కొలనులో పతకాలు కొల్లగొడుతూ!

జాతీయ క్రీడల్లో నాలుగు పతకాలు గెలిచి సంచలనం సృష్టించింది వ్రితి అగర్వాల్‌. 16 ఏళ్లకే ఈత కొలనులో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోన్న ఈ బంగారు చేపతో ‘వసుంధర’ మాట కలిపింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే!

Updated : 28 Oct 2022 07:32 IST

జాతీయ క్రీడల్లో నాలుగు పతకాలు గెలిచి సంచలనం సృష్టించింది వ్రితి అగర్వాల్‌. 16 ఏళ్లకే ఈత కొలనులో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోన్న ఈ బంగారు చేపతో ‘వసుంధర’ మాట కలిపింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే!

గుజరాత్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో పసిడి సాధించాలనే లక్ష్యంతోనే అడుగుపెట్టా. ఫ్రీస్టైల్‌లో 800 మీటర్లు, 400మీ.విభాగాల్లో రజతాలు, 200మీ. విభాగంలో కాంస్యం, బటర్‌ఫ్లై స్టైల్‌లో 200మీ. విభాగంలో కాంస్యం దక్కాయి. ఆశించినట్టు రాణించకపోయినా నాకేమీ నిరాశ లేదు. నేను ఇంకా మెరుగుపడాలని అర్థమైంది. ఈతతో నా ప్రయాణం అనుకోకుండానే మొదలైంది. తొమ్మిదేళ్లప్పుడు వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా గోపీచంద్‌ అకాడమీలో ఈత విభాగంలో చేరా. అక్కడ కోచ్‌ జాన్‌ సిద్ధిఖ్‌ నా ప్రతిభను గుర్తించి స్విమ్మింగ్‌లో కొనసాగమని సూచించారు. ఆయనే అకాడమీలో నాకు శిక్షణ ఇవ్వడం ఆరంభించారు. ఆరేళ్లుగా నా టైమింగ్‌, ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ సాగుతున్నా. రోజూ ఆరేడు గంటలు సాధన చేస్తా.

అమ్మ తోడుగా.. నేను పుట్టింది, పెరిగిందీ హైదరాబాద్‌లోనే. నాన్న వినీత్‌ అగర్వాల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. అమ్మ ప్రీతి.. మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేసేది. నాకోసం ఉద్యోగం మానేసింది. నాకో చెల్లి ఇషి.. తనూ స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. గచ్చిబౌలిలో ఉండేవాళ్లం. అకాడమీకి దూరం అవుతుందని బాచుపల్లికి మారాం. నన్నో అంతర్జాతీయ ఛాంపియన్‌గా చూడాలన్నది అమ్మానాన్నల ఆరాటం. టోర్నీలకూ నాతో పాటే వస్తుంటుంది అమ్మ. శిక్షణకూ, టోర్నీల్లో పాల్గొనే విషయంలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకుంటారు నాన్న. వారి నమ్మకాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా సాగుతున్నా.

ఓబుల్‌ రెడ్డి స్కూల్లో ప్లస్‌వన్‌ చదువుతున్నా. పదిలో 95 శాతం మార్కులు సాధించా. సాధన, పోటీల కారణంగా రోజూ స్కూల్‌కి వెళ్లడం కుదరదు. ఆ ఆనందానికి దూరమవుతున్నాననే బాధ ఉంది. పండగలూ, కుటుంబ వేడుకలకూ దూరమే. ఏదైనా సాధించాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. పగలు ప్రాక్టీస్‌ చేసి రాత్రిళ్లు చదువుకుంటా. పాటలు వినడం, ఫాంటసీ పుస్తకాలు చదవడం హాబీలు. చికెన్‌ బిర్యానీ అంటే ఇష్టం. ఇంట్లో నేనొక్కదాన్నే మాంసాహారిని. అమెరికా స్విమ్మింగ్‌ దిగ్గజం కేటీ లెడెకీ నాకు ఆదర్శం. ఈ ఏడాది జాతీయ క్రీడలు, జాతీయస్థాయి జూనియర్‌, సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లు, ఖేలో ఇండియా యూత్‌ క్రీడల్లో అయిదు స్వర్ణాలు, ఆరు రజతాలు, అయిదు కాంస్యాలు సాధించా. 2023 ఆసియా క్రీడలకు అర్హత సాధించడంతోపాటు మెరుగైన ప్రదర్శన చేయడం, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం ఇవీ నా తక్షణ లక్ష్యాలు. ప్రస్తుతం ఆ దిశగానే కృషిచేస్తున్నా.

- చందు శనిగారపు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్