ఏడవడం కాదు.. ఎదురు తిరిగేలా చేయాలని

తన విద్యార్థులు ఆటలు ఆడాలి, పతకాలు కొట్టాలి.. ఇంతవరకే ఆలోచించలేదా పీఈటీ! వాళ్ల ఆరోగ్యంతోపాటు స్వీయరక్షణా ప్రధానమనుకున్నారు. జూడోలో శిక్షణిస్తూ మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. పోటీల్లో పతకాలు రాణించేలా ఆత్మవిశ్వాసాన్నీ నింపుతున్నారు.

Updated : 19 Nov 2022 04:26 IST

తన విద్యార్థులు ఆటలు ఆడాలి, పతకాలు కొట్టాలి.. ఇంతవరకే ఆలోచించలేదా పీఈటీ! వాళ్ల ఆరోగ్యంతోపాటు స్వీయరక్షణా ప్రధానమనుకున్నారు. జూడోలో శిక్షణిస్తూ మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. పోటీల్లో పతకాలు రాణించేలా ఆత్మవిశ్వాసాన్నీ నింపుతున్నారు. ఆరేళ్లలోనే పదుల కొద్దీ పతకాలు సాధించేలానూ చేశారు మంగళగిరి మీనా. తన గురించి వసుంధరతో పంచుకున్నారిలా...

మాది విశాఖపట్నం. ఇంటికి దగ్గర్లో స్వర్ణ భారతి స్టేడియంలో ఆటలు నేర్పుతోంటే.. ఒకటో తరగతిలో నాన్న నన్నూ చేర్చారు. అమ్మ హేమలత. నాన్న శ్రీనివాసరావు, ఆటోడ్రైవర్‌. ఆయనకి కరాటేలో ప్రవేశముంది. క్రీడలంటే చాలా ఇష్టం. చాలా నేర్పుతున్నా.. నన్ను జూడో ఆకర్షించింది. పదేళ్లకే పోటీల్లోనూ పాల్గొన్నా. మొదట సరదాగా నేర్చుకుంటున్నా అనుకున్నారంతా. పోటీలనే సరికి ‘అమ్మాయికి పోటీలెందుకు? వేరే ఊరు పంపొద్ద్ద’ంటూ సలహాలు ప్రారంభమయ్యాయి. అమ్మానాన్నల నమ్మకాన్ని నిలబెట్టాలన్న పట్టుదలతో, తొలిపోటీలోనే రజత పతకంతో తిరిగొచ్చా. అప్పటిదాకా వద్దన్న వారే పొగడటం మొదలుపెట్టారు. తర్వాత జాతీయ స్థాయిలో స్వర్ణం సహా 30కి పైగా పతకాలను సాధించా.

ఫిజిక్స్‌ వద్దనుకొన్నా..

చిన్నప్పటి నుంచీ కోచ్‌ దేవదానం.. బాగా చదివితేనే ఆటలనే వారు. దీంతో చదువునెప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. బుల్లయ్య కాలేజ్‌లో డిగ్రీ చదివా. కళాశాల తరఫున త్రోబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌లలో పతకాలూ సాధించా. ఫిజిక్స్‌లో పీజీ చేద్దామనుకున్నా. కానీ నా మనసంతా ఆటమీదే!  అందుకే కాలేజీ పీఈటీ, కోచ్‌.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ చదవమన్నారు. అందులో ఎక్కువగా మగవారే ఉంటారని ఆలోచిస్తుంటే... ‘కొత్త దారిలో వెళ్లడానికి వెనకాడొద్దు. భవిష్యత్తు బాగుంటుంద’ని ప్రోత్సహించారు. అదయ్యాక కొన్నాళ్లకే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అనకాపల్లి జె.నాయుడి పాలెంలో పీఈటీని.

అలా వెనుతిరగొద్దనీ!

ఉద్యోగంలో చేరిన కొత్తలో రోడ్డు మీద ఒకతనో అమ్మాయిని వేధిస్తుండటం చూశా. ఆ అమ్మాయి ఏడుస్తూ పారిపోయేది. ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతూనే ఉంటాయి. అందుకే ఏడవడం కాదు.. ఎదురు తిరిగేలా చేయాలనిపించింది. అమ్మాయిలకు జూడోలో శిక్షణివ్వాలనుకుంటున్నా అని పైవాళ్లకు చెబితే వింతగా చూశారు. అది శారీరక, మానసిక ఆరోగ్యాలతోపాటు ఆత్మరక్షణకీ తోడ్పడుతుందని వివరించాక అవకాశమిచ్చారు. మొదట్లో అమ్మాయిలూ ‘కాళ్లూ, చేతులూ విరుగుతాయి. మాకే ఇబ్బంది.. వదిలేయండి మేడమ్‌’ అనే వారు. జూడోతో మానసికంగా దృఢంగా ఉంటూనే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చని చెప్పేదాన్ని. ఉద్యోగ సమయంలో ఎలా సాయపడుతుందో నన్నే ఉదాహరణగా చూపా. అంతేకాదు.. వాళ్లతో కలిసి సాధనా చేసేదాన్ని. అలా క్రమంగా మార్పు తీసుకొచ్చా. ఇతర పాఠశాల, కళాశాలల విద్యార్థులకూ తర్ఫీదునిస్తున్నా. బాగా ఆడుతున్న వాళ్లని పోటీలకూ తీసుకెళ్లేదాన్ని. దానికి ఇంట్లో వాళ్లు వెనుకాడేవారు. తీసుకెళ్లడం నుంచి ఇంటి వద్ద దింపడం వరకూ నాదే బాధ్యత అని ఒప్పించే దాన్ని. అవగాహన సదస్సులూ నిర్వహించే దాన్ని. ఈ ఆరేళ్లలో నా శిష్యులు ఇద్దరు జాతీయ పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో 45కుపైనే! ఒలింపిక్స్‌లో ఆడాలి, నా విద్యార్థుల్నీ అక్కడి వరకు నడిపించాలన్నది నా కల. శిక్షణివ్వడమే కాదు.. నేనూ మరింత నేర్చుకుంటూ సిద్ధమవుతున్నా. మా వారు స్వామి శ్రీనివాస్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌. ఆయన ప్రోత్సాహమూ ఎక్కువే.

- సత్యనారాయణ, నక్కపల్లి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్