మార్పు తెస్తాం... చరితని మారుస్తాం!

స్నేహితులంతా కార్పొరేట్‌ కొలువులవైపు పరుగులు తీస్తుంటే... విదేశాల్లో చదువుకుని మరీ సామాజిక సేవకులయ్యారు వీళ్లు. చిన్నారుల చదువు, పేద విద్యార్థుల్లో కళా నైపుణ్యాల్ని పెంచడం, మహిళల ఆరోగ్యం... ఇలా భిన్నమైన విభాగాల్లో పనిచేస్తూ సమాజంలో మార్పు తెస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్‌ ఆసియా 30 అండర్‌ 30 జాబితాలో స్థానం దక్కించుకున్నారీ మహిళామణులు!

Updated : 11 Jul 2022 07:43 IST

స్నేహితులంతా కార్పొరేట్‌ కొలువులవైపు పరుగులు తీస్తుంటే... విదేశాల్లో చదువుకుని మరీ సామాజిక సేవకులయ్యారు వీళ్లు. చిన్నారుల చదువు, పేద విద్యార్థుల్లో కళా నైపుణ్యాల్ని పెంచడం, మహిళల ఆరోగ్యం... ఇలా భిన్నమైన విభాగాల్లో పనిచేస్తూ సమాజంలో మార్పు తెస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్‌ ఆసియా 30 అండర్‌ 30 జాబితాలో స్థానం దక్కించుకున్నారీ మహిళామణులు!


చిన్నారులకో చదువుల రాకెట్‌..

మొక్కై వంగనది మానై వంగదన్న మాటల్ని గట్టిగా నమ్ముతుంది నమ్యా మహాజన్‌(28). అందుకే 3-6 ఏళ్ల పిల్లల కోసం ‘రాకెట్‌ లెర్నింగ్‌’ని ప్రారంభించింది. మెదడు ఎదుగుదల 85 శాతం ఎనిమిదేళ్లలోపే ఉంటుంది. కానీ భారత్‌లో 50 శాతం పిల్లలకి అయిదేళ్లు వచ్చినా అక్షరాలూ, అంకెలూ రావడంలేదు. ఆ లోటు పూడ్చాలని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో చదువుకుంటూనే.. మరో ఇద్దరితో కలిసి 2020లో దిల్లీ కేంద్రంగా ఈ సంస్థను ప్రారంభించింది నమ్య. మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా అయిదు రాష్ట్రాల్లో పనిచేస్తోందీ సంస్థ. ‘పిల్లలకి తల్లిదండ్రులే మొదటి, ముఖ్యమైన టీచర్లవ్వాలి. అప్పుడు కచ్చితంగా చదువుల్లో ముందుంటారు’ అని చెప్పే నమ్య.. అంగన్వాడీ టీచర్‌ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులతో వాట్సాప్‌ గ్రూప్‌ని ఏర్పాటుచేసి దాన్లో టాస్క్‌లు ఇస్తోంది. ఆకారాల్నీ వస్తువుల్నీ గుర్తించడం, పువ్వుల్ని సేకరించడం, అంకెలూ, అక్షరాలూ, పేర్లూ, పద్యాలూ చెప్పడం, బొమ్మలు గీయడం, పాటలు పాడటంవంటి లక్ష్యాల్ని నిర్దేశిస్తారు. అవి పూర్తిచేసి ఫొటో, వీడియోల్ని గ్రూప్‌లో పంచుకోవాలి. అవి సరిగ్గా ఉంటే మెచ్చుకుంటూ బదులొస్తుంది. అంగన్వాడీ టీచర్లకి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పది లక్షల మంది పిల్లలకు ఈ సేవల్ని అందిస్తున్నారు. గూగుల్‌, అమెజాన్‌, సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ లాంటి కార్పొరేట్‌ దిగ్గజాలు రూ.8కోట్లు గ్రాంట్‌గా అందించాయి. 2025 నాటికి 50 లక్షల మంది పిల్లలకు చేరడమే లక్ష్యమని చెప్పే నమ్య.. మెకన్సీలో బిజినెస్‌ అనలిస్ట్‌గా, సెల్ఫ్‌ ఎంప్లాయ్డ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌కు ఎండీగా చేసింది.


కళలతో కలల భారతం!

