మనసుకు గాయమైనా ఫర్వాలేదు..

రిషీకి దూరమైన తర్వాత నిషాకు మనసు తేలికైంది. అయితే ఆందోళన, ఒత్తిడి మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో మనసులో విషపూరితమైన ఆలోచనలతో ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు మానసిక నిపుణులు.

Published : 02 Oct 2022 00:12 IST

రిషీకి దూరమైన తర్వాత నిషాకు మనసు తేలికైంది. అయితే ఆందోళన, ఒత్తిడి మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో మనసులో విషపూరితమైన ఆలోచనలతో ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు మానసిక నిపుణులు. మనసుకు గాయమైనా ఫర్వాలేదు.. నిత్యం బాధించే బంధం నుంచి శాశ్వతంగా బయటపడటానికి ప్రయత్నించాలంటున్నారు.

ఎవరితోనైతే కలిసి ఉన్నప్పుడు మనసంతా ఆందోళనతో నిండిపోతే అది సరైన ప్రేమ బంధం కాదు. ఆ వ్యక్తి మాటలు వేదన కలిగిస్తున్నాయంటే తనకెంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎదుటివ్యక్తి ప్రతి చిన్న విషయానికి విమర్శించడం, తక్కువ చేసి మాట్లాడటం వంటివి మన ఆత్మ గౌరవాన్ని తగ్గిస్తున్నట్లు తెలుసుకోవాలి. అకారణంగా అవమానించడం, ప్రశ్నించే అవకాశాన్నివ్వకపోవడం, అధికారాన్ని ప్రదర్శించడం వంటివన్నీ వేధింపులే. ఇటువంటివి పైకి తెలియకుండానే మనసును గాయపరుస్తుంటాయి. కెరియర్‌లో విజయం సాధించినప్పుడు సంతోషించి ప్రోత్సహించకుండా అసూయతో కూడిన ప్రవర్తన వారిలో కనిపిస్తే మన అభివృద్ధిని కాంక్షించేవారు కాదని తెలుసుకోవాలి. నిత్యం అనుమానిస్తూ, తరచూ ఫోన్‌, సందేశాలతో విసిగిస్తున్నప్పుడు తేలికగా తీసుకోకూడదు. ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెబుతూ, మరోవైపు మనపై నమ్మకం కొరవడిన వారితో కలిసి అడుగు లేయడం కష్టం. భావస్వేచ్ఛలేని చోట బంధం కొనసాగించాలా వద్దా అనేది ఆలోచించాలి. వీలైనంత త్వరగా దాన్నుంచి బయటపడితే మంచిది.

పాటించాలి..
నచ్చిన వ్యక్తి మోసగాడని తెలిసి దూరం జరిగినప్పుడు ఆ వేదన మనసును స్థిరంగా ఉండనివ్వదు. ఈ సమయంలోనే అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కుంగుబాటుకు గురి కాకూడదు. గతాన్ని వీలైనంత త్వరగా మర్చిపోవాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా జరిగి, స్వీయపరిశీలన చేసుకోవాలి. భవిష్యత్తును ఛాలెంజ్‌గా తీసుకొని తగిన ప్రణాళికలను రచించుకోవాలి. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవడానికి యోగా, ధ్యానం అలవరుచుకోవాలి. కుటుంబంతో, ప్రాణస్నేహితులతో ఎక్కువ సమయం గడపాలి. నచ్చిన ప్రాంతాలను పర్యటించడం, ఇష్టమైన రచనలు చదవడం వంటివన్నీ మనసును మరోవైపు నడిపించి, గాయాన్ని తగ్గిస్తాయి. క్రమేపీ ప్రశాంతత దొరకడమే కాదు, ఉత్సాహంగా భవిష్యత్తులోకి అడుగులేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్