డిస్లెక్సియాని అధిగమించి... వేలమందికి వెలుగునిస్తోంది

నాన్న ఐఏఎస్‌ అధికారి... కూతురు అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌! ‘బద్ధకం.. మొద్దు’ అని ఇంటా, బయటా అంటుంటే.. డిస్లెక్సియాతో బాధపడుతున్న ఆ చిన్నారికి ఏం చెప్పాలో   తెలిసేదికాదు. ఆ సమస్య నుంచి బయటపడి ఐరాస సాయంతో తనలాంటి కొన్నివేలమందికి అండగా నిలుస్తోన్న 24 ఏళ్ల అక్షేయ అఖిలన్‌ వసుంధరతో మాట్లాడింది...

Updated : 14 Oct 2022 03:40 IST

నాన్న ఐఏఎస్‌ అధికారి... కూతురు అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌! ‘బద్ధకం.. మొద్దు’ అని ఇంటా, బయటా అంటుంటే.. డిస్లెక్సియాతో బాధపడుతున్న ఆ చిన్నారికి ఏం చెప్పాలో తెలిసేదికాదు. ఆ సమస్య నుంచి బయటపడి ఐరాస సాయంతో తనలాంటి కొన్నివేలమందికి అండగా నిలుస్తోన్న 24 ఏళ్ల అక్షేయ అఖిలన్‌ వసుంధరతో మాట్లాడింది...

నాన్న ఐఏఎస్‌ అధికారి కావడంతో చిన్నతనంలోనే దేశమంతా తిరిగా. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాక.. చెన్నైలో స్థిరపడ్డాం. చిన్నప్పుడు చదువంటే బాగా భయపడేదాన్ని. ఎంత చదివినా గుర్తుండేది కాదు. చక్కగా రాయనూలేను. ఒత్తిడి చేస్తే చిరాకు, కోపం. అన్ని పరీక్షల్లోనూ ఫెయిలే. బడిలో అమ్మానాన్నల్ని పిలిచి ‘మీ అమ్మాయి కోసం మరో స్కూల్‌ చూసుకోండి’ అనేవారు. బద్ధకస్తురాలినని ఇంట్లోనూ అనుకొనేవారు. ఎంత చెప్పినా నా సమస్యేంటో వాళ్లకి అర్థమయ్యేది కాదు. అప్పుడే ‘తారే జమీన్‌ పర్‌’ హిందీ సినిమా వచ్చింది. దాన్ని ఎన్నిసార్లు చూశానో. నా ఇబ్బంది ఇదీ అని అమ్మానాన్నలకు ఆ సినిమా చూపించా. వాళ్లు కంగారుపడి మానసిక వైద్యుల్ని సంప్రదించారు. నాకు ‘డిస్లెక్సియా’ ఉందని వాళ్లు తేల్చారు. ప్రత్యేక తరగతులు, కౌన్సెలింగ్‌ సాయంతో చదివించారు. పదోతరగతికి వచ్చేసరికి జ్ఞాపకశక్తి మెరుగయ్యింది. నాన్న అధికారులతో మాట్లాడి నాకోసం అదనపు సమయం, స్పెల్లింగ్‌ల విషయంలో వెసులుబాటు లాంటి అనుమతులు తీసుకున్నారు. పదిలో 70 శాతం, ప్లస్‌1, ప్లస్‌టూల్లోనూ 80 శాతం మార్కులు తెచ్చుకున్నా.

ఐరాస ఆహ్వానం..

క్రమంగా చదువుపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సైకాలజీ మీద ఇష్టం ఏర్పడింది. సైకాలజీ, మానవహక్కుల్లో నాలుగు డిగ్రీలు చేశా. ప్రస్తుతం భారత్‌ యూనివర్సిటీలో లా చేస్తున్నా. మానవహక్కుల్లో పీజీ చేస్తున్నప్పుడు.. నాలాంటి వారికి ఐక్యరాజ్యసమితిలో ఇంటర్న్‌షిప్‌ అవకాశముందని తెలిసింది. దరఖాస్తు చేసుకుంటే చాలా వడపోతల తర్వాత మానవహక్కులు, డబ్ల్యూహెచ్‌వో విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌కి అనుమతించారు. 2019లో.. 8 నెలలు జెనీవాలోనే ఉన్నా. భారత్‌లోని బాలికలు, ఆడవాళ్ల మానసిక పరిస్థితి, మానవహక్కులపై అధ్యయనం చేసి ఐరాసకు నివేదిక ఇచ్చా. మన దేశంలో మానవహక్కుల చట్టాలు బానే ఉన్నా, అమల్లోనే ఇబ్బంది ఉందని నా అధ్యయనంలో తెలిసింది. నాన్న కోరిక మేరకు సివిల్స్‌ రాద్దామని ఉండేది. దానికి మించిన సేవ అవసరముందని హక్కుల పోరాటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నా. 

సివిల్స్‌ని మించిన లక్ష్యంతో..

మహిళలు, యువతలో మానసిక ఆరోగ్యంపై అవగాహన తేవాలనే లక్ష్యంతో.. 2020లో ‘హైబిస్కస్‌ ఫౌండేషన్‌’ పేరుతో సోషల్‌ మీడియా పేజీ మొదలుపెట్టా. అనూహ్య స్పందన వచ్చింది. ‘చదవలేకపోతున్నా, కౌన్సెలింగ్‌కి డబ్బుల్లేవు, నా మానసిక స్థితి సరిగా లేదు’, ‘గైడెన్స్‌ ఇచ్చేవాళ్లు కావాలి’... ఇలా ఎంతో మంది సంప్రదించారు. ఒక్కదాన్నే మొదలుపెట్టినా, తర్వాత నాతో చేయి కలపడానికి 500 మంది వరకూ ముందు కొచ్చారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశమూ వచ్చింది. వీటికి డబ్బులు కావాలి కదా... అందుకే ‘జాబ్స్‌లింక్‌, క్వశ్చన్‌క్లౌడ్‌’ శిక్షణ సంస్థలు స్థాపించాను. వాటిపై ఆదాయంతో.. ఫౌండేషన్‌ కోసం పెద్ద సంఖ్యలో కౌన్సెలర్లను నియమించుకోగలిగా. మానవ హక్కుల న్యాయవాదుల బృందంతో.. మహిళల మీద దాష్టీకాలపై పోరాడుతున్నాం. పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు నేర్పిస్తున్నాం. ఐరాసతో కలిసి లింగసమానత్వంపైన అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఏడాదిన్నరలో.. తమిళనాడు, ఏపీ, తెలంగాణాల నుంచి 40వేల మందికి పైగా మహిళలకు ప్రయోజనం చేకూర్చగలిగామన్నది తృప్తినిచ్చే అంశం.

పరిష్కారం కోసం ఆరాటం...

ఈ ఏడాది ‘తమిళనాడు యూత్‌ ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌’ సమావేశం నిర్వహించాం. 300 మంది యువత పాల్గొని పరిష్కారాల్ని సూచించారు. వాటితో ఐరాసకి నివేదిక  అందించా. నా తపనని గుర్తించి యూకేకి చెందిన దెయిర్‌వరల్డ్‌ సంస్థ విద్యపై అవగాహన కల్పించేందుకు ‘గ్లోబల్‌ యూత్‌ అంబాసిడర్‌’గా నియమించింది. థెరపిస్టుగా విధులు నిర్వహిస్తున్నా, మానవ హక్కుల కోర్టులో కేసులూ వాదిస్తున్నా.  ఆపదలో ఉన్న మహిళల కోసం ఎంత చేసినా తక్కువే.

- హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్