ఆలయాలకు పునరుజ్జీవం.. ఆమె లక్ష్యం!

ఆ వీడియోలో మనకి రెండు అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి... ఒకటి చూపు తిప్పుకోనివ్వని నాట్య ప్రతిభ. రెండు అపురూప దేవాలయ శిల్ప సంపద. చివరి వరకూ చూశాకే అర్థమవుతుంది... ఆ దేవాలయ దైన్యస్థితి. కాట్రగడ్డ హిమాన్షి చౌదరి ఉద్దేశం కూడా అదే! జీర్ణస్థితిలో ఉన్న గొప్ప దేవాలయాలకి నాట్యకళతో జీవం పోయడం.

Updated : 01 Nov 2022 06:59 IST

ఆ వీడియోలో మనకి రెండు అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి... ఒకటి చూపు తిప్పుకోనివ్వని నాట్య ప్రతిభ. రెండు అపురూప దేవాలయ శిల్ప సంపద. చివరి వరకూ చూశాకే అర్థమవుతుంది... ఆ దేవాలయ దైన్యస్థితి. కాట్రగడ్డ హిమాన్షి చౌదరి ఉద్దేశం కూడా అదే! జీర్ణస్థితిలో ఉన్న గొప్ప దేవాలయాలకి నాట్యకళతో జీవం పోయడం. ఈ లక్ష్య సాధనలో ఆమె ఎంత వరకూ విజయం సాధించిందో తెలుసుకోవాలని ఉందా...?

నాట్యం... దేవాలయం రెంటినీ వేరుచేసి చూడలేం. నాట్యం పుట్టిందే ఆలయంలో. అలాంటి ఆలయాలు దీపారాధనకీ నోచుకోకుంటే బాధే కదా? అందుకే స్నేహితులతో కలిసి ‘టెంపుల్‌ డ్యాన్స్‌’ కార్యక్రమం ద్వారా ప్రాచీన దేవాలయాలకి పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. మా సొంతూరు హనుమకొండ. నాన్న శ్రీనివాసరావు. అమ్మ శ్రీలక్ష్మికి నాట్యమంటే ఇష్టం. అమ్మమ్మ గాయని. వీళ్ల ప్రోత్సాహంతోనే నాట్యంలో అడుగుపెట్టా. నాట్యగురువు బొంపెల్లి సుధీర్‌రావు దగ్గర కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందా. 800కుపైగా ప్రదర్శనలిచ్చా. ప్రస్తుతం ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) చివరి సంవత్సరం చదువుతున్నా. 2019లో.. కాలికి గాయమైంది. కొన్ని రోజులు నాట్యానికి దూరమయ్యా. ఆ సమయంలోనే టెంపుల్‌ డ్యాన్స్‌ ఆలోచన రూపుదిద్దుకుంది.
రామప్ప దేవాలయం గురించి పరిచయం అవసరం లేదు. సమీపంలోని కోటగుళ్లు త్రికూటాలయం కూడా శిల్ప సంపదతో, అద్భుత నిర్మాణశైలితో ఉంటుంది. తేడా ఒక్కటే! రామప్పకున్న ఆదరణ కోటగుళ్లు ఆలయానికి లేదు. పైగా పారిశుద్ధ్యలోపం. నిర్వాహకులని అడిగితే... దీపం పెట్టేందుకు నూనె కూడా లేదనడంతో చాలా బాధనిపించింది. అంత గొప్ప ఆలయానికి పూర్వ వైభవం తేవాలనుకున్నా. ఆలయ చరిత్రతో పాటు.. ప్రస్తుత పరిస్థితినీ ప్రపంచానికి తెలియ జేయాలనుకున్నా. డాక్యుమెంటరీలా తీస్తే కొందరికే చేరుతుంది.. నాట్యాన్నీ జోడిస్తేనే అందరికీ చేరువవుతుందనిపించింది. ఓ వీడియో రూపొందించి యూట్యూబ్‌లో ‘టెంపుల్‌ డ్యాన్స్‌ ఛానెల్‌’లో విడుదల చేశాం. ఇది పది మందికీ చేరువ కావడానికి ఊరి వాళ్లు నడుంకట్టారు. ఆ వీడియోని చూసిన ఎన్నారైలు కొందరు మా ఊరు... మా గుడి అంటూ ఆర్థిక సాయం చేశారు. ఇంకెంతోమంది స్పందించారు. వారి సాయం నేరుగా గుడికే అందే ఏర్పాటు చేశాం. ప్రభుత్వమే గుడిని పునరుద్ధరించడంతో చాలా సంతోషమేసింది. తర్వాత ములుగు జిల్లాలోని జాకారం గుడి, వరంగల్‌ కోటలోని మరికొన్ని గుళ్లతో సహా 12 చోట్ల నాట్య ప్రదర్శనలు ఇచ్చాం.
జాకారం శివాలయం పైకప్పు ఊడి పోయి కళావిహీనంగా మారింది. ఈసారి ప్రభుత్వంతోపాటు, గ్రామస్థులూ ముందు కొచ్చి ఆలయాన్ని పునరుద్ధరించుకున్నారు. వీటి వల్ల పర్యటకుల సంఖ్యా పెరుగుతోంది. స్థానికులకు ఉపాధి కూడా దొరుకుతోంది. కేంద్ర ప్రభుత్వమూ ఆర్థిక సాయం చేయడానికి సుముఖత చూపించింది.


పాఠశాల పిల్లలకి..

‘స్పైక్‌మాకీ’ స్వచ్ఛంద సంస్థతో కలిసి భారతీయ కళలని భవిష్యత్‌ తరాలకి అందిస్తున్నా. ఆ సంస్థ సాయంతో రాజస్థాన్‌లోని 12 పాఠశాలల్లో కూచిపూడి కళని పరిచయం చేశాను. స్థానికంగానూ బధిర విద్యార్థులకు ఈ కళని నేర్పిస్తున్నా. ఆన్‌లైన్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాల విద్యార్థులకు కూచిపూడి నాట్యశిక్షణ ఇస్తున్నా. నాట్యంతోపాటు సంగీతం, వాద్యం, సాహిత్యం.. అన్నీ ఒకేచోట లభించేలా శిక్షణివ్వాలని ఉంది. తెలుగు, కన్నడల్లో రెండు చిత్రాల్లో నటించాను. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పురస్కారాలూ వరించాయి. దర్శకుడు కె.విశ్వనాథ్‌ నా టెంపుల్‌డాన్స్‌ వీడియోలను వీక్షించి అభినందించడం మరిచిపోలేని ప్రశంస.

- వుప్పల రాంచందర్‌, వరంగల్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్