Updated : 18/10/2022 09:19 IST

ఆమె పవర్‌.. ఓ ప్రపంచ రికార్డు!

నిమిషంలో 42 సార్లు స్క్వాట్‌ లిఫ్ట్‌ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిందీ 26 ఏళ్ల పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బ్రిటన్‌ తరఫున పాల్గొన్న తొలి సిక్కు మహిళ కరెన్‌జీత్‌.. స్త్రీ శక్తిని చాటిచెప్పడమే తన లక్ష్యం అంటోంది.

ట్టుదలతో కృషి చేస్తే అనుకున్నది సాధించొచ్చని చేసి చూపిస్తోంది కరెన్‌జీత్‌. మహిళలు తక్కువగా ఉండే రంగంలో అడుగుపెట్టడమే కాకుండా భుజాల మీద బరువుతోనే 60 సెకన్లలో 42 గుంజీలు తీసి రికార్డు నెలకొల్పిందీమె. పాఠశాల స్థాయిలో మేటి రన్నర్‌గా పేరున్న కరెన్‌జీత్‌ తన 17వ ఏట పవర్‌లిఫ్టింగ్‌ మొదలుపెట్టింది. ‘అమ్మ మల్లయోధురాలు. నాన్న పవర్‌ లిఫ్టర్‌, బాడీ బిల్డర్‌. వీరిద్దరినీ చూస్తూ పెరిగిన నేను, చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకున్నా. వారి ప్రోత్సాహమూ ఎంతగానో ఉండేది. నాన్నే నాకు మార్గదర్శి. మొదట స్ట్రెంత్‌ స్పోర్ట్స్‌ను కెరియర్‌గా ఎంచుకున్న నేను, ఆ తర్వాత పవర్‌లిఫ్టింగ్‌లోకి అడుగుపెట్టా. అంతకుముందు చిన్న బరువు కూడా ఎత్తలేదు. ఇందులో ప్రాథమిక అంశాలన్నీ నాన్నే నేర్పేవారు. నాకోసం సొంతంగా మా ఇంటి దగ్గరే జిమ్‌ ఏర్పాటు చేశారు. తనే కఠోర శిక్షణ ఇచ్చి కొన్ని నెలల్లోనే పోటీలకు వెళ్లేలా తయారుచేశారు. స్థానిక పోటీల్లో వరసగా గెలుస్తూ కామన్‌వెల్త్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌కి ఎంపికయ్యా. అక్కడా విజేతగా నిలవడంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బ్రిటన్‌ తరఫున పాల్గొనే అవకాశాన్ని అందుకున్నా. ఈ పోటీలకు వెళ్లిన తొలి సిక్కు మహిళగా గుర్తింపు సాధించా. మహిళలకు స్ఫూర్తిగా నిలవాలనేది నా ఆశయం. అందుకే ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషిచేశా. ఆ ప్రయత్నంలో విజయవంతమై గిన్నిస్‌లోనూ స్థానాన్ని సంపాదించగలిగా. అనుకున్నది చేరుకోవడానికి కష్టపడటం, ధైర్యంగా సిద్ధం కావడంతోపాటు సాధించాలనే తపన ఉండాలి. సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే విజయం మీ సొంతమవుతుంది’ అని చెప్పే కరెన్‌జీత్‌.. మహిళా శక్తికి నిదర్శనం, అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి