అమ్మాయైనా ఆదమరవొద్దు!

స్నేహం పేరుతో అన్నీ పంచుకుంటాం. సాన్నిహిత్యం కొద్దీ దాపరికాల్లేకుండా ఉంటాం. కానీ స్నేహితురాళ్ల ముసుగులో.. పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్న సందర్భాలున్నాయి. సరదా కోసం తీసుకునే చిన్నఫొటో, వీడియో, నమ్మకంతో ఉండే ఆదమరపు చేటు చేయొచ్చు.

Updated : 19 Oct 2022 07:04 IST

స్నేహం పేరుతో అన్నీ పంచుకుంటాం. సాన్నిహిత్యం కొద్దీ దాపరికాల్లేకుండా ఉంటాం. కానీ స్నేహితురాళ్ల ముసుగులో.. పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్న సందర్భాలున్నాయి. సరదా కోసం తీసుకునే చిన్నఫొటో, వీడియో, నమ్మకంతో ఉండే ఆదమరపు చేటు చేయొచ్చు. ఆత్మహత్యకూ ప్రేరేపించొచ్చు! జాగ్రత్తగా ఉండాలంటున్నారు హైదరాబాద్‌ షీటీమ్స్‌ డీసీపీ శిరీష రాఘవేంద్ర. సమస్యని ఎదుర్కొనే విధానాన్నీ సూచిస్తున్నారు..

* వేరే రాష్ట్రం అమ్మాయి. ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చింది. ఒకరోజు ఉదయాన్నే స్నేహితుల నుంచి ఫోన్‌. ఎవరితోనో తను నగ్నంగా ఉన్న ఫొటోలు చూశామని సారాంశం. చూస్తే తను తన ప్రియుడితో కలిసి దిగినవవి! ఎవరో మార్ఫింగ్‌ చేశారు. చేసిందెవరో కాదు.. తనతోపాటు గదిలో ఉండే అమ్మాయే. ఖర్చుల విషయంలో తేడా వచ్చిందన్న కోపంతో తన ఫొటోలను ఎవరికో పంపితే వాళ్లిలా చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

* తెలియని నంబరు నుంచి వీడియో మెసేజ్‌! తనదే.. దుస్తులు మార్చుకుంటున్నది. ఒక్కసారిగా భయం, పరువుపోతుందన్న కంగారు. కాస్త స్థిమితపడ్డాక మళ్లీ చూస్తే అది తన హాస్టల్‌ గది. చేసింది స్నేహితురాలే. ఆమెకంటే బాగా చదువుతుందీ, అందంగా ఉంటుందన్న అసూయ. తన ఫోన్‌ నుంచే వేరేవాళ్లకి పంపి, ఆనవాళ్లు దొరక్కుండా డిలీట్‌ చేసింది.

ఒకప్పుడు అబ్బాయిల నుంచే అమ్మాయిలకి సమస్యలుండేవి. ఇప్పుడు స్నేహితురాళ్లు అనుకున్నవాళ్లే చేస్తున్నారు. కాబట్టి.. ఫర్లేదు మనవాళ్లే అని నమ్మి ఫొటోలు, వీడియోలు పంపినా, వాళ్లు మీకు తెలియకుండా తీసినా.. నష్టం మీకే. ఫొటో బయటికొచ్చిందంటే ఎన్ని గ్రూపుల్లో షేర్‌ అవుతుందో, ఎంతమంది చేతుల్లోకి వెళుతుందో చెప్పలేం. అసలు అక్కడివరకూ రాకుండా చూసుకోవడం ప్రధానం.

ముందు నుంచే జాగ్రత్త!
హాస్టల్‌ అంటే.. ఎక్కడెక్కడివారో చేరతారు.. స్నేహితులవుతారు. వాళ్ల నేపథ్యమేంటో తెలియదు కదా! కాబట్టి, లోతైన వ్యక్తిగత సమాచారమేదీ పంచుకోవద్దు. ఎంత గాఢస్నేహమైనా కొన్ని పరిధులు పాటించాలి. వ్యక్తిగత ఫొటోలు, సమాచారం, ఫోన్‌ పాస్‌వర్డ్‌లు లాంటివి పంచుకోవద్దు. అందరమూ అమ్మాయిలమే అన్న ధీమాతో ఆదమరపుగానూ ఉండొద్దు. స్నానం, దుస్తులు మార్చుకునేప్పుడు రోజూ కష్టమైనా గమనించుకోండి. సరదాగా తీస్తున్నామన్నా ఊరుకోవద్దు. అలాగని ఎవరితోనూ మాట్లాడొద్దు, సన్నిహితంగా ఉండొద్దని కాదు. ఎంత స్నేహమైనా హద్దులుండాలి. ఏవి చెప్పాలి, ఏవి వ్యక్తిగతం అన్నదానిపై స్పష్టత ఉండాలి. దాన్ని పాటించినంతవరకూ సమస్యలు రావు. జాగ్రత్తగా దాచినా డబ్బులు పోయాయంటే బాధపడొచ్చు. ఎక్కడపడితే అక్కడ పడేసి పోయాయని ఏడిస్తే మిమ్మల్నే పిచ్చివాళ్లలా చూస్తారు. కదా! ఇదీ అంతే. మీరూ సెక్సీ ఫొటోల పేరుతో సెల్ఫీలు ప్రయత్నించొద్దు. ఫోన్‌ పోయినా, ఎవరి చేతికైనా చిక్కినా ప్రమాదమే.

అమ్మాయైనా.. శిక్ష తప్పదు
ఏ తప్పూ చేయకపోయినా ఇలాంటిది జరిగింది.. ఇంట్లో వాళ్లు ఏమంటారోనన్న భయంతో కంగారుపడతారు. పరువు పోతుందని ఆత్మహత్యవైపు వెళతారు. తొందరపడొద్దు.. మమ్మల్ని సంప్రదించండి. షీటీమ్స్‌.. మీ వివరాలు బయట పడకుండానే పరిష్కరిస్తుంది. ఆత్మహత్య తప్ప మరేదారీ లేదనుకుని ఆఖరి ప్రయత్నంగా మమ్మల్ని సంప్రదించిన వారున్నారు. అరగంటలో సమస్య తీర్చిన సందర్భాలెన్నో. 100కు ఫోన్‌ చేయండి. లేదూ పూర్తి వివరాలతో మెయిల్‌ చేసినా ఫర్లేదు. అసూయ, కోపం, ప్రియుడి కోరిక మేరకు అమ్మాయిలిలా చేస్తున్నారు. దోషి అని తేలితే ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి రిమాండుకి తరలిస్తాం. అమ్మాయైనా వదిలేది లేదు. పశ్చాత్తాపపడినా ప్రయోజనముండదు. నేరతీవ్రత బట్టి కఠిన శిక్షలుంటాయి. భవిష్యత్తులో ఉపాధీ దొరకదు. తస్మాత్‌ జాగ్రత్త!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్