ఎనిమిది యుద్ధకళల్లో ‘ప్రతిభ’

ఎవరైనా ఒకటో, రెండో ఆటల్లో ప్రావీణ్యం చూపిస్తారు. కానీ ఈ అమ్మాయి పేరుకు తగ్గట్టుగానే ఎనిమిది యుద్ధవిద్యల్లో ప్రతిభ చూపిస్తోంది. వాటిలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూనే తోటి ఆడపిల్లలకూ నేర్పించాలని తపిస్తోంది తక్కడపల్లి ప్రతిభ. 

Updated : 05 Nov 2022 07:27 IST

ఎవరైనా ఒకటో, రెండో ఆటల్లో ప్రావీణ్యం చూపిస్తారు. కానీ ఈ అమ్మాయి పేరుకు తగ్గట్టుగానే ఎనిమిది యుద్ధవిద్యల్లో ప్రతిభ చూపిస్తోంది. వాటిలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూనే తోటి ఆడపిల్లలకూ నేర్పించాలని తపిస్తోంది తక్కడపల్లి ప్రతిభ. వసుంధరతో తనేం పంచుకుందంటే..

నాన్న నర్సింగ్‌రావుది కామారెడ్డి జిల్లా తక్కడపల్లి. రోజూ 14 కి.మీ. సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లి చదువుకునేవారు. అమ్మ శ్యామలా అంతే. తర్వాత తరాలకైనా ఈ కష్టం లేకుండా చేయాలని పొలాలు అమ్మి పిట్లంలో బడి కట్టించారు అమ్మానాన్నా. పేదలకు ఉచితంగా చదువు చెప్పేవారు. మా చదువు విషయంలోనూ అమ్మ రాజీ పడేది కాదు. వందకి ఒక్క మార్కు తగ్గినా ఒప్పుకొనేది కాదు. జేఎన్‌టీయూ నుంచి డిస్టింక్షన్‌లో ఎంబీఏ చేశా. తమ్ముడూ స్టేట్‌ ర్యాంకర్‌. నాకు ఆటలన్నా ఇష్టమే. మా బాబాయ్‌ కరాటే నేర్చుకున్నారు. ఆయన నేర్పిన టెక్నిక్స్‌, మైక్‌టైసన్‌ వీడియో... నా మీద బలమైన ముద్ర వేశాయి. ఇంట్లో చెప్పడానికి భయపడ్డా. హైదరాబాద్‌ వచ్చాక ఆ కోరిక నెరవేరింది. డిగ్రీ చదువుతూనే పార్ట్‌టైం ఉద్యోగాలు మొదలుపెట్టా. నెలకి రూ.13 వేలు సంపాదించే దాన్ని. వాటితో కిక్‌బాక్సింగ్‌, థాయ్‌ బాక్సింగ్‌, తైక్వాండో, వుషూ, చెస్‌ బాక్సింగ్‌, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌, సిలంబం, బ్రెజిలియన్‌ జియుజిట్సు (బీజీజీ), వెయిట్‌ లిఫ్టింగ్‌ నేర్చుకున్నా. అమ్మాయిలు సున్నితం, వాళ్లకి మార్షల్‌ ఆర్ట్స్‌ కష్టం అనే అభిప్రాయాల్ని మార్చడానికే ఇన్ని నేర్చుకున్నా. ఇందుకు రోజుకి 16 గంటలు కష్టపడ్డా. వానొచ్చినా, వరదొచ్చినా ఒక్కక్లాస్‌కీ డుమ్మా కొట్టలేదు. పోటీల్లోనూ పాల్గొనేదాన్ని. కిక్‌ బాక్సింగ్‌లో నేషనల్‌ మెడల్‌ కొట్టాకే ఇంట్లో తెలిసింది. మొదట భయపడ్డా.. తర్వాత ప్రోత్సహించారు. ఇప్పటికి అంతర్జాతీయ స్థాయిలో నాలుగు బంగారు పతకాలు, జాతీయస్థాయిలో 13 పతకాలు అందుకున్నా. ఒకేసారి మూడు విభిన్న క్రీడలను ప్రదర్శించే యువతిగా బంగారు పతకాన్ని సొంతం చేసుకోవడమే కాదు ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం దక్కింది. తెలంగాణలో సర్టిఫైడ్‌ బాక్సింగ్‌ కోచ్‌గా గుర్తింపుని సాధించి... ప్రైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అవార్డునీ అందుకున్నా. ఈ నెలలో చెస్‌బాక్సింగ్‌ పోటీల కోసం టర్కీ, తర్వాత తైక్వాండో పోటీలకు యూకే వెళ్తున్నా. విదేశాలకు వెళ్లేందుకు మా స్థోమత సరిపోదు. నాన్న శిష్యులు కొందరు సాయం చేస్తున్నారు. ప్రభుత్వ తోడ్పాటు అందితే కచ్చితంగా మరిన్ని విజయాలు సాధిస్తా, నేర్పిస్తా.

రెండు గంటల్లో...

మార్షల్‌ఆర్ట్స్‌ ప్రతి ఆడపిల్లకూ అవసరమే కదా. అందుకే అమ్మాయిలు 2, 3 గంటల్లోనే నేర్చుకునేలా ప్రత్యేక కోర్సుని రూపొందించా. దీంతో చాలామంది పిల్లల్ని నా దగ్గరకు తీసుకొస్తున్నారు. మొదట్లో ఓ ఎన్జీవో సాయంతో ఆడపిల్లలకు ఉచితంగా నేర్పేదాన్ని. కొన్ని అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీలు, కాలేజీలూ వాళ్ల పిల్లలకు నేర్పమని అడుగుతున్నాయి. అందుకే కొంత రుసుము తీసుకుంటున్నా. చదువు పక్కనపెట్టేశా అనుకుంటున్నారేమో. యూపీఎస్సీకి సిద్ధమవుతున్నా. ఇంతకీ నా స్ఫూర్తి ఎవరో తెలుసా? మా స్కూల్‌కి రోజూ నాలుగు పత్రికలు వచ్చేవి. అందులో నాకు బాగా నచ్చిన ‘వసుంధర పేజీ’లో వచ్చే స్త్రీల కథనాలే. అవే నన్నిలా ముందుకు నడిపించాయి.

- సతీశ్‌ దండవేణి, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్