ముగ్గురూ ముగ్గురే

‘ముగ్గురాడపిల్లలు. తల్లిలేదు. వీళ్లని ఎలా సాకుతావో ఏమో’ అని ఊరివాళ్ల సానుభూతి.. ‘ఆ ముగ్గురినీ పోలీసులుగా చూడాలనుకుంటున్నా. ఇది నా భార్యకల కూడా’ అని ఆ తండ్రి సమాధానం.. ఆ తండ్రే.. తల్లిగా మారాడు.

Published : 27 Oct 2022 00:19 IST

‘ముగ్గురాడపిల్లలు. తల్లిలేదు. వీళ్లని ఎలా సాకుతావో ఏమో’ అని ఊరివాళ్ల సానుభూతి.. ‘ఆ ముగ్గురినీ పోలీసులుగా చూడాలనుకుంటున్నా. ఇది నా భార్యకల కూడా’ అని ఆ తండ్రి సమాధానం.. ఆ తండ్రే.. తల్లిగా మారాడు. ఆయన కృషికి పిల్లల పట్టుదల తోడైంది. చివరికి వాళ్లేం సాధించారో చూడండి..

తమిళనాడులోని అరక్కోణం దగ్గర్లో ఉన్న కుగ్రామం వెంకటేశన్‌ వాళ్లది. పేద రైతు అతను. పిల్లల చిన్నప్పుడే భార్య అనారోగ్యంతో చనిపోయింది. ముగ్గురాడపిల్లలనెలా పెంచుతావని ఊరివాళ్లంతా వెంకటేశన్‌ని చూసి జాలిపడే వారు. అతను మాత్రం ముగ్గురినీ బాగా చదివించి, పోలీసులను చేయాలని భార్యతో కలిసి తాను కన్న కలను నెరవేర్చాలనుకున్నాడు. అందుకోసం అహోరాత్రులూ శ్రమించాడు.

నాన్న కోసం..
‘మా నాన్న వ్యవసాయం చేస్తూనే.. ఇంటర్‌ వరకూ చదివాడు. గ్రేడ్‌ 2 పోలీసు కానిస్టేబుల్‌ పరీక్షలు రాశాడు. కానీ ఆయన కల నెరవేరలేదు. అమ్మలేకపోయినా ఆ లోటును మాకు ఏనాడూ తెలియనివ్వ లేదు. ఇంటా బయటా ప్రతి పనీ తానే చేసే వాడు. ఓవైపు సేద్యం, మరో వైపు మాకు వండి పెట్టడం వరకూ.. అన్నీ తానే. మమ్మల్ని చదువు మీదే దృష్టి ఉంచమని చెప్పేవాడు. ఆయన కష్టం చూసి తన కలను నెరవేర్చాల్సిన బాధ్యత మాదే అనుకున్నాం. ముగ్గురమూ చదువే లోకంగా ఉన్నాం’ అని నాన్న గురించి చెప్పు కొచ్చింది రెండో అమ్మాయి వైష్ణవి.

సంతోషంగా..
పెద్దమ్మాయి ప్రీతి ఇంటర్‌ వరకే చదివింది. ఈ ఏడాది మొదటి సారి గ్రేడ్‌2 పోలీసు కానిస్టేబుల్‌ పోటీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించింది. రెండో అమ్మాయి వైష్ణవి ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసింది. పోలీసు కానిస్టేబుల్‌ పరీక్షను నాలుగోసారి రాసి ఉత్తీర్ణత పొందగలిగింది. చిన్నమ్మాయి నిరంజిని డిగ్రీ చదువుతూనే.. ఈ పరీక్షలో మూడో ప్రయత్నంలో పాసైంది. అలా ముగ్గురూ ఈ ఏడాది ఒకేసారి ఎంపికై ఉద్యోగ శిక్షణలో చేరారు. ‘మా దృష్టి అంతా పోలీసు ఉద్యోగంపైనే ఉండేది. ఎలాగైనా నాన్న కల నెరవేర్చాలని అనుకునే వాళ్లం. ఈ విజయం నాన్నకు అంకితం. ఆయన లేకపోతే దీన్ని సాధించ లేకపోయే వాళ్లం. మమ్మల్ని చూసి తనిప్పుడు గర్వంగా తిరుగుతుంటే సంతోషంగా ఉంది’ అని చెప్పుకొస్తోంది ప్రీతి. రాష్ట్రవ్యాప్తంగా వీరిపేరు మారుమోగిపోవడంతో.. ఆ ఊరికి, జిల్లాకే గర్వకారణంగా నిలిచారీ అక్కా చెల్లెళ్లు. ఆ ఊరిలో తొలిసారిగా పోలీసులుగా ఎంపికైన వారు వీరే. అయ్యో ఆడపిల్లలు అన్న వాళ్లంతా ఇప్పుడు ముగ్గురూ ముగ్గురే అని ప్రశంసిస్తున్నారు. ప్రముఖులు సైతం వీరిపై అభినందనలు కురిపిస్తున్నారు. 28ఏళ్ల ప్రీతి కలెక్టరు క్యాంపు కార్యాలయంలో, 25 ఏళ్ల వైష్ణవి జిల్లా జువెనైల్‌ జస్టిస్‌ బోర్డులో,  22 ఏళ్ల నిరంజిని జిల్లా పోలీసుస్టేషన్‌లో శిక్షణలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్