నాన్నల స్ఫూర్తితో విజయాల సిక్సర్లు...

ఆడపిల్లలకు క్రికెట్టా అన్నారు కొందరు... అసలు అమ్మాయిలకు ఆటలేంటి అన్నారు ఇంకొందరు... ఇవన్నీ పట్టించుకుంటే.... గ్యాలరీలో కూర్చోవాల్సి వస్తుందని హెచ్చరించి ముందుకు నడిపించారా నాన్నలు.

Updated : 22 Nov 2022 00:37 IST

ఆడపిల్లలకు క్రికెట్టా అన్నారు కొందరు... అసలు అమ్మాయిలకు ఆటలేంటి అన్నారు ఇంకొందరు... ఇవన్నీ పట్టించుకుంటే.... గ్యాలరీలో కూర్చోవాల్సి వస్తుందని హెచ్చరించి ముందుకు నడిపించారా నాన్నలు. అందుకే కఠోర సాధన, రెట్టించిన పట్టుదలతో బ్రహ్మాండంగా ఆడేస్తున్నారు. తాజాగా జాతీయ అండర్‌-19 జట్టుకు ఎంపికై... కన్నవాళ్ల కలలు నెరవేర్చారు గొంగడి త్రిష, షబ్నమ్‌. పరవళ్లు తొక్కే ఉత్సాహానికి ప్రతీకల్లాంటి ఈ అమ్మాయిలు... వసుంధరతో ఏం ముచ్చటించారో చదవండి...!


ఆ త్యాగానికి సార్థకత చేకూర్చాలని: త్రిష

ప్పుడు నాకంటే నాన్నే ఎక్కువగా సంతోష పడుతున్నారు. ఎందుకంటే... ఆయనే నా వేలు పట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చారు మరి. ‘ఆడపిల్లకు ఆటలెందుకు? అందులోనూ క్రికెట్‌ ఆడితే ఎవరు చూస్తారు? ఒక్కగానొక్క పిల్ల... ఇదంతా అవసరమా? ఇలా ఆయనకు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. నా సామర్థ్యం మీద నమ్మకంతో ఆయన అవేవీ పట్టించు కోలేదు. అమ్మ మాధవీ మద్దతుగా నిలిచింది. 

ఆ ప్రేమతోనే... మా స్వస్థలం భద్రాచలం. నాన్న రామిరెడ్డి జాతీయ హాకీ ఆటగాడు. పరిస్థితులు అనుకూలించక ఆటలో కొనసాగలేకపోయారు. ఐటీసీలో ఫిట్‌నెస్‌ సలహాదారుగా పని చేశారు. ఆయన మనసెప్పుడూ ఆటల మీదే. అందుకే నన్ను ఛాంపియన్‌గా చూడాలనుకున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి బ్యాట్‌, బంతితోనే పెరిగా. క్రమంగా నాకూ ఆట మీద ప్రేమ పెరిగిపోతోంది. అందుకే బాగా ఆడగలుగుతున్నా అనుకుంటా. చిన్నప్పుడు నాన్నే నేర్పేవారు. జాతీయ స్థాయిలో ఆడాలంటే... మెరుగైన శిక్షణ కావాలని హైదరాబాద్‌ వచ్చేశాం. నాకోసం ఆయన ఉద్యోగాన్నీ మానేశారు. అమ్మానాన్నల త్యాగానికి సార్థకత చేకూర్చాలనే పట్టుదలతో ఆడుతుంటా. ‘కోచింగ్‌ బియాండ్‌ అకాడమీ’లో ఆర్‌.శ్రీధర్‌ పర్యవేక్షణలో సాధన చేస్తున్నా.

