ఆర్థిక శక్తి!

మహిళ అంటే శక్తి మాత్రమే కాదు, ఆర్థిక శక్తి కూడా అంటోంది తాజా ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌- హురున్‌ శ్రీమంతుల జాబితా. రూ.1000 కోట్లు ఆపైన సంపద ఉన్న భారతీయ మహిళలు పదేళ్ల కిందట 13

Published : 23 Sep 2022 00:27 IST

మహిళ అంటే శక్తి మాత్రమే కాదు, ఆర్థిక శక్తి కూడా అంటోంది తాజా ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌- హురున్‌ శ్రీమంతుల జాబితా. రూ.1000 కోట్లు ఆపైన సంపద ఉన్న భారతీయ మహిళలు పదేళ్ల కిందట 13 మంది ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 55కు చేరడం విశేషం. అంటే పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. ఈ జాబితాలో స్థానం పొందిన వీళ్లు ఏం చెబుతున్నారంటే..

స్వశక్తి శ్రీమంతురాలు..

ఈ జాబితాలో నేహా నార్ఖడేకు ఓ ప్రత్యేకత ఉంది. స్వశక్తితో ఎదిగిన పిన్న వయస్కురాలైన మహిళ. 37 ఏళ్ల నేహా సంపద విలువ రూ.4700 కోట్లు.

పుణెకు చెందిన మధ్యతరగతి కుటుంబం నేహా వాళ్లది. బాల్యం నుంచి స్ఫూర్తిదాయక పుస్తకాలను చదివించేవారు తల్లిదండ్రులు. తనకు ఎనిమిదేళ్లున్నప్పుడే కంప్యూటర్‌ కొనిచ్చారు. అప్పట్నుంచీ కంప్యూటర్స్‌, సాంకేతిక రంగాలపైన ఆసక్తి పెంచుకున్నారు నేహా. పుణె విశ్వవిద్యాలయం నుంచి 2007లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, అట్లాంటాలోని జార్జియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ చేశారు. ఒరాకిల్‌లో కొన్నాళ్లు, ఆపైన లింక్డిన్‌లో పనిచేశారు. లింక్డిన్‌లో ఉన్నప్పుడే వెబ్‌సైట్‌ వీక్షకులు ఏయే అంశాలపై క్లిక్‌ చేస్తున్నారు, ఎంత తరచుగా సైట్‌కి వస్తున్నారు.. మొదలైన అంశాల్ని గమనించే అపాచీ కాఫ్కా సాఫ్ట్‌వేర్‌ను ఈమె బృందం అభివృద్ధి చేసింది. ఇదో ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌. దీనికి ఉన్న డిమాండ్‌ని గుర్తించి 2014లో ఇద్దరు సహోద్యోగులతో కలిసి ‘కన్‌ఫ్లూయంట్‌’ను స్థాపించారు. ఆ సంస్థకు చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా, ఆపైన చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ప్రస్తుతం బోర్డు సభ్యురాలు. డిస్నీ హాట్‌స్టార్‌, బీఎమ్‌డబ్ల్యూ, నెట్‌ఫ్లిక్స్‌, బాష్‌ వంటి ప్రఖ్యాత సంస్థలు ఈ కంపెనీ ఖాతాదారులే.

మహిళలకు ప్రాధాన్యం
‘లక్ష్య సాధనలో ఆటంకాలు సహజమే వాటిని దాటగలిగే ధైర్యం, నేర్పు మనలో ఉండాలి. జీవితంలో మంచి మెంటార్స్‌ ఉండాలి. డోలాయమానంలో ఉన్నప్పుడు మనల్ని ముందుకు నడిపించేది వాళ్లే. ఈ రంగంలో సవాళ్లు దాటడానికి, మగవాళ్లతో పోలిస్తే మహిళలు తమ సామర్థ్యాన్ని కాస్త ఎక్కువ ఉపయోగించాలి. మా సంస్థలో మేనేజ్‌మెంట్‌ స్థాయిలో మహిళలు 50 శాతం ఉన్నారు. ఇలా నియమించుకున్నందుకు నేనెంతో గర్వపడతా’ అని చెప్పే నేహా.. ఇంద్రా నూయీ, పద్మశ్రీ వారియర్‌ తనకు ఆదర్శమంటుంది.


మా బాస్‌ అత్తగారే!

రూ.37,200 కోట్ల సంపదతో రేఖ ఝన్‌ఝున్‌వాలా రెండో స్థానంలో నిలిచారు. మహిళలు తక్కువగా ఉండే దలాల్‌స్ట్రీట్‌లో అడుగుపెట్టి సంపద సృష్టిలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

బిగ్‌బుల్‌గా పేరు తెచ్చుకున్న రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా గురించి తెలియని వాళ్లుండరు. పెట్టబడులు పెట్టడం, లాభాలు సాధించడంలో.. రాకేశ్‌కి సైతం పోటీనిచ్చే ఆయన భార్య రేఖకి దలాల్‌ స్ట్రీట్‌లో ప్రత్యేకస్థానం ఉంది. వేల కోట్ల సంపదని సృష్టించిన రేఖని ఎవరైనా షేర్‌మార్కెట్‌లో రాణించే టిప్‌ ఇవ్వమని అడిగితే... కుటుంబం, పిల్లలు ఇంతకుమించిన సంతోషం ఏముంది? అంటారు నవ్వుతూ. సంపద కన్నా.. కుటుంబం, విలువలే ముఖ్యం అంటారామె. ముంబయిలో పుట్టి, పెరిగిన రేఖ డిగ్రీ చదివారు. షేర్‌మార్కెట్‌పై పట్టు సాధించినా పిల్లలే లోకమనుకుంటారు. కారణం.. పెళ్లైన పదిహేడేళ్లకి వాళ్లకి నిషిత పుట్టింది. గర్భధారణ సమయంలో తీవ్ర అనారోగ్యాన్ని ఎదుర్కొన్నారు. ‘మూడు నెలలు స్నానం కూడా చేయలేదు. తినడానికి కూడా కదల్లేని పరిస్థితి. అయితేనేం నిషిత పుట్టాక మా ప్రపంచం మారిపోయింది. ఆ తర్వాత కవలలు ఆర్యమాన్‌, ఆర్యవీర్‌ పుట్టారు. అంతవరకూ ఓ చిన్న ఇంట్లో అత్తమామలతో సర్దుకుని ఉండేవాళ్లం. ఆ తర్వాతే పెద్ద ఇంటికి మారాం. మా ఇంట్లో పార్టీలంటూ ఉంటే అవి పిల్లల పుట్టిన రోజులే’ అనే రేఖ ‘మా ఇంటికి బాస్‌ మా అత్తగారే’ అంటారు. రాకేశ్‌ కలుపుగోలు మనిషి. ‘మాది ముంబయి... నువ్వు అంథేరా (అంధేరి) నుంచి వచ్చావ్‌’ అంటూ ఆటపట్టించినా.. నవ్వుతూనే అటు వ్యాపారంలో, ఇంట్లోనూ కీలకపాత్ర పోషించారు రేఖ. రాకేశ్‌ అనేపేరులోని ఆర్‌ఏ అనే ఆంగ్ల అక్షరాలని రేఖలోని ఆర్‌ఈ అక్షరాలని తీసుకుని రేర్‌ అనే సంస్థని స్థాపించారు. ‘మేం మధ్యతరగతి నుంచే వచ్చాం. డబ్బు విలువ తెలుసు. కానీ సంపద మా పిల్లలని పాడు చేయకూడదని అనుకుంటా’నంటారు రేఖ.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్