Updated : 04/10/2022 07:03 IST

నష్టాల సంస్థని వేలకోట్లకు...

కూతురిపై ఇష్టంతో వ్యాపారానికి... ‘వినతి ఆర్గానిక్స్‌’ అని పేరు పెట్టుకున్నాడా తండ్రి. ఆ అమ్మాయీ తక్కువేమీ కాదు. మూసేయడం తప్ప మరో దారి లేదనుకున్న ఆ సంస్థ టర్నోవర్‌ని రూ.20 కోట్ల నుంచి 8 వేల కోట్లకు చేర్చింది. స్పెషాలిటీ కెమికల్‌ రంగంలో సంస్థని గ్లోబల్‌ లీడర్‌గా మార్చేసింది..

వినతి  తండ్రి వినోద్‌ సరాఫ్‌ది రాజస్థాన్‌లోని ఫతేపూర్‌. మధ్య  తరగతి కుటుంబం. చేతిలో బిట్స్‌పిలానీ పట్టా... కంటినిండా ఎదగాలన్న కలలు తప్ప పైసా లేదు. ఆదిత్యబిర్లా, ఎమ్‌ఆర్‌పీఎల్‌ సంస్థల్లో పనిచేశాక సొంతగా ఎదగాలన్న ఉద్దేశంతో బ్యాంకు రుణం తీసుకుని... వినతీ ఆర్గానిక్స్‌ను స్థాపించి ఐబీబీ (ఐసో బ్యుటైల్‌ బెంజీన్‌) తయారీ మొదలుపెట్టారు. ఈ రసాయనాన్ని నొప్పి నివారణ ఔషధాల తయారీలో వాడతారు. సంస్థ కాస్త లాభాల బాట పట్టాక.. వినోద్‌ ఏటీబీఎస్‌ అనే మరో రసాయనం తయారీనీ మొదలు పెట్టారు. దీన్ని డిటర్జెంట్లు, రంగులు, జిగుర్లు, కొన్ని ఔషధాల తయారీల్లో వాడతారు. అయితే దీని నిర్వహణ కష్టమైంది. పోటీ పెరిగింది. ఆర్డర్లు లేవు. నష్టాలు పెరుగుతూ వచ్చాయి. ఇక సంస్థని మూసేయాలనుకుంటున్నప్పుడు కూతురు వ్యాపారాన్ని తన చేతిలోకి తీసుకుంది. సంస్థని లాభాల బాట పట్టించింది. ప్రపంచంలో ఏటీబీఎస్‌ ఉత్పత్తిలో సగం వాటా మన దేశం నుంచే వెళ్లేలా చేసింది. అమ్మాయిలు మాన్యుఫాక్చరింగ్‌లో రాణించలేరు అనే అభిప్రాయాన్ని చెరిపేసింది. ‘మధ్యతరగతి అమ్మాయిగా కెరియర్‌, డబ్బు రెండింటికీ విలువనిచ్చేదాన్ని. టీనేజీ నుంచే నాన్నతో బోర్డు మీటింగులకి వెళ్లేదాన్ని. లావాదేవీలన్నీ గమనించేదాన్ని. స్కూల్‌ రోజుల్లో నాన్న
నా కెమిస్ట్రీ పుస్తకం తీసి అందులో ప్రశ్నలు అడిగేవారు. అవే నాలో కెమిస్ట్రీపై ఆసక్తిని పెంచాయి. అందుకే పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి అప్లైడ్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశాను. వార్టన్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూళ్ల నుంచి.. వ్యాపార పాఠాలూ నేర్చుకున్నా’ అంటుంది వినతి. 2006లో సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా చేరేనాటికి ఆమె వయసు 22. అప్పుడు సంస్థ టర్నోవర్‌ రూ.20 కోట్లు మాత్రమే. ‘ఉద్యోగిగా చేరిన మొదటి రోజు నుంచీ ప్రతి విభాగంలోనూ పని చేశా. నష్టాలకు కారణం అయిన ఏటీబీఎస్‌ని వదిలించుకోవాలనుకోలేదు. దాన్లోని లోపాలని అర్థం చేసుకుని, దాన్నే విస్తరణకు పునాదిగా చేసుకోవాలనుకున్నా. విదేశీ నిపుణులని ఆహ్వానించి ఉత్పత్తుల్లో నాణ్యతని పెంచా. వృథా తగ్గించేసి.. యంత్రాల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకొనేదాన్ని. దాంతో ఆర్డర్లు మొదలయ్యాయి. ఎగుమతులూ మొదలుపెట్టా’ అనే వినతి తక్కువ సమయంలోనే సంస్థ ఆదాయాన్ని 8 వేల కోట్లకు చేర్చింది. ఆసియాలోని అతిపెద్ద రసాయన సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దింది.

సీనియర్లు ఉండట్లేదు...

‘కష్టపడి చదవడం, కెరియర్‌లో అడుగుపెట్టడం వరకూ బాగానే ఉంటుంది. కానీ పిల్లలు పుట్టి, కుటుంబ బాధ్యతలు పెరిగాక కెరియరా? కుటుంబమా? తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కువ మంది కుటుంబానికే ఓటేస్తారు. అందుకే సంస్థల్లో సీనియర్‌ హోదాల్లో మహిళల్ని చూడలేకపోతున్నాం. అలా మా సంస్థలో జరగకూడదనే.. ప్రసవం తర్వాత అనుకూలమైన పనివేళల్ని అందిస్తున్నా. నావరకూ పిల్లలు, కుటుంబం కెరియర్‌కి ఎప్పుడూ ఆటంకం కాలేదు. కుటుంబ సహకారం ఉంటే ఎవరైనా విజయాన్ని సాధించగలరు. షెరిల్‌ శాండ్‌బర్గ్‌ రాసిన లీన్‌ఇన్‌ పుస్తకం నాకెంతో ఇష్టం.’


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి