శుభ్రగత్తెకు కోట్ల అభిమానులు

ఆమెకు ఇన్‌స్టాలో 21 లక్షలు, టిక్‌టాక్‌లో దాదాపు 80 లక్షల మంది ఫాలోయర్స్‌. ఎక్కడకి వెళ్తే అక్కడ మీడియా ఫాలోయింగ్‌. బోలెడన్ని పురస్కారాలు... ఆవిడ సినీ నటో, గాయనో, మోడలో అనుకుంటున్నారా?

Updated : 12 Nov 2022 04:18 IST

ఆమెకు ఇన్‌స్టాలో 21 లక్షలు, టిక్‌టాక్‌లో దాదాపు 80 లక్షల మంది ఫాలోయర్స్‌. ఎక్కడకి వెళ్తే అక్కడ మీడియా ఫాలోయింగ్‌. బోలెడన్ని పురస్కారాలు... ఆవిడ సినీ నటో, గాయనో, మోడలో అనుకుంటున్నారా? ఏమీ కాదు. ఇళ్లు శుభ్రం చేసిపెడుతుంది. ఏంటీ విడ్డూరం అంటారా? అయితే ‘క్లీనింగ్‌ క్వీన్‌’ ఆరి కటారీనా గురించి చదవండి...

ఫిన్‌లాండ్‌కు చెందిన ఆరి కటారీనాకు చిన్నప్పటి నుంచే తన చుట్టు పక్కలంతా శుభ్రంగా ఉండాలని కోరిక. ఇల్లంతా అద్దంలా మార్చేసేది. 14వ ఏట నుంచి స్కూల్‌ శుభ్రత కూడా తన బాధ్యతగా భుజాన వేేసుకుంది. స్నేహితులకు, తెలిసిన వాళ్లకూ ఇంటిని శుభ్రం చేసుకోవడంలో సాయపడేది. ఈ అలవాటుకు బానిసనైపోయా అని నవ్వేస్తుంది తను. చదువైపోయి ఉద్యోగంలో చేరినా సేవ కొనసాగించింది. ‘చాలామంది ఇళ్లను చూసినప్పుడు పరిశుభ్రతను నేర్పాలనిపించేది. దాంతో సామాజిక మాధ్యమాల్లో ఇంటిని, వస్తువులనెలా శుభ్రపరచుకోవాలో వీడియోలు పొందుపరడం మొదలుపెట్టా. అవి వైరల్‌ అయ్యాయి. కోట్ల వీక్షణలొచ్చేవి. ఫాలోయర్స్‌ కూడా పెరిగారు. క్లీనింగ్‌ బ్రాండ్స్‌ నన్ను స్పాన్సర్‌ చేసేందుకు ముందుకొచ్చాయి. దీని కోసం ఉద్యోగాన్నీ వదిలేశా. ప్రపంచంలో ఎక్కడి నుంచీ సహాయం అడిగినా వెళ్లి చేస్తుంటా. అమెరికా, లండన్‌ వంటి దేశాలకు కూడా వెళ్లి ఇళ్లు శుభ్రం చేసొచ్చా. రోజూ 100 మందికిపైగా రిక్వెస్ట్‌లు పంపుతూ ఉంటారు. వారి ఇళ్ల ఫొటోలను చూసి, ఎక్కువ చెత్తగా ఉన్నవి ఎంచుకుంటా’ అని చెబుతోంది ఆరి. పనయ్యాక అద్దంలా ఉన్న ఇంటిని చూసుకొని తృప్తిగా బయలు దేరుతుంది. ఇంత చేసినా ఒక్క పైసా కూడా తీసుకోదు. అదేంటి అంటే... నా నుంచి స్ఫూర్తి పొంది కనీసం కొందరైనా పరిశుభ్రత పట్ల అవగాహన పెంచుకొంటే చాలు అంటుంది. సొంతంగా ఓ క్లీనింగ్‌ కంపెనీ కూడా ప్రారంభించి 30 మందికి ఉపాధినీ కల్పిస్తోన్న ఆరి సేవలకు పలు పురస్కారాలూ వరించాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్