మురికివాడ నుంచి ప్రపంచ వేదికపైకి!

డ్యాన్స్‌కి అబ్బాయి, అమ్మాయి తేడా లేదేమో కానీ.. బ్రేక్‌, హిప్‌హాప్‌కి వచ్చేసరికి మగవాళ్లే గుర్తొస్తారు. దీన్నే మార్చాలనుకుంది సిద్ధి తాంబే! ఆసక్తి ఉంటే ఎవరైనా రాణించగలరనే ఈమె పట్టుబట్టి బ్రేక్‌ డ్యాన్స్‌ నేర్చుకుంది. అంతేనా.. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి ఎదిగింది.

Published : 26 Jul 2022 02:42 IST

డ్యాన్స్‌కి అబ్బాయి, అమ్మాయి తేడా లేదేమో కానీ.. బ్రేక్‌, హిప్‌హాప్‌కి వచ్చేసరికి మగవాళ్లే గుర్తొస్తారు. దీన్నే మార్చాలనుకుంది సిద్ధి తాంబే! ఆసక్తి ఉంటే ఎవరైనా రాణించగలరనే ఈమె పట్టుబట్టి బ్రేక్‌ డ్యాన్స్‌ నేర్చుకుంది. అంతేనా.. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి ఎదిగింది.

మ్మ అంగన్‌వాడీ టీచర్‌, నాన్న ఆసుపత్రిలో వార్డ్‌బాయ్‌. ముంబయి మురికివాడల్లో చిన్న గదే వీళ్ల ఇల్లు. తనకో అక్క కూడా. అమ్మానాన్నలది కొద్ది సంపాదనే అయినా తమకన్నా తమ పిల్లలు మంచి స్థానంలో ఉండాలని కష్టపడి చదివిస్తున్నారు. సిద్ధి కూడా బాగా చదవాలనుకునేది. ఈమెకి డ్యాన్స్‌ అన్నా ఇష్టం. చుట్టుపక్కల వేడుకలేవైనా సిద్ధి డ్యాన్స్‌ ఉండాల్సిందే. ఒకసారి చూసి అలవోకగా స్టెప్పులను పట్టేసేది తను. వాళ్లు నివసించే చోట కొత్తగా బ్రేక్‌ డ్యాన్స్‌ నేర్పే స్కూల్‌ తెరిచారు. వాళ్లు చేసే స్టెప్స్‌ను 10 ఏళ్ల సిద్ధి అనుకరించేది. ‘అప్పటిదాకా బ్రేక్‌ డ్యాన్స్‌ అన్న పేరే వినలేదు. అనుకరిస్తూ వెళ్లేదాన్ని. అది చూసి అమ్మ డ్యాన్స్‌ స్కూల్లో చేర్చింది. ఏది చెప్పినా వెంటనే చేస్తుండటంతో అమ్మాయినైనా చేర్చుకున్నారు. అక్కడివాళ్లూ నన్ను అబ్బాయనే అనుకున్నారు. నాది అబ్బాయిల క్రాఫ్‌. సిధ్‌ అనే పిలిచేవారు. తర్వాత అమ్మాయినని తెలిసి ఆశ్చర్యపోయారు. అమ్మాయిలకు ఇది సరిపడదు. మీ శక్తి చాలదన్న మాటలు చాలా విన్నా. అది తప్పని నిరూపించాలనుకున్నా. దీన్ని బి-డ్యాన్స్‌ అంటారు కదా.. నేను బి-గర్ల్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్నా. కఠినమైన ఫ్లిప్స్‌ అన్నీ ప్రయత్నించేదాన్ని. కుచ్చులుగా ఊడిన జుట్టు, భుజాలు, మోకాళ్ల దెబ్బలతో ఇంటికి చేరిన రోజులెన్నో! ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొనేదాన్ని. అనుకున్నట్టుగానే బి-గర్ల్‌ సిధ్‌గా గుర్తింపు పొందా. అయితే ఈ పిలుపు చాలామందిని తికమక పెట్టేది. నాకు బార్బీ బొమ్మలంటే పిచ్చి. దీంతో బి-గర్ల్‌ బార్‌-బి అనడం మొదలుపెట్టారు’ అని చెప్పే సిద్ధి చదువుల్లోనూ ముందే. ఇంటర్‌ పూర్తిచేసింది. అబ్బాయిలతో పోటీపడే తను ఓటమిని ఒప్పుకోదు. ఆ తీరే పాల్గొన్న ప్రతిచోటా విజేతగా నిలబెడుతోంది. గత ఏడాది మొదటిసారి జాతీయ స్థాయిలో బి-గర్ల్‌ పోటీలు నిర్వహిస్తే దానిలో తనే విజేత. ఆపై నవంబరులో న్యూయార్క్‌లో జరగబోయే వరల్డ్‌ ఫైనల్స్‌లో పోటీపడనుంది. దానికోసం మొదటిసారి విమానాన్ని ఎక్కబోతోంది. 2018 యూత్‌ ఒలింపిక్స్‌లో బ్రేక్‌ డ్యాన్స్‌నీ చేర్చారు. 2024 పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ నిర్వహించనున్నారు. ఆ క్వాలిఫయర్‌ పోటీల్లో పోటీపడే అవకాశం దక్కించుకుంది సిద్ధి. జూన్‌లో జరగాల్సిన ఆ పోటీలు వాయిదా పడ్డాయి. వాటిల్లో సత్తాచాటి దేశానికి పతకం తెస్తానంటోందీ 18 ఏళ్ల అమ్మాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్