Sukarma thapar: గూగుల్‌నే కంగు తినిపించి..

‘గూగులమ్మ ఉండగా మనకెందుకు చింత’ అని భారమంతా దానిపై పెట్టేసి, హాయిగా ఉండే వారికి తప్పు చేస్తే గూగుల్‌ని కూడా మొట్టికాయలేయొచ్చు అని నిరూపించింది ఓ యువ లాయరమ్మ.

Updated : 02 Nov 2022 09:53 IST

‘గూగులమ్మ ఉండగా మనకెందుకు చింత’ అని భారమంతా దానిపై పెట్టేసి, హాయిగా ఉండే వారికి తప్పు చేస్తే గూగుల్‌ని కూడా మొట్టికాయలేయొచ్చు అని నిరూపించింది ఓ యువ లాయరమ్మ. ఆ సంస్థపై ఒక్క వారంలోనే రెండువేల కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు పడ్డాయి. అదీ ఓ అమ్మాయి కారణంగా అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆమె పేరు సుకర్మాథాపర్‌...

సీసీఐ(కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా).. ఈ సంస్థ దేశంలో వ్యాపార సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేట్టు చూస్తుంటుంది. ముఖ్యంగా గుత్తాధిపత్యం చెలాయించే సంస్థల తీరుని ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. ఇండిపెండెంట్‌ కన్సల్టెంట్‌గా చేస్తూనే, ఈ సంస్థలో రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది దిల్లీ అమ్మాయి సుకర్మాథాపర్‌. 2018లో సుకర్మాని ఆలోచింప చేసిన విషయం.. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు కొన్నప్పుడు మనం వెయ్యకుండానే వాడుకోవడానికి సిద్ధంగా ఉండే కొన్ని డీఫాల్ట్‌ యాప్‌లు. అవి మనం డిలీట్‌ చేద్దామన్నా వీలుకావు. నచ్చినా నచ్చకపోయినా అవి మన ఫోన్‌లో అలా ఉంటాయి. అంతకన్నా మంచి ప్రత్యామ్నాయం ఉన్నా మనకి తెలిసే అవకాశం కూడా లేదు. అలా ఎందుకు జరుగుతోందంటే మార్కెట్‌లో గూగుల్‌కున్న గుత్తాధిపత్యం వల్లనే అన్నది కొందరి ఫిర్యాదు. అప్పటికే ఈ విషయంలో ఆ సంస్థపై కొన్ని ఫిర్యాదులు అందాయి. గూగుల్‌ తీరు కొన్ని సంస్థలని ఎదగనీయడం లేదన్నది వాటి సారాంశం. కానీ దీన్ని నిరూపించడం అంత సులభం కాదు. అయినా తనతో పనిచేస్తున్న మరో రిసెర్చ్‌ అసిస్టెంట్‌ ఉమర్‌జావెద్‌, అతని తమ్ముడు ఆకిబ్‌తో కలిసి సరైన ఆధారాలకోసం అన్వేషించింది సుకర్మ. ‘చాలా శ్రమపడాల్సి వచ్చింది. 2018లో యూరోపియన్‌ కమిషన్‌ గూగుల్‌పై పెద్దమొత్తంలో జరిమానా వేసింది. దాని తర్వాతే ఈ విషయంలో నాకో దారి దొరికింది. రోజంతా ఉద్యోగం చేసుకుంటూ మిగిలిన సమయంలో ఆధారాలు కోసం వెతికేదాన్ని. లేటుగా నిద్రపోవడం, తెల్లారక ముందే లేచి మళ్లీ ఇదే పని. హార్వర్డ్‌ ప్రొఫెసర్‌ ఒకరు గూగుల్‌ ఒప్పందాలపై చేసిన ఒక అధ్యయనం గురించి తెలిసింది. కాకపోతే అమెరికాలో యాపిల్‌ వాడకం ఎక్కువ. మనం ఆండ్రాయిడ్‌ వాడతాం. అయినా ఆ డేటాతో సరిపోల్చుకున్నప్పుడు కొన్ని ఆధారాలు దొరికాయి. అలా మాకు దొరికిన వాటిని సీసీఐకి అప్పగించి గూగుల్‌కి జరిమానా వేయించగలిగాం’ అన్న సుకర్మ నల్సార్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేసింది. ‘చాలామంది ఇంత పెద్ద సంస్థని ఢీకొన్నావ్‌. ఈ కేసు ఫైల్‌ చేశాక ఏం చేస్తావ్‌ అని అడుగుతున్నారు. దీనివల్ల నాకేం డబ్బులు రావు. అయినా అన్నీ డబ్బుల కోసమే చేయరు. మన చదువుకి సామాజిక ప్రయోజనం కూడా ఉండాలని నమ్ముతాన్నేను. ఈ సంఘటన కారణంగా వినియోగదారులు లాభపడితే అంతే చాలు. పుస్తకాలు నాకీ విషయంలో ఎంతో సహకరించాయని చెప్పాలి. నాకు ముందు నుంచీ కాంపిటిషన్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రొపర్టీ రైట్స్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌లా అన్నా చాలా ఆసక్తి. నేనే కాదు ప్రతి లా విద్యార్థిలో కుతూహలం ఉంటే ఇలాంటి విజయాలు సాధించడం తేలిక’ అంటోంది సుకర్మా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్