శోధనల సాగుతో.. రైతన్నకు ఘన సాయం!

శాస్త్రవేత్తలంటే తలపండిన మగవాళ్లే ఎందుకు గుర్తుకురావాలి? సహనానికీ, పట్టుదలకీ మారుపేరైన ఆడవాళ్లు ఎందుకు కాదు... ఈ ప్రశ్నకి సరైన జవాబుని అందించారీ మహిళా శాస్త్రవేత్తలు.

Updated : 21 Oct 2022 02:23 IST

వీర జయలక్ష్మి

శాస్త్రవేత్తలంటే తలపండిన మగవాళ్లే ఎందుకు గుర్తుకురావాలి? సహనానికీ, పట్టుదలకీ మారుపేరైన ఆడవాళ్లు ఎందుకు కాదు... ఈ ప్రశ్నకి సరైన జవాబుని అందించారీ మహిళా శాస్త్రవేత్తలు. ఏళ్ల తరబడి పరిశోధనల్లో నిమగ్నమై.. వాళ్లు రూపొందించిన వంగడాలు రైతుల కష్టం తీరుస్తూనే, మహిళలు వ్యవసాయ పరిశోధనల్లోనూ దీటుగా రాణించగలరని  రుజువు చేస్తున్నాయి.

సూపర్‌ ఫుడ్‌గా చెప్పుకొనే శనగని దక్షిణ భారతానికీ చేరువ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు డాక్టర్‌ వీర జయలక్ష్మి. నంద్యాల ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆవిడ శనగలో ఏడు రకాల వంగడాలని అభివృద్ధి చేశారు... మా సొంతూరు అనంతపురం. నాన్న లక్ష్మీరెడ్డి విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఆయన జాతీయస్థాయి అథ్లెట్‌. అమ్మ అనసూయమ్మ. వ్యవసాయంపై అభిమానంతో అందులోనే డిగ్రీ చేశా. అగ్రికల్చర్‌ బీఎస్సీ, ఎమ్మెస్సీల్లో విశ్వవిద్యాలయం టాపర్‌గా నిలిచా. దాంతో చాలామంది సివిల్స్‌ రాయి పక్కా ఐఏఎస్‌ అవుతావని సలహా ఇచ్చినా.. నాకు మాత్రం శాస్త్రవేత్త కావాలనే ఉండేది. ఈ రంగంలోకి వచ్చాక పోషకాలు పుష్కలంగా ఉన్న శనగ పంట నన్ను ఆకర్షించింది. తెగుళ్లను తట్టుకుని, దిగుబడులిచ్చేలా ఇప్పటి వరకు ఏడు రకాల వంగడాలను రూపొందించా. అవి రైతులని చేరి మంచి దిగుబడినిస్తున్నాయి. అంతకంటే సంతృప్తి ఏముంటుంది? తాజాగా నంద్యాలగ్రామ్‌-776 అనే వంగడాన్నీ అభివృద్ధి చేశా. మొదట్లో పొద్దు తిరుగుడు, తర్వాత పొగాకుపై పని చేసినా ఎక్కువ కాలం శనగ కోసమే పరిశోధించా. ఇక్రిశాట్‌, ఐఐపీఆర్‌ (కాన్పూర్‌) నుంచి జన్యుసంపద (జర్మ్‌ ప్లాజం) సేకరించి సంకరీకరణం చేసి అందులోంచి రెండు, మూడు మేలైన గుణాలు వచ్చేలా కొత్త వంగడాలు తయారు చేస్తున్నా. ఒక్కో వంగడం తయారీకి నగటున పదేళ్లుపైనే పట్టింది. ఈ క్రమంలో ఇక్రిశాట్‌ ఎంతో సాయం చేసింది. పప్పు ధాన్యాల్లో ఉత్తమ పరిశోధనలకు అందించే అనేక పురస్కారాలతో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఇచ్చే యూజీసీ రీసెర్చ్‌ అవార్డునూ అందుకున్నా. ఫ్రాన్స్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ దేశాలకు వెళ్లి నూతన జన్యు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ తీసుకున్నా. మావారు సూర్యప్రకాశ్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేశారు. గత ఏడేళ్లుగా ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు.

- యడ్లపాటి బసవ సురేంద్ర, కర్నూలు


మోదీ మెచ్చిన ఇంద్రావతి..

ఎన్‌.అనురాధ

విజయనగరంలోని వ్యవసాయ పరిశోధన స్థానంలో సీనియర్‌ శాస్త్రవేత్త ఎన్‌.అనురాధ. చిరుధాన్యాలు ముఖ్యంగా రాగిలో మేలైన రకాలని కనిపెట్టడంలో ఆమె విజయం సాధించారు. నాలుగేళ్ల క్రితం ఆమె అభివృద్ధి చేసిన వేగావతి, సువర్ణముఖి రకాలు జాతీయ స్థాయిలో గుర్తింపుని సాధిస్తే.. 2020లో రూపొందించిన ఇంద్రావతి రకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. అత్యంత పోషక విలువలు కలిగిన రకం ఇది. ‘మా పరిశోధనలు రైతులకు చేరువైనప్పుడే కదా ఆనందం. ఈ ఏడాది నేను రూపొందించిన గోస్తనీ రకం మూల విత్తనాలని ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గడ్‌, పశ్చిమ్‌ బంగా రాష్ట్రాల్లోని రైతులకు అందించినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.  అలాగే గిరిజన ప్రాంతాల్లో విత్తన గ్రామాలను ఏర్పాటు చేశాం’ అంటున్న అనూరాధ రాగులతోపాటు సామలు, కొర్రలు, అండు కొర్రలు వంటివాటిపైనా పరిశోధనలు చేస్తున్నారు. చిరుధాన్యాల్లోని సుగుణాలు అందరికీ చేరువ కావాలన్న ఉద్దేశంతో ఐదుగురు పీహెచ్‌డీ విద్యార్థులకూ మార్గదర్శకం చేస్తున్నారు. వ్యవసాయ పరిశోధనల్లో ఆమె కృషికిగానూ ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ పురస్కారాన్నీ, గతేడాది అత్యుత్తమ పరిశోధన శాస్త్రవేత్తగానూ పురస్కారాలు అందుకున్నారు. 150కి పైగా పరిశోధన పత్రాలని వెలువరించారు.

- కె. మునీందర్‌, విజయనగరం


ఎరువులతో.. కష్టం తీర్చి

సంధ్యారాణి

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రేమించే యాసరపు సంధ్యారాణి భూసార పరిశోధన శాస్త్రవేత్తగా రాణిస్తూనే ఆ విధానంపై ఎన్నో పుస్తకాలనీ రాశారు. విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఫామ్‌ మేనేజర్‌ ఆమె.. రాగిలో ఎరువుల యాజమాన్య పద్ధతులపై పరిశోధనలు చేశారు. గిరిజన ఉప ప్రణాళిక పథకంలో భాగంగా వారికి చిరుధాన్యాలతో పాటు నువ్వులు, మొక్కజొన్న, వేరుశనగ, జొన్న విత్తనాలు ఉచితంగా సరఫరా చేసి సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. వీటికి సంబంధించి ప్రాసెసింగ్‌ యూనిట్లనీ ఏర్పాటు చేయించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషించినందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌  జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ ఏడాది ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం నుంచి అత్యుత్తమ పరిశోధన శాస్త్రవేత్తగానూ పురస్కారం అందుకున్నారు. ఇంద్రావతి, సువర్ణముఖి, గోస్తనీ వంగడాలు తయారు చేయడంలోనూ ముఖ్య భూమిక పోషించారు. వందకుపైగా పరిశోధన పత్రాలు వెలువరించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్