సాయం.. కోట్ల వ్యాపారమైంది

కార్పొరేట్‌ ఉద్యోగం.. ఏళ్ల అనుభవం, పెద్ద సంస్థలతో పనిచేసే అవకాశం.. వీటన్నింటినీ పక్కన పెట్టేసింది సోనియా.

Updated : 30 Sep 2022 02:51 IST

కార్పొరేట్‌ ఉద్యోగం.. ఏళ్ల అనుభవం, పెద్ద సంస్థలతో పనిచేసే అవకాశం.. వీటన్నింటినీ పక్కన పెట్టేసింది సోనియా. ఇంటి గ్యారేజ్‌లో టైలరింగ్‌ మొదలుపెట్టింది. ‘ఇదేం పిచ్చి?’ అనుకున్నారంతా! కానీ తను మాత్రం దాని ఆధారంగా వందల మందికి సాయమందించడమే కాదు... కోట్ల వ్యాపారంగానూ తీర్చిదిద్దింది. ఆమె కథేంటో.. చదివేయండి.

‘నాన్న సైనికుడు. ఆయనతో పాటు దేశమంతా పర్యటించా. ఓసారి బిహార్‌లోని నలందకు వెళ్లా. అదో నక్సల్‌ ప్రాంతం. కొంతమంది గిరిజన అమ్మాయిలు ఒక చోట కూర్చొని ఉన్నారు. అంతా 12-14 ఏళ్లలోపు వారే! దగ్గరగా వెళ్లి చూస్తే చేతిలో తుపాకులు! భయపడలేదు కానీ.. ఆశ్చర్యపోయా. స్కూలుకెళ్లకుండా ఇక్కడ కూర్చున్నారేంటని అడిగితే.. కళతప్పిన ముఖాలు, పేలవమైన నవ్వుతో ‘మేం బతకడమే గొప్ప. చదువంటే కలే’ అన్నారు. వాళ్ల మాటలు నా మీద చాలా ప్రభావం చూపాయి’ అని గుర్తు చేసుకుంటుంది సోనియా ఆనంద్‌. వీళ్లది ముంబయి. ఎంబీఏ చేసింది. మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా ప్రపంచ బ్యాంకు సహా వివిధ సంస్థల సామాజిక కార్యక్రమాల్లో భాగంగా పల్లెల అభివృద్ధి కోసం పని చేసేది. ఓసారిలాగే ఒడిశా వెళ్లింది. అక్కడి గిరిజనులతో మాట్లాడినప్పుడు వాళ్లు తమిళనాడు, హరియాణ నుంచి వచ్చినట్లు తెలిసింది. ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ.. ఇరుకు గదుల్లో చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటున్న వాళ్లని చూసి చలించిపోయింది. సంపాదన కంటే.. అది లేకపోతే చిన్నవయసులో పెళ్లి చేసుకొని వెళ్లాల్సొస్తుందన్న భయమే వాళ్లలో కనిపించేది. వీళ్లకి ఎలాగైనా సాయం చేయాలనుకొని ఆ క్షణమే నిర్ణయించుకుంది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసింది.

‘15 ఏళ్ల కార్పొరేట్‌ జీవితం, అంతకుమించి గుర్తింపు. వదిలేస్తాననగానే ఇంట్లోవాళ్లతో సహా అందరూ పిచ్చిదానిలా చూశారు. ఆ మాట ముఖంపైనే అన్నారు కూడా. నేనేమీ పట్టించుకోలేదు. 2018లో ఒడిశాలో ‘మాంక్‌ అండ్‌ మీ’ ప్రారంభించా. గిరిజన అమ్మాయిలతోపాటు చేతివృత్తులు చేసే యువకులనీ చేర్చుకున్నా. కార్పొరేట్‌ సంస్థలకు యూనిఫాంలు కుట్టిచ్చే వాళ్లం. మారుమూల ప్రాంతం కదా! వస్త్రం, సామగ్రి అంతా మేమే మాయాల్సి వచ్చేది. నాకున్న కార్పొరేట్‌ పరిచయాలతో ఆర్డర్లూ బాగా వచ్చాయి. అంతా బాగుందనుకున్న సమయంలో 2019లో ఫనీ సైక్లోన్‌ మా వ్యాపారాన్ని దెబ్బతీసింది. దీంతో ముంబయిలో మా గ్యారేజీకి మకాం మార్చాం. దేశంలోని వివిధ రకాల నేత వస్త్రాల గురించి పరిశోధించా. వాటితో డిజైనర్‌ దుస్తులను రూపొందించి వెబ్‌సైట్‌లో ఉంచే వాళ్లం. మొదటిసారి 500 రకాలను రూపొందిస్తే 15 రోజుల్లోనే అమ్ముడయ్యాయి. ఈలోగా కరోనా! అప్పుడు వర్చువల్‌ డిజైనర్లను ఎంపిక చేసుకొని పని కొనసాగించా’నని చెబుతుంది సోనియా. నెలకు వెయ్యికి పైగా ఆర్డర్లు తీసుకుంటున్న వీళ్ల వ్యాపారం ఈ ఏడాది రూ.7.5 కోట్లకు చేరింది. వంద మందికిపైగా గిరిజన అమ్మాయిలకు ఉపాధి కల్పిస్తోంది. సొంతంగా ఫ్యాక్టరీనీ ఏర్పాటు చేసుకుంది. సొంత వెబ్‌సైట్‌తోపాటు సోషల్‌మీడియా, ఈకామర్స్‌ సైట్లలోనూ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. అవి అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్‌లకీ ఎగుమతి అవుతున్నాయి. ‘ఇప్పుడు ఈ అమ్మాయిలు పరిస్థితులు ఎలా ఉన్నా పంటి బిగువున సర్దుకుపోనక్కర్లేదు. పని లేకపోతే 15 ఏళ్లకే పెళ్లి అనీ భయపడక్కర్లేదు. ఇది నాకు సంతృప్తినిస్తోంది. ఏటా ఇంకొంత మందికైనా ఉపాధి పెంచుకుంటూ వెళితే చాలు నా కల తీరుతుంది’ అంటుంది సోనియా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్