Published : 20/10/2022 00:20 IST

26 ఏళ్లకే మంత్రి!

నాయకత్వ లక్షణాలు ఉంటే హోదాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయనడానికి రొమినా పోర్మోఖ్తరి చక్కటి ఉదాహరణ. స్వీడన్‌లో అతి పిన్న వయసులోనే (26 ఏళ్లు) మంత్రి పదవిని చేపట్టి రికార్డు సృష్టించింది మరి!

పుట్టింది స్వీడన్‌లోని స్టాక్‌హామ్‌.. వీళ్ల కుటుంబానిది ఇరాన్‌ నేపథ్యం. ఉప్సల విశ్వ విద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో డిగ్రీ చేసింది. స్కూలు నుంచే నాయకత్వ లక్షణాలు ఎక్కువ. వెయిట్రెస్‌, పార్ట్‌టైమ్‌ ట్యూటర్‌ వంటి ఎన్నో ఉద్యోగాలు చేసి, ప్రభుత్వ కొలువు అందుకుంది. 2016లో... ఇరవయ్యేళ్ల వయసులోనే రాజకీయ ప్రవేశం చేసింది. లిబరల్‌ పీపుల్స్‌ పార్టీలో చేరి, మూడేళ్లలోనే యువ విభాగానికి అధ్యక్షురాలైంది. పార్టీకి రాజకీయ సలహాదారుగానూ సేవలందించింది. స్వీడన్‌ జనాభాలో 20 శాతం మంది సిరియా, ఇరాక్‌, అఫ్గనిస్థాన్‌, సోమాలియా వంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే. వారి హక్కులతోపాటు పర్యావరణ సంరక్షణ కోసమూ పోరాడేది. వాతావరణ మార్పులను అరికట్టేందుకు మాంసంపై పన్ను విధించాలని ప్రతిపాదించింది. స్వీడన్‌ యువతలో రొమినాకు అభిమానులు ఎక్కువ. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడం, అవసరమైతే ఎంతటి వారికైనా ఎదురెళ్లడం ఈమె నైజం. ఈ తీరే మంత్రి పదవినీ కట్ట బెట్టింది. తాజాగా స్వీడన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నూతన ప్రధానిగా ఉల్ఫ్‌ క్రిస్టర్‌సన్‌ ఎన్నికయ్యారు. గతంలో ఈయన స్వీడన్‌ డెమొక్రాట్స్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. ఈ పార్టీ వలస విధానానికి వ్యతిరేకం. దీంతో రొమినా ఆయనపై బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. ఆయన తన విధానాల్ని మార్చుకున్నాకే మద్దతిచ్చింది. క్రిస్టర్‌సన్‌ ప్రధాని అయ్యాక ఆయన అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రొమినా పర్యావరణ శాఖ మంత్రిగా ఎన్నికైంది. హిజాబ్‌ వివాదంలో ఇరాన్‌ మహిళలకు తన మద్దతు ప్రకటించి, అక్కడి ప్రభుత్వ తీరునీ ఎండ గడుతోంది. పుస్తకాలను చదవడానికి ఇష్టపడే రొమినా మంచి రచయిత్రి కూడా. మనదేశంలో ఇలా చిన్న వయసు అమ్మాయిని మంత్రిగా ఎప్పటికి చూడగలమో!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి