కోట్ల మందిని నవ్విస్తోంది

మహిళలెదుర్కొంటున్న సామాజిక సమస్యలపై ఆ అమ్మాయి తీసిన వీడియోలను 5 కోట్ల మంది వీక్షించారు. స్టాండప్‌ కమెడియన్‌గా ఓవైపు అందరినీ నవ్విస్తూనే, మరోవైపు కుటుంబ విలువలు, లింగ వివక్ష వంటి అంశాలపై అవగాహన కలిగిస్తూ లక్షలమంది ఫాలోవర్స్‌తో సామాజిక

Updated : 07 Jul 2022 08:59 IST

మహిళలెదుర్కొంటున్న సామాజిక సమస్యలపై ఆ అమ్మాయి తీసిన వీడియోలను 5 కోట్ల మంది వీక్షించారు. స్టాండప్‌ కమెడియన్‌గా ఓవైపు అందరినీ నవ్విస్తూనే, మరోవైపు కుటుంబ విలువలు, లింగ వివక్ష వంటి అంశాలపై అవగాహన కలిగిస్తూ లక్షలమంది ఫాలోవర్స్‌తో సామాజిక మాధ్యమాల్లో స్టార్‌గా ఎదిగిన ఆంచల్‌ అగర్వాల్‌ స్ఫూర్తి కథనమిది.

ధ్యతరగతి కుటుంబంలో పుట్టింది ఆంచల్‌ అగర్వాల్‌. అందరి అమ్మాయిల్లాగే జీవితంలో ఏదైనా సాధించాలనే కలతో బీకాం చేసింది. ఎంబీఏ చదవడానికి ముంబయి వెళ్లింది. పూర్తయిన తర్వాత సోషల్‌ మీడియా, డిజిటల్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజిస్ట్‌గా చేరింది. దాంతోపాటు కాఫీడేలో సేల్స్‌ ట్రైనీగా నాలుగునెలలు పనిచేసింది. ఆ సమయంలోనే స్టాండప్‌ కామెడీ షోల గురించి తెలిసిందీమెకు. చిన్నప్పటి నుంచి తన కబుర్లతో చుట్టూ ఉన్న వారందరినీ నవ్వించగలిగే ఆంచల్‌ తన నైపుణ్యాలను ఆ షోలో చూపించే ప్రయత్నం చేసి, ప్రశంసలు అందుకుంది. దాని ఫలితంగా ఓ వెబ్‌సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మరోవైపు సోషల్‌ మీడియా వేదికగా రకరకాల అంశాలపై అవగాహన కల్పించడం ప్రారంభించింది. దీంతోపాటు అమెజాన్‌ ప్రైమ్‌, ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలతో కలిసి పనిచేసింది.

కొవిడ్‌ సమయంలో...

లాక్‌డౌన్‌లో ఆంచల్‌ వీడియోలు మరింత ప్రాచుర్యం పొందాయి. ఈమె చేసే కామెడీకి స్పందన ఎక్కువగా వచ్చేది. చాలామంది వీక్షకులు తమ అభిప్రాయాలను పంపేవారు. దేశవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు మానసికంగా ఉపశమనాన్ని అందించిన కంటెంట్‌ క్రియేటర్స్‌పై చేపట్టిన సర్వేలో గుర్తింపు పొందిన వారిలో ఆంచల్‌ ఉండటం విశేషం.

అందరిలా కాకుండా.

ఇంటర్‌ తర్వాత తన స్నేహితులందరూ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ అంటూ వెళ్లినా, తను మాత్రం ఎంబీఏ చదవాలనుకున్నా అంటుంది ఆంచల్‌. ‘నాలో ఎటువంటి నైపుణ్యాలున్నాయో, ఏ రంగంపై ఆసక్తి ఉందో గుర్తించుకొని ఆ దిశగా అభివృద్ధి చేసుకోవాలనుకున్నా. సామాజిక మాధ్యమాలపై అమ్మా నాన్నలకు అంతగా అవగాహన లేకపోయినా, నా ఆలోచనలను ప్రోత్సహించేవారు. కొన్నిసార్లు అమ్మ కూడా నాతోపాటు వీడియోలు చేయడానికి ఉత్సాహం చూపించేది. సామాజిక అంశాలు మహిళలకు సంబంధించినవి ప్రధానంగా తీసుకొని వీడియోలు చేసేదాన్ని. ‘చదువు తర్వాత పెళ్లెందుకు ఇంకా అవలేదు, పెళ్లైన వెంటనే పిల్లలు ఇంకా పుట్టలేదా’ అనే ప్రశ్నలు చాలా మంది నుంచి మనకు వినిపిస్తుంటాయి. అటువంటి అంశాలకు హాస్యాన్ని జోడించి వీడియో చేసేదాన్ని. వాటికి చాలా మంది నుంచి స్పందన వచ్చేది. కొందరు ప్రశంసించేవారు. మరికొందరు తమ అనుభవాలను నాకు రాసి పంపేవారు. ఈ క్రమంలో విమర్శలూ వస్తుంటాయి. వారి ద్వేషం వారివద్దనే ఉండనిద్దాం అనుకుంటుంటా. ప్రస్తుతం న్యూయార్క్‌లో సెకండ్‌ మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నా. ఈ మధ్య ఉమెన్స్‌ కమ్యూనిటీకి సంబంధించి ‘ఆల్‌ వుమెన్‌.ఇంక్‌’ ప్రారంభించా. ప్రపంచవ్యాప్త మహిళలందరినీ ఒక వేదికపైకి తీసుకురావాలని ఉంది. మహిళల అభిప్రాయాలు, ఆశయాలు సహా పలు సామాజిక అంశాలపై అవగాహన కలిగేలా కృషి చేస్తా’ అని చెప్పుకొస్తున్న ఇండోర్‌కు చెందిన 30 ఏళ్ల ఆంచల్‌ ఏటా సోషల్‌ సమోసా నెట్‌వర్క్‌ అందించే ‘సూపర్‌ ఉమెన్‌ 2022’ అవార్డును ఈ ఏడాది గెలుచుకుంది. వీక్షకుల సమయం, ఆరోగ్యానికి గౌరవాన్నిస్తానని, దానికి తగినట్లుగానే వీడియోలను రూపొందిస్తానని చెప్పే ఆంచల్‌ తనలాంటివారికి స్ఫూర్తిగా మారింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్