సాధన ఇలా... ఉదయం 6 గంటలకు ప్రాక్టీస్‌తో నా రోజు మొదలవుతుంది. రోజూ కనీసం 7, 8 గంటలు సాధన చేస్తా. భారీ షాట్లు కొట్టాలంటే ఫిట్‌గా ఉండాలి కదా. అందుకే దాని మీద ప్రత్యేక దృష్టి సారించా. ఒకప్పుడు 50 గజాల దూరం వరకు బంతిని కొట్టేదాన్ని. ఇప్పుడు 75 గజాల వరకూ సిక్సర్లు కొట్టగలుగుతున్నా. ఓపెనర్‌గా రైటార్మ్‌ బ్యాటింగ్‌ చేయడంతో పాటు లెగ్‌స్పిన్‌ వేస్తా. 8 ఏళ్లకే రాష్ట్రం తరపున అండర్‌-16, 12 ఏళ్లకు అండర్‌-19 ఆడా. హెచ్‌సీఏ సీనియర్‌ జట్టుకూ ఎంపికయ్యా. అదే ఏడాది బీసీసీఐ ‘‘ఉత్తమ క్రికెటర్‌’’ పురస్కారాన్ని గెలుచుకోవడం మర్చిపోలేను. 13 ఏళ్లకు ఛాలెంజర్స్‌ టోర్నీలోనూ పాల్గొన్నా. పోయినేడాది అండర్‌-19 ఛాలెంజర్‌ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ని. ధోని, మిథాలీరాజ్‌ అంటే ఇష్టం. ఖాళీ దొరికితే ఈత కొడతా, బొమ్మలు గీస్తా. భవన్స్‌ జూనియర్‌ కళాశాల (సైనిక్‌పురి)లో ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్నా. ఆట వల్ల రోజూ కళాశాలకు వెళ్లలేను. అందుకు నాకేమీ బాధ లేదు. నేనో గమ్యాన్ని చేరేందుకు విభిన్నమైన మార్గంలో సాగుతున్నా.


వారి నమ్మకాన్ని నిలపాలని: షబ్నమ్‌

నేను క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి ప్రధాన కారణం నాన్న మహమ్మద్‌ షకీల్‌. ఆయన నౌకాదళ అధికారి. ఆయనా క్రికెటరే. ఆయన క్లబ్స్‌కు ఆడుతుంటే చూసి ఆటపై ఆసక్తి పెరిగింది. ఎనిమిదేళ్ల వయసులో బ్యాట్‌ పట్టా. మొదట బ్యాటర్‌గానే ఆడా. ఫాస్ట్‌బౌలరైన నాన్న స్ఫూర్తితో పేసర్‌గా మారా. మంచి వేగంతో బ్యాటర్లను బోల్తా కొట్టించి, స్టంప్స్‌ను ఎగరేస్తుంటే భలే సరదాగా ఉండేది. దాంతో ఫాస్ట్‌బౌలింగ్‌పైనే దృష్టి పెట్టా. గతేడాది ఏపీ తరపున అండర్‌-19లో అరంగేట్రం చేశా. ఛాలెంజర్స్‌ టోర్నీలో ఆడా. వచ్చే ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడాలనేదే ఇప్పుడు నా ధ్యేయం.

అబ్బాయిలకు తక్కువ కాదని.. మాది విశాఖపట్నం. అమ్మ ఈశ్వరమ్మ కూడా నేవీలోనే పని చేస్తారు. మా చెల్లి షాజహాన్‌ బేగమ్‌ కూడా క్రికెటరే. ఇద్దరాడపిల్లల్నీ... ఆటలంటూ తిప్పుతున్నారంటూ నాన్నని ఎన్నో అనేవారు. ‘ఆడపిల్లలు అబ్బాయిలకు ఏం తీసిపోరు. దాన్ని మా అమ్మాయిలు నిరూపిస్తారు’ చూడండని కాస్త ఘాటుగానే చెప్పేవారు. అందుకే ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని నిర్ణయించుకున్నాం. ఆ స్ఫూర్తితోనే... వంద శాతం శ్రమిస్తున్నాం.

సాధన ఇలా... తెల్లవారు జామున 4:30కే లేచి ప్రాక్టీస్‌కు వెళ్తా. ఉదయం కోస్టల్‌ అకాడమీలో, సాయంత్రం వీడీసీలో సాధన చేస్తున్నా. రాత్రి 9:30 వరకూ విడతల వారీగా సాధన కొనసాగుతుంది. పేసర్‌గా కెరియర్‌ కొనసాగించాలంటే ఫిట్‌నెస్‌ అత్యుత్తమంగా ఉండాలి. అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. ఇప్పుడు గంటకