తన వ్యాపారం.. ఆమె కోసం!

సవాళ్ల మధ్య ప్రయాణం అంటే ఏమిటో సుదితిని అడగండి చెబుతుంది. చిన్నతనం నుంచీ తను వాటి మధ్యే పెరిగింది మరి! అలాగని ఆగిపోయిందనుకునేరు.. పెద్ద లక్ష్యాలను పెట్టుకొని మరీ సాధించుకుంటూ వచ్చింది. ఒక ఆడపిల్లగా మిగతా వారి గురించి ఆలోచించి, వ్యాపారాన్ని ప్రారంభించింది.

Updated : 01 Nov 2022 01:12 IST

సవాళ్ల మధ్య ప్రయాణం అంటే ఏమిటో సుదితిని అడగండి చెబుతుంది. చిన్నతనం నుంచీ తను వాటి మధ్యే పెరిగింది మరి! అలాగని ఆగిపోయిందనుకునేరు.. పెద్ద లక్ష్యాలను పెట్టుకొని మరీ సాధించుకుంటూ వచ్చింది. ఒక ఆడపిల్లగా మిగతా వారి గురించి ఆలోచించి, వ్యాపారాన్ని ప్రారంభించింది. రెండేళ్లకే రూ.50కోట్లకు చేర్చింది.

‘అమ్మాయివి.. కాళ్లు భూమ్మీదే ఉండనీ! ఆలోచనలకు రెక్కలు రానీయకు’ చిన్నప్పటి నుంచీ ఈ మాటల మధ్యే పెరిగింది సుదితి శర్మ. సంప్రదాయ కుటుంబం. అనుకూలమైన ఉద్యోగం, ఇంటిని చక్కదిద్దుకోవడం తెలిస్తే చాలు.. అంతకు మించి అమ్మాయిలు ఆలోచించక్కర్లేదనే సలహాలు తనకు నచ్చేవి కాదు. అందుకే సాధ్యం కాదన్నవే చేసి చూడాలనుకునేది. తనది ఇందౌర్‌. సవాళ్లను ఎదుర్కొంటూనే కన్స్యూమర్‌ సైకాలజీలో డిగ్రీ, ఆపై ఎంబీఏ చేసింది. సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌లో 5 ఏళ్లు ఉద్యోగమూ చేసింది. ఇతరుల బ్రాండ్‌లకు గుర్తింపు తేవడం కాదు.. తనకే ఓ సొంత బ్రాండ్‌ ఉండాలన్నది తన కల. ముఖ్యంగా అది అమ్మాయిలకు సాయపడేలా ఉండాలనుకుంది. వాళ్లకు ఆరోగ్యాన్ని చేకూర్చేవైతే మంచిదనుకుంది. వెదికితే.. మార్కెట్‌లో బోలెడు సప్లిమెంట్లు. వీగన్‌ ఆహారానికి ప్రాముఖ్యం పెరుగుతున్న ఈ రోజుల్లో ఇవి అందరికీ అనుకూలంగా లేకపోవడం గమనించింది.
‘ఆడవాళ్ల శరీరంలో ఒక్కో దశలో ఒక్కో మార్పు. ఆహారం ద్వారా కావాల్సిన పోషకాలన్నీ అందవు. బయటి నుంచీ అదనంగా తీసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌.. ఇది మహిళలకు అత్యావశ్యకం. చేపల ద్వారా లభ్యమవుతుంది. సప్లిమెంట్ల ద్వారా తీసుకోవాలంటే ఫిష్‌ ఆయిల్‌ టాబ్లెట్లు దొరుకుతాయి. మాంసాహారులైతే సరే! మరి శాకాహారుల సంగతేంటి? ఈ ఆలోచన వచ్చాక పరిశోధన చేశా. అప్పుడొచ్చిన ఆలోచనే హిమాలయన్‌ ఆర్గానిక్స్‌’ అంటోంది సుదితి. తన స్నేహితుడు వైభవ్‌ రఘువన్షీతో కలిసి 2018లో దీన్ని ప్రారంభించింది. రూ.40 లక్షలు పెట్టుబడి. హిమాలయ మూలికలపై పరిశోధన చేస్తున్న ఓ శాస్త్రవేత్త వీళ్లతో కలిశాడు. రసాయన రహిత న్యూట్రిషన్‌, స్కిన్‌, హెయిర్‌ కేర్‌ ఉత్పత్తులను తయారు చేసి అమ్మకాలు మొదలుపెట్టారు. వినియోగదారులకు ఉచిత డాక్టర్‌ కన్సల్టెన్సీ సేవల్నీ జోడించారు. మొదట ఆన్‌లైన్‌, డీ2సీ విధానంలో ప్రారంభించి ఈ ఏడాది స్టోర్లనీ ఏర్పాటు చేసుకున్నారు. కొద్ది సంఖ్యలో ప్రారంభమైన ఆ స్టోర్లు క్రమంగా దేశవ్యాప్తంగా 300కుపైగా చేరుకున్నాయి. వీళ్ల ఉత్పత్తులు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. గత ఏడాది రూ.21 కోట్లుగా ఉన్న వ్యాపారం ఈ ఏడాది ఇప్పటికే రూ.50 కోట్లకు చేరుకుంది. తర్వాతి అడుగుగా... కుటుంబంలో అందరికీ ఉపయోగపడే ఉత్పత్తుల మీదా దృష్టిపెట్టారు. త్వరలో చిరు ధాన్యాలు, పప్పులు వంటివీ తీసుకొస్తామని చెబుతోన్న సుదితి ఈ విజయం చాలదంటోంది. తనకు ఇంకా బోలెడు లక్ష్యాలున్నాయట. వ్యాపారాన్ని ఉన్నతస్థితికి తెచ్చి ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాలంటోంది. ఇప్పటికే ఆ స్థాయికి చేరుకున్నట్లు అనిపిస్తోంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్