మా బ్యాంకు టీనేజర్లకే!

చిన్నవాళ్లు మీకెందుకు డబ్బు సంగతి... అంటూ పిల్లల్ని చాలావరకూ ఆర్థిక విషయాలకు దూరంగానే పెంచుతారు ఇళ్లల్లో. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన లవికా అగర్వాల్‌ అనుభవమూ ఇందుకు భిన్నమైందేమీ కాదు. టీనేజ్‌ పిల్లల్నీ పెద్దవాళ్లు ఇలానే

Updated : 14 Jul 2022 09:36 IST

చిన్నవాళ్లు మీకెందుకు డబ్బు సంగతి... అంటూ పిల్లల్ని చాలావరకూ ఆర్థిక విషయాలకు దూరంగానే పెంచుతారు ఇళ్లల్లో. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన లవికా అగర్వాల్‌ అనుభవమూ ఇందుకు భిన్నమైందేమీ కాదు. టీనేజ్‌ పిల్లల్నీ పెద్దవాళ్లు ఇలానే చూస్తారు. దాంతో జీవితంలో వాళ్లు పొదుపు, ఖర్చు, మదుపు విషయాల్లో వెనకబడతారు. బెంగళూరు కేంద్రంగా లవికా ప్రారంభించిన ‘అకుడో’ టీనేజర్లకు ఆర్థిక విజ్ఞానాన్నీ, బ్యాంకింగ్‌ సేవల్నీ అందిస్తోంది.

భారతీయ సమాజంలో డబ్బు విషయాల్ని పిల్లలతో పంచుకోరు పెద్దవాళ్లు. దాంతో పెద్దయ్యాక ఈ విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్లలేరా పిల్లలు. పెట్టుబడి గురించే కాదు, ప్రాథమికమైన విషయాలపైనా అవగాహన ఉండదంటారు లవికా. ఈమె ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థి. బీటెక్‌ తర్వాత అమెరికాకు చెందిన ఫిన్‌టెక్‌ సంస్థ ‘క్యాపిటల్‌ వన్‌’లో ఆరేళ్లు పనిచేసింది. ఆ సమయంలోనే వినియోగదారులకు ఆర్థిక సందేహాల్ని తీర్చడానికి చాట్‌బోట్‌ని అభివృద్ధి చేసింది వీరి బృందం. సంపాదన మొదలుపెట్టాక కానీ యువత ఆర్థిక పాఠాలు నేర్చుకోవడంలేదన్న విషయం వీరికి అప్పుడే అర్థమైంది. దాంతో టీనేజ్‌ నుంచే ఆర్థికాంశాలు నేర్పే వేదికను ప్రారంభించాలనుకున్నారు. 2020 ఆగస్టులో బెంగళూరు కేంద్రంగా ‘అకుడో’ని సజల్‌, జగ్వీర్‌ గాంధీలతో కలిసి ప్రారంభించారు 29 ఏళ్ల లవికా. నైజీరియా భాషలో దీనికి ‘ప్రశాంతమైన సంపద’ అని అర్థం.

యాప్‌, కార్డ్‌.. రెండూ

అకుడో ఖాతా తెరవాలంటే టీనేజర్లూ వ్యక్తిగత వివరాలు (కేవైసీ) తెలపాలి. దీనికి తల్లిదండ్రుల ఆమోదమూ తప్పనిసరి. తల్లిదండ్రుల ఫోన్‌కు పంపిన లింక్‌ ద్వారానే అకౌంట్‌ తెరవగలరు. ఆ తర్వాతే అకుడో యాప్‌ని ఉపయోగించగలరు. దాంతోపాటు ప్రీపెయిడ్‌ కార్డ్‌ వస్తుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఆర్థికాంశాలు నేర్చుకోవాల్సిందే. అది తల్లిదండ్రుల పర్యవేక్షణలో జరగాలనుకుంది లవికా బృందం. అందుకే అకుడో ద్వారా జరిగే చెల్లింపుల సమాచారం తల్లిదండ్రులకు వెళ్తుంది. యాప్‌లో ఆర్థిక పాఠాలు చెప్పే అనేక వీడియోలూ, గేమ్‌లూ ఉంటాయి. గేమ్‌లలో ఒక్కో దశనీ దాటితే రివార్డ్‌ పాయింట్లూ వస్తాయి. దీంతో తక్కువ కాలంలోనే తల్లిదండ్రులూ, టీనేజర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. టీనేజర్ల ఉత్పత్తులకు సంబంధించి ఆఫర్లూ ఉంటాయి. దీన్లో పొదుపు, ఖర్చు చేసేందుకు వేర్వేరు ఖాతాలను నిర్వహించే వీలుంటుంది. ఈ సేవలకుగానూ కొద్ది మొత్తం ఫీజు చెల్లించాలి.

‘ప్రపంచీకరణ, ఆర్థికాభివృద్ధి కారణంగా సమాజంలో చాలా వర్గాలకు సంపాదించే అవకాశాలు వస్తున్నాయి. మునుపెన్నడూ చూడని సంపదని చూస్తున్నారు. కానీ దాన్ని సరైన పద్ధతిలో ఖర్చు, పొదుపు, మదుపు చేయలేకపోతే ప్రయోజనం ఉండదు. మన ఆర్థిక అలవాట్లు చాలా చిన్న వయసులోనే రూపొందుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ మనం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల్ని పెద్దయ్యాకే తెలుసుకుంటాం. మా సంస్థ సేవల ద్వారా తల్లిదండ్రులూ, పిల్లల మధ్య ఆర్థిక విషయాలు తరచూ చర్చకు వస్తాయి. ఆపైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. దీనిద్వారా పిల్లలు ఆర్థిక విషయాల్లో బాధ్యతతో ఉంటారు’ అంటుంది లవికా. గతేడాది సెప్టెంబరులో వై కాంబినేటర్‌, జాఫ్కో, ఇంక్యుబేట్‌ ఇండియా వంటి వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు అకుడోలో  రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్