప్రేమికురాలిని. అంతరిస్తున్న జంతు జాతులను పరిరక్షించే ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నా. దీన్ని కొనసాగిస్తా.

ప్రతి మహిళకూ..

మొహమాటం లేకుండా ముక్కుసూటిగా నడుచుకోవాలి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి, స్వతంత్ర భావాలతో ఉండాలి... అప్పుడే అనుకున్నది సాధించగలం.  ప్రియాంక చోప్రా నా మనసుకు నచ్చిన వ్యక్తి. ఆమెలో ఏదో తెలియని శక్తి ఉంది. మాతృభూమి ఝార్ఖండ్‌ను గర్వించేలా చేసింది. ప్రస్తుత తరానికి నేను చెప్పేదేంటంటే సమయం వెనుక పరుగులుపెట్టి పోటీ పడొద్దు. మన వంతు కృషి చేస్తూ, అవకాశం వచ్చేవరకు నమ్మకంగా సహనంతో ఎదురుచూడాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్