స్ఫూర్తినివ్వడం కోసం డ్రైవరు అయ్యింది..!

భారీ వాహనాలను నడపడం ఆషామాషీ కాదు, మహిళలకు మరీ కష్టం.. ఇలా అనే వారందరికీ సమాధానం ఇవ్వాలనుకుందీ 21 ఏళ్ల అమ్మాయి.

Published : 07 Oct 2022 00:15 IST

భారీ వాహనాలను నడపడం ఆషామాషీ కాదు, మహిళలకు మరీ కష్టం.. ఇలా అనే వారందరికీ సమాధానం ఇవ్వాలనుకుందీ 21 ఏళ్ల అమ్మాయి. న్యాయశాస్త్రం చదువుకుంటూనే బస్సు డ్రైవింగ్‌ నేర్చుకొంది.  అదేమీ ఆమె జీవనోపాధి కాదు... అయినా వారాంతాల్లో బస్సు డ్రైవరుగా పని చేస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేరుస్తున్న అన్నె మేరీ స్ఫూర్తి కథనమిది.

మేరీ వాళ్ల నాన్న అన్‌సాలెన్‌ కాంట్రాక్టరు. అమ్మ స్మితా జార్జి పాలక్కాడ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి. ఆమెలా తనూ జడ్జి అవ్వాలని అనుకునేది. మేరీ చిన్నప్పుడు రోజూ నాన్న ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఆయన నడిపే బుల్లెట్‌ శబ్దం గురించి ఆసక్తిగా ఎదురుచూసేది. ఆ బండిపై నాన్న వెనుక కూర్చొన్నప్పుడు తానే నడిపితే ఎలా ఉంటుందని కలలు కనేది. ఆ మాటే తండ్రితో చెప్పేది. మేరీ ఆసక్తిని గుర్తించిన ఆయన బుల్లెట్‌ నడపడానికి కావాల్సిన మెలకువలు చెబుతూ, డ్రైవింగ్‌ నేర్పేవాడు. అలా 15 ఏళ్లకే మేరీ బుల్లెట్‌ నడపడం నేర్చుకుంది. 18 ఏళ్లు వచ్చిన తర్వాత లైసెన్స్‌ తీసుకోవడమే కాదు, తండ్రి కానుకగా అందించిన బుల్లెట్‌పై కాలేజీకి వెళ్లొచ్చేది. ఆ తర్వాత కారు డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుంది.

మహిళలు కూడా..
బస్సులో ఎప్పుడైనా వెళ్లేటప్పుడు డ్రైవరు నడిపే విధానాన్ని చూస్తుండేది మేరీ. ఆ బస్సును తాను నడిపితే ఎలా ఉంటుండాని ఆలోచించేది. ఇంట్లో చెబితే, అమ్మ భయపడి వద్దంది. అయితే నాన్న  ప్రోత్సహించాడు. ప్రైవేటు బస్సు నడిపే బంధువు ఒకాయన వద్ద నెలలో బస్సు డ్రైవింగ్‌ నేర్చుకొని, తర్వాత లైసెన్స్‌నూ సంపాదించేసింది మేరీ. ‘చిన్నప్పటి నుంచి నాకు వాహనాలన్నింటినీ నడపాలని ఉండేది. దానికి నాన్న ప్రోత్సాహం తోడై నన్ను ముందుకు నడిపించింది. భారీవాహనాలు నడపడం ప్రమాదం, కష్టమంటూ అమ్మ భయపడేది. నాన్నకు మాత్రం నాపై నమ్మకం ఉండేది. అమ్మని స్ఫూర్తిగా తీసుకొని న్యాయవిద్యను ఎంచుకున్నా. ఎర్నాకుళం ప్రభుత్వ న్యాయకళాశాలలో చేరా. అక్కడ మూడోఏడాదిలో ఉన్నప్పుడు బస్సు డ్రైవింగ్‌ నేర్చుకున్నా. నా 21వ పుట్టినరోజున హెవీవెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ వచ్చింది. చదువుకుంటూనే వారాంతంలో ఉద్యోగం చేయాలనిపించింది. అలా ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘హే డే’ ప్రైవేటు బస్సుకు వారాంతంలో డ్రైవరుగా విధుల్లో చేరా. కాక్కనాడ్‌-పెరుంపదప్పు రూట్‌లో బస్సు నడుపుతున్నా. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చడమే నా లక్ష్యం. మొదటిరోజు బస్సు నడిపేటప్పుడు మాత్రం ఒత్తిడికి గురయ్యా. కారులో సీటును మన ఎత్తుకు తగినట్లు మార్చుకునే సౌకర్యం ఉంటుంది. బస్సులో వీలు కాదు. నేనైతే రెండు కుషన్లు వేసుకొని మరీ యాక్సిలేటర్‌ను వినియోగించగలుగుతున్నా. నన్ను డ్రైవరుగా చూసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కొందరైతే అదేంటి అమ్మాయి నడుపుతోంది అని కూడా అంటారు. అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ నివేదిక మేరకు భారీ వాహనాలు నడపడంలో మన దేశంలో మహిళల శాతం 17.5 శాతం మాత్రమేనట. ఈ సంఖ్య మరింత పెరగాలని ఆశిస్తున్నా. జడ్జి కావాలనేది నా లక్ష్యం. జేసీబీ, ట్రైన్‌ నడపడం కూడా నేర్చుకోవాలనేది నా కల’ అంటోంది మేరీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్