Published : 16/11/2022 00:39 IST

బతికి దండగ.. మెషినరీ తీసేద్దామన్నారు!

అనుభవ పాఠం

నాకప్పుడు 14 ఏళ్లు. విపరీతమైన జ్వరం. డాక్టర్‌  మందులిచ్చినా ఫలితం లేదు. నడవడమే కష్టమయ్యే సరికి ఆస్పత్రికి తరలించారు. వెన్నెముకలో ఏదో సమస్య. అక్కడి ఫ్లూయిడ్స్‌ తీయడానికి ప్రయత్నిస్తే.. పెద్ద వాంతి. అదికాస్తా ఊపిరితిత్తుల్లోకి పోయింది. కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యి, ఊపిరి ఆగిపోయింది. డాక్టర్లు ఎంతో శ్రమిస్తే బతికా. కానీ కోమాలోకి వెళ్లా. శరీరమంతా చచ్చుబడింది. 20 రోజులైనా అదే పరిస్థితి. మెషినరీ సాయంతో బతుకుతున్న నన్ను చూసి డాక్టర్లు బతికి దండగ, వైర్లు తీసేయడం నయమన్నారు. ఆ తర్వాత వారమే నా పుట్టినరోజు. అప్పటి దాకా ఉంచమని అమ్మ బతిమాలింది. కేక్‌ అలా కట్‌ చేశారో లేదో.. కళ్లు తెరిచా. కానీ నా శరీరాన్ని చూసుకుని భోరుమన్నా. ఎంత ఆత్మవిశ్వాసంతో ఉందామన్నా వల్ల కాలేదు. దీనికితోడు అందరి జాలి చూపులు. శరీరం ఆధీనంలో కొచ్చినా నడక అసాధ్యం. ఇలా బతకడం అనవసరమని రెండుసార్లు ఆత్మహత్యకీ ప్రయత్నించా. ‘ఆపుతావా నాటకాలు’ అని మెత్తగా కోప్పడుతూనే అమ్మ ధైర్యాన్ని నింపింది. తన ప్రోత్సాహంతోనే మోడలింగ్‌ మొదలుపెట్టా. తొలిరోజుల్లో అవకాశాల్లేవు. అయినా నమ్మకం కోల్పోలేదు. ఇప్పుడు అందరితో సమానంగా పారితోషికం అందుకుంటున్నా. మీరు చేయగలిగే ప్రతి పనీ నేనూ చేయగలను. చేసే విధానంలో మార్పు ఉంటుందంతే. మీలోనూ లోపాలున్నాయా? జాలి ఆశించొద్దు, కుంగిపో వద్దు. ప్రయత్నించడమెలా అని ఆలోచించండి. తప్పక దారి దొరుకుతుంది.

- విరల్‌ మోదీ, భారత తొలి వీల్‌చెయిర్‌ మోడల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి