Akshata murthy: బ్రిటన్‌ రాణి కంటే.. అక్షతకే ఎక్కువ!

తండ్రి ఓ పెద్ద ఐటీ సంస్థ అధినేత.. భర్త రాజకీయాల్లో రాణిస్తున్నారు.. వీటినే అర్హతలుగా మార్చుకోవాలనుకోలేదు అక్షత.. సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడ్డారు. ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టినా, నూతన వ్యాపారాలకు పెట్టుబడిదారుగా అడుగులేసినా అన్నింట్లోనూ తనదైన ముద్రవేశారు. లేనిపోని వివాదాలు ముసురుకున్నా తొణకలేదు. అమ్మానాన్నల నుంచి అందుకున్న విలువలూ, భర్త రిషి సునాక్‌ సహచర్యమే తనలో ఈ ఆత్మవిశ్వాసానికి కారణమంటున్నారు అక్షతమూర్తి..  

Updated : 26 Oct 2022 08:03 IST

తండ్రి ఓ పెద్ద ఐటీ సంస్థ అధినేత.. భర్త రాజకీయాల్లో రాణిస్తున్నారు.. వీటినే అర్హతలుగా మార్చుకోవాలనుకోలేదు అక్షత.. సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడ్డారు. ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టినా, నూతన వ్యాపారాలకు పెట్టుబడిదారుగా అడుగులేసినా అన్నింట్లోనూ తనదైన ముద్రవేశారు. లేనిపోని వివాదాలు ముసురుకున్నా తొణకలేదు. అమ్మానాన్నల నుంచి అందుకున్న విలువలూ, భర్త రిషి సునాక్‌ సహచర్యమే తనలో ఈ ఆత్మవిశ్వాసానికి కారణమంటున్నారు అక్షతమూర్తి..  

బ్రిటన్‌ ప్రథమ మహిళగా మారనున్న అక్షత... ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల గారాల పట్టి. ఆమె ఉత్తర కర్ణాటకలోని హుబ్బళ్లిలో అమ్మమ్మ ఇంట్లో పుట్టి పెరిగింది. అందుకే అక్కడి స్థానికులు... అక్షతను ‘నమ్మ హుడుగి’ అంటే ‘మా అమ్మాయి’ అని గర్వంగా చెప్పుకొంటున్నారు. చిన్నప్పుడు తమ దగ్గర పెరిగిన అమ్మాయి లండన్‌లోని 10 డౌనింగ్‌ స్ట్రీట్‌కి మహారాణి కాగలదని ఎవరూ ఊహించలేదు మరి. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులు...తమ పిల్లలను విలాసవంతమైన వాతావరణంలో పెంచాలనుకోలేదు. విలువలతో కూడిన జీవితం అందితే చాలనుకున్నారు. అందుకు తగ్గట్లే అక్షత కూడా అమ్మానాన్నల ఆలోచనలనూ, అభిప్రాయాలనూ అందిపుచ్చుకుని అడుగులేసింది. చిన్నతనంలో ఏనాడూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేకపోయినా, పాకెట్‌ మనీ ఎరుగకపోయినా కూడా ఎప్పుడూ పేచీలు పెట్టిన సందర్భాలు లేవు. మధ్యతరగతి జీవితంలోని ఎత్తుపల్లాలను దగ్గర్నుండి చూసిన అక్షత సింపుల్‌గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతుంది. అయితే ఫ్యాషన్‌ మీద ఇష్టం, రిషి సునాక్‌తో పెళ్లి వంటివి మాత్రం ఆమె జీవితంలో కొన్ని మార్పులను తెచ్చిపెట్టాయి.

హంగూ, ఆర్భాటాలు లేకుండా...

బెంగళూరులోని బాల్డ్‌వినన్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ల్లో చదివిన అక్షత ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లింది. మొదట క్లేర్‌మాంట్‌ మెక్‌కెన్నా కాలేజీలో బ్యాచిలర్స్‌ చేసింది. అదయ్యాక లాస్‌ఏంజిల్స్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసింది. కొన్నాళ్లు డెలాయిట్‌, యూనిలీవర్‌ కంపెనీల్లో పనిచేసింది. తిరిగి ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి అవసరమైన మార్కెటింగ్‌ మెలకువలూ, వివిధ ఆర్థిక అంశాలపై పట్టు తెచ్చుకోవాలనుకుంది. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏలో చేరింది. అక్కడే రిషితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రిషిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వాళ్ల అంగీకారం కోరింది. ఇందుకు మొదట నారాయణ మూర్తి ససేమిరా అన్నారట. కానీ, ఒక్కసారి కలిసి మాట్లాడమని అక్షత అభ్యర్థించడంతో రిషిని కలిశారాయన. ఆ తర్వాత నమ్మకం కలగడంతో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. అలా 2009లో బెంగళూరులో వీరి వివాహం జరిగింది. ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ కూతురు పెళ్లంటే మాటలా అనుకుంటారేమో కానీ... ఏ హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా నిరాడంబరంగా జరిగిందీ పెళ్లి. ఈ ఆలోచన నారాయణ మూర్తీ, సుధలదే కాదు... అక్షత నిర్ణయం కూడా. పెళ్లి తర్వాత లండన్‌లో స్థిరపడ్డ అక్షత దంపతులకు కృష్ణ, అనౌష్క అనే ఇద్దరమ్మాయిలు పుట్టారు.

రాణీ కంటే ఎక్కువ..

స్టాన్‌ఫోర్డ్‌లో చదువయ్యాక 2006లో ‘అక్షతా డిజైన్స్‌’ పేరుతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. భారతీయ డిజైన్లను స్థానిక కళాకారుల సాయంతో తయారు చేయించి వాటికి బ్రాండ్‌ వాల్యూ కల్పించేది. వివిధ కారణాలవల్ల దాన్ని మూసేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇన్ఫోసిస్‌ వ్యవహారాలతోపాటు తమ్ముడు రోహన్‌ మూర్తి స్థాపించిన డిగ్‌మీ ఫిట్‌నెస్‌ సంస్థకు డైరెక్టర్‌గానూ బాధ్యతలు తీసుకుంది. ఇక, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంలో ముందు చూపుతో వ్యవహరిస్తుంది అక్షత. యూకేకి చెందిన జామీ ఆలివర్‌, పిజెరియా, న్యూ అండ్‌ లింగ్‌ వుడ్‌ వంటి సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇన్ఫోసిస్‌లో వాటాలు, ఇతర సంపద అంతా కలిపి బ్రిటన్‌రాణి క్వీన్‌ ఎలిజిబెత్‌-2 ఆస్తుల విలువ కన్నా అక్షత ఆదాయం ఎక్కువ కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్