Published : 22/10/2022 01:03 IST

ఆమె గళానికి ఐరాస గుర్తింపు!

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌(యూఎన్‌హెచ్‌ఆరీసీ)కు ప్రత్యేక దూతగా ఇటీవల ఎంపికైంది   కేపీ అశ్విని. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలే కాదు, ఆసియా నుంచి ఎంపికైన మొదటి దళిత మహిళ కూడా.

ర్ణాటకకు చెందిన దళిత కుటుంబంలో పుట్టింది అశ్విని. తండ్రి ప్రసన్నకుమార్‌, తల్లి జయమ్మ. ‘అమ్మానాన్నా విద్యావంతులు. కులాన్ని సమస్యగా వాళ్లెప్పుడూ భావించలేదు. రాజకీయ, సామాజిక కోణాల్లో నన్ను నేను అర్థం చేసుకునేలా  మార్గనిర్దేశం చేశారు. వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది దళితులు కులం పేరు చెప్పరు. నేనలా కాదు. ఈ క్రమంలో సమస్యల్నీ ఎదుర్కొన్నా. ఆ అనుభవాలే కుల వివక్షపై పోరాడేలా ప్రేరేపించాయి’ అంటుంది అశ్విని.  కులమతాలకు అతీతంగా వ్యవహరించాలన్న  అంబేడ్కర్‌ సిద్ధాంతాల్ని నమ్ముతూ పెరిగింది. ‘దిల్లీ జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు దళిత విద్యార్థి విభాగ నాయకత్వంలో భాగమయ్యా. పీహెచ్‌డీ కోసం భారత్‌-నేపాల్‌లలో దళితుల హక్కులపైన పరిశోధించా. అప్పుడు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న దళిత నాయకుల్ని, విద్యావేత్తల్ని కలిశా. వీరిద్వారా దళిత హక్కులు, కుల వివక్ష   విషయాలు లోతుగా తెలుసుకున్నా’ అనే అశ్విని ప్రస్తుతం బెంగళూరులోని సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. మరోవైపు ‘అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌’ భాగస్వామ్యంతో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లోని ఆదివాసీ తెగల భూముల హక్కుల కోసం పోరాడుతోంది. ఈమె కృషిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి.. యూఎన్‌హెచ్‌ఆర్‌సీకు ప్రత్యేక దూతగా ఆమెను నియమించింది. నవంబరులో బాధ్యతలు చేపట్టనున్న అశ్విని.. ఆ పదవిలో మూడేళ్లు కొనసాగుతుంది. దీన్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జాత్యాహంకారం, జాతి వివక్ష, వలసదారులు, మైనార్టీల పట్ల విద్వేషం.. మొదలైన అంశాల్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఈ కౌన్సిల్‌కు నివేదికను పంపాలి. ‘దళిత మహిళలకు నైపుణ్యాలున్నా లింగ వివక్ష కారణంగా ఉన్నత స్థానాల్ని చేరుకోలేకపోయారు. నాకు అప్పగించిన బాధ్యతలతో ఇకపై వారికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. అమెరికాలో భారతీయులపై జాత్యాహంకార కేసులు, పశ్చిమాసియాలో వలసదారులు ఎదుర్కొనే వివక్షలపైన ప్రత్యేకంగా దృష్టి పెడతా’ అంటున్న 36 ఏళ్ల అశ్విని.. ‘జరియా’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి భారత్‌లో దళిత, ముస్లిం మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి