ఆమె బ్యాంకు.. పర్యావరణం కోసం!

పెళ్లిళ్లు, వేడుకలు బోలెడు సంబరాన్నివ్వడంతోపాటు పెద్దఎత్తున ప్లాస్టిక్‌ వ్యర్థాల్నీ మిగులుస్తుంటాయి. వాటితో ఎంత కాలుష్యం! రాబోయే తరాలకు ఇది ప్రమాదమే కదా! ఇదే ఆలోచించింది తులికా సునేజా. దానికి పర్యావరణ హిత పరిష్కారాన్నీ కనిపెట్టింది.

Published : 04 Aug 2022 18:19 IST

పెళ్లిళ్లు, వేడుకలు బోలెడు సంబరాన్నివ్వడంతోపాటు పెద్దఎత్తున ప్లాస్టిక్‌ వ్యర్థాల్నీ మిగులుస్తుంటాయి. వాటితో ఎంత కాలుష్యం! రాబోయే తరాలకు ఇది ప్రమాదమే కదా! ఇదే ఆలోచించింది తులికా సునేజా. దానికి పర్యావరణ హిత పరిష్కారాన్నీ కనిపెట్టింది.

తులిక గృహిణి. భర్త, పిల్లలు తోడిదే ఆమె లోకం. అప్పుడప్పుడూ భర్తకు వ్యాపార విషయాల్లో సాయం చేస్తుంది. ఓసారి ఎక్కడికో వెళ్లి వస్తుండగా ఊరి చివర గుట్టలుగా పడి ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను చూసింది. అవన్నీ ఓ వేడుకలో భోజనాల తాలూకూ ప్లేట్లు, గ్లాసులు. ఈ కాలుష్యం, వాతావరణ మార్పులు, అపరిశుభ్రత భవిష్యత్‌ తరాలకు ఎంత హాని కలిగిస్తాయో అని తనకు భయం వేసింది. వీళ్లది హరియాణలోని ఫరీదాబాద్‌. చిన్నతనం నుంచీ ఆరోగ్యకరమైన పర్యావరణంలో, వృథాకి దూరంగా పెరిగిన ఆమెకు దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలనిపించింది. అప్పుడొచ్చిన ఆలోచనే స్టీల్‌ క్రాకరీ బ్యాంకు. అంటే.. వేడుకలకు ఒకసారి వాడే ప్లాస్టిక్‌ వస్తువులకు బదులుగా స్టీలు సామగ్రిని అందించడం.

‘గ్రీన్‌ హ్యాండ్స్‌’లో స్వచ్ఛంద కార్యకర్తలతో తులిక...

‘పర్యావరణానికి హాని అని ఇంట్లోకి ప్లాస్టిక్‌ వస్తువులూ రానిచ్చేదాన్ని కాదు. కానీ నేనొక్కదాన్నే జాగ్రత్తపడితే సరిపోదు. ఇతరులకూ అవగాహన కల్పించాలనిపించింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను అరికడితే చాలావరకూ కాలుష్యాన్ని తగ్గించొచ్చు. బాగా ఆలోచించాక స్టీల్‌ వస్తువులను వాడుకోవడానికిచ్చే క్రాకరీ బ్యాంక్‌ ప్రారంభిస్తే నయమనిపించింది. స్నేహితులతో ఆలోచన పంచుకుంటే.. అవి తిరిగొస్తాయన్న నమ్మకమేంటని ఒకరంటే.. జనాలంతా ఇంటికొస్తుంటే ఎంత చిరాకు అంటూ నిరాశ పరిచారు. అప్పుడు మావారే తోడు నిలిచారు. ‘నీకు ఎవరి సాయమూ అవసరం లేదు... నువ్వొక్కదానివే దీన్ని నడిపించగల’వంటూ ప్రోత్సహించారు. అలా 2018లో ఫరీదాబాద్‌లో క్రాకరీ బ్యాంక్‌ ఆఫ్‌ తులికా ప్రారంభమైంది. మొదట దగ్గర్లో ఏ వేడుక జరుగుతోందని తెలిసినా వెళ్లి అవగాహన కలిగించేదాన్ని. స్టీల్‌ గ్లాసులు, ప్లేట్లు, స్పూన్లు.. అన్నీ మా దగ్గర లభిస్తాయి. పర్యావరణంపై ప్రేమ ఉన్న వారెందరో మా సేవల్ని వినియోగించుకుంటున్నారు’ అని చెబుతోంది తులిక. వీటిని ఉచితంగానే అందిస్తోంది. తీసుకెళ్లేవాళ్లు సెక్యూరిటీ కింద కొంత మొత్తం చెల్లించాలి. వస్తువులను అప్పజెప్పాక ఆ డబ్బు తిరిగిచ్చేస్తుంది. ఇప్పటివరకూ అయిదు లక్షలకుపైగా ప్లాస్టిక్‌ ప్లేట్లు, అంతే మొత్తంలో గ్లాసుల వినియోగాన్ని ఆపగలిగామని చెప్పే ఆమె సేవలు హరియాణలోని ఇతర పట్టణాలతోపాటు దిల్లీకీ విస్తరించాయి. ఇప్పుడు తన ఆధ్వర్యంలో ఇలా 9 బ్యాంకులు నడుస్తున్నాయి. ఈ వ్యవహారాలను తనొక్కతే చూసుకుంటోంది.

ప్లాస్టిక్‌ని అరికట్టడానికి ఇదొక్కటే సరిపోదు అనిపించింది తులికకు. 2020లో ‘గ్రీన్‌ హ్యాండ్స్‌’ పేరుతో ఎన్‌జీఓను ప్రారంభించింది. వాతావరణ సమస్యలపై చైతన్యాన్ని తేవడంతో పాటు, ప్లాస్టిక్‌ వల్ల నష్టాలు, మొక్కల పెంపకం, రసాయనాలకు దూరంగా ఉండటం వంటి విషయాల్లో అవగాహన కల్పిస్తోంది. సేంద్రియ విధానాన్ని పాటిస్తున్న గ్రామాలు, దగ్గర్లోని అడవులు, పక్షుల ఆవాసాలకు పిల్లలు, పెద్దలను పిక్‌నిక్‌లు, టూర్‌లకు తీసుకెళుతుంది. పళ్లు తోముకునే బ్రష్‌లు, దువ్వెన దగ్గర్నుంచి గరిటెలు, చెప్పులు ఇలా రోజూ మనం వాడే వస్తువులు ఎన్నింటినో భూమిలో త్వరగా కలిసిపోయే పదార్థాలతో రూపొందించి ‘ప్రకృతి ఎకో’ పేరుతో అమ్ముతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్