నాన్న తీర్చిదిద్దిన స్పీకర్‌!

‘మా నాన్న కూడా వాళ్ల నాన్నలా ఉంటే ఎంత బాగుండు..’ ఇలా ఎప్పుడైనా అనుకున్నారా? ప్రాచీ ఠాకూర్‌ అనుకుంది. ఆయన చేసే పనిని ఒకప్పుడు చిన్నతనంగా భావించిన ఆ అమ్మాయే.. ఇప్పుడు ఆయనే నా హీరో అంటోంది. అంతేనా.. సోషల్‌ మీడియాలో పంచుకొని నెటిజన్ల

Published : 10 Jul 2022 03:49 IST

‘మా నాన్న కూడా వాళ్ల నాన్నలా ఉంటే ఎంత బాగుండు..’ ఇలా ఎప్పుడైనా అనుకున్నారా? ప్రాచీ ఠాకూర్‌ అనుకుంది. ఆయన చేసే పనిని ఒకప్పుడు చిన్నతనంగా భావించిన ఆ అమ్మాయే.. ఇప్పుడు ఆయనే నా హీరో అంటోంది. అంతేనా.. సోషల్‌ మీడియాలో పంచుకొని నెటిజన్ల నుంచి బోలెడు ప్రశంసలూ అందుకుంటోంది. అంతలా మెప్పించిన వాళ్ల కథేంటో మీరూ చదివేయండి.

వెదురు కర్రలు, గడ్డితో వేసిన పైకప్పు.. ముందేమో మట్టితో అలికిన వసారా.. ఇదీ ప్రాచీ ఇల్లు. ఆమె నాన్నది రోడ్డుపక్కన గ్యాస్‌ స్టవ్‌, కుక్కర్లు బాగు చేసే చిన్న బడ్డీ. అంతంత మాత్రం సంపాదన. రోజూ రోటీ, పచ్చడి ఇదే ఆహారం. వీళ్లది బిహార్‌లోని సుపౌల్‌. ఓసారి బడిలో ‘కుటుంబం’పై వ్యాసం రాయమన్నారు. దానిలో నాన్న వ్యాపారి, అమ్మ టైలర్‌ అని రాసింది చిన్నారి ప్రాచీ. దాన్ని చూసిన తోటి విద్యార్థులు హేళన చేశారు. తట్టుకోలేక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిందామె. ‘నువ్వూ అందరి నాన్నల్లా ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేయొచ్చుగా!’ అని అడిగింది అమాయకంగా. ఆయనేమో నవ్వి కూతురి కన్నీళ్లు తుడుస్తూ ‘జీవితంలో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు’ అని సమాధానమిచ్చాడు. ఆ మాటలు ప్రాచీకి అర్థం కాలేదు. ‘నాన్నకి కనీసం పెద్ద షాపు ఉన్నా బాగుండేది. ఆయనా ఇస్త్రీ చేసిన దుస్తుల్లో హుందాగా ఉంటే నేనూ అందరిలా తలెత్తుకొని తిరిగేదాన్ని’ ఈ ఆలోచన మాత్రం తన మెదడులో మెదిలేది.

ప్రాచీ పదో తరగతికొచ్చింది. ‘చదువు చాలు.. పెళ్లి చేసెయ్‌’ చుట్టుపక్కల వాళ్ల సలహాలు మొదలయ్యాయి. ప్రాచీ వాళ్ల నాన్న విని ఊరుకున్నాడు. అమ్మాయిలందరూ వంట నేర్చుకుంటుంటే.. ఆయన ‘నీకు నచ్చింది చెయ్‌’ అని కూతుర్ని ప్రోత్సహించాడు. ‘అప్పుడు అర్థమైంది నాకు.. అందరికంటే మా నాన్నెంత భిన్నమో! అప్పటి నుంచి పాత యూనిఫాంను గర్వంగా వేసుకునేదాన్ని. చినిగిన పుస్తకాలే అపురూపమయ్యాయి. నాన్న పేరు నిలబెట్టాలని కసిగా చదివేదాన్ని. డిగ్రీలోకి వచ్చాకనుకుంటా... నేను గర్భవతిని అయ్యాననీ, ఎవరితోనో వెళ్లిపోయాననీ వదంతులు పుట్టించారు. నాన్న భయపడలేదు. నవ్వి.. ‘ఇవన్నీ పట్టించుకోకూడదు’ అని నా భుజం తట్టారు. ఊళ్లో ఏ కార్యక్రమం జరిగినా నన్ను మాట్లాడమనే వారు. అంతమందిని చూసి భయపడితే ‘నీ ముందున్నది మనుషులు కాదు బంగాళాదుంపల బస్తాలనుకో’ అనే వారు. అలా ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టిన నేను విశ్వవిద్యాలయాల్లో గెస్ట్‌ లెక్చర్లు ఇచ్చాను. టెడెక్స్‌ స్పీకర్‌నయ్యా’ అని నవ్వుతూ చెబుతుంది ప్రాచీ. మాస్టర్స్‌తోపాటు పీహెచ్‌డీ పూర్తిచేసి ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తనను అవమానించిన వారి ఎదుటే తలెత్తుకొని జీవిస్తూ నాన్నకు గర్వకారణమైంది. మరి వాళ్ల నాన్న? ఇప్పటికీ అదే పని.. షాపు కొద్దిగా పెద్దదైంది. ‘అయితేనేం.. తన శ్రమతో, ఆ చిన్ని సంపాదనతోనే నన్నీ స్థాయిలో నిలబెట్టాడు. మా నాన్నంటే నాకు గర్వం’ అని చెబుతుంది ప్రాచీ. దీన్ని లింక్‌డిన్‌లో పెడితే.. చాలా మంది కదిలిపోయారు. దానికి స్పందనగా తమ కథల్ని పంచుకునే వారు కొందరైతే.. తమ తప్పును తెలుసుకున్నామంటున్న వాళ్లింకొందరు. మొత్తమ్మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. మన చుట్టూ కూడా ప్రాచీలు, అలాంటి నాన్నలెందరో. గమనించాలంతే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్