గొప్ప కవులు, రచయితలూ, కళాకారులెందరో భారత్‌లో పుట్టారు. కానీ క్రమంగా కళలకి ప్రాధాన్యం తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికి 20 గంటల కంటే తక్కువగా ఈ పాఠాలు చెబుతున్నారు. భావవ్యక్తీకరణ నైపుణ్యాలూ, సృజనాత్మకత పెరగడానికీ కళలు ఉపయోగపడతాయి. అందుకే ‘స్లామ్‌ ఔట్‌ లౌడ్‌’ని ప్రారంభించానంటారు హిమాచల్‌కు చెందిన జిగ్యాస లబ్రూ(29). ఈమె హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి. ‘అల్పాదాయ వర్గాలుండే ప్రాంతంలో వాలంటీరుగా పాఠాలు చెప్పేదాన్ని. బాగా చదువుకుని, ఉద్యోగం సంపాదించాలని మాత్రమే అనుకునేవారా పిల్లలు. కవితలూ, సంగీతం పరిచయం చేశాక వారిలో ఎంతో మార్పు వచ్చింది. ఈ మార్పు దేశవ్యాప్తంగా తేవాలని 2018లో ఈ సంస్థను మొదలుపెట్టా’ అని చెబుతారు జిగ్యాస. ప్రభుత్వ స్కూళ్లలో 10-17 ఏళ్ల పిల్లలకు నాటకాలు, కవితలు రాయడం, సంగీతం, ఫొటోగ్రఫీ.. లాంటి అంశాల్లో వీరి వాలంటీర్లు శిక్షణ ఇస్తారు. కళల్లో అంతర్భాగంగా ఆత్మవిశ్వాసం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలూ, సానుభూతి, సృజనాత్మకత మొదలైన 21వ శతాబ్దపు నైపుణ్యాల్ని అయిదేళ్లపాటు నేర్పిస్తారు. వీళ్లలో 70 శాతం బాలికలే. నాలుగు రాష్ట్రాల్లోని 900 గ్రామాల్లో 50 వేల మందికి శిక్షణ ఇచ్చారు. వీళ్లలో చాలామంది వివిధ వేదికలమీద తమ కళల్ని ప్రదర్శిస్తున్నారు కూడా.


ఆ పేదరికాన్నీ రూపుమాపుదాం!

పీరియడ్‌ పావర్టీ... నెలసరి సమయంలో టైమ్‌కి శానిటరీ ప్యాడ్స్‌, కప్స్‌ అందకపోవడమూ, ఆ సమయంలో భద్రమైన, ప్రత్యేక వాష్‌రూమ్‌లు లేకపోవడం, దీని వెనక శాస్త్రీయత గురించి తెలియకపోవడాన్నే పీరియడ్‌ పావర్టీగా చెబుతోంది ఐక్యరాజ్యసమతి.ఆ కారణంగా భారత్‌లో మహిళలు ఎంత వివక్ష, క్షోభ అనుభవిస్తున్నదీ ప్రచారం చేస్తూ మార్పు తెచ్చేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది అదితి అరోరా(29). కౌమార బాలికల కోసం పనిచేసే ఐరాస విభాగాలకు మద్దతుగా ‘యూఎన్‌ ఫౌండేషన్‌’ 2010లో ‘గర్ల్‌ అప్‌’ను ప్రారంభించింది. భారత్‌లో దీనికి అదితి నాయకత్వం వహిస్తున్నారు. మనదేశంలో వేర్వేరు నగరాల్లో పదివేల మంది యువతులకు పీరియడ్‌ పావర్టీ, మహిళలపైన జరిగే హింస, వారి మానసిక ఆరోగ్యం.. వీటిపైన గొంతు విప్పేలా శిక్షణ ఇచ్చింది గర్ల్‌ అప్‌. బాలికలు స్టెమ్‌ సబ్జెక్టులవైపు వెళ్లేలా, వక్తలుగా మారేలానూ శిక్షణ అందిస్తోంది. మహిళా వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించేందుకు ‘అప్రైంటిస్‌ హబ్‌’ పేరుతో 18-26 ఏళ్ల మహిళలకు ప్రత్యేక కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నారు. వీటిని పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా చేస్తున్నారు. గర్ల్‌ అప్‌ ద్వారా నిధులు సమీకరించి.. వెయ్యి మందికి రెండేళ్లపాటు శానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందించింది అదితి. రాజనీతి శాస్త్రంలో బ్యాచిలర్స్‌, అంతర్జాతీయ వ్యవహారాల్లో మాస్టర్స్‌(జెనీవా) చేసిన అదితి.. అమెరికాకు చెందిన ‘జస్ట్‌ ఎ గర్ల్‌ ఐఎన్‌సీ’కు ఇన్‌క్లూజివిటీ అడ్వైజరీ బోర్డ్‌ సభ్యురాలు కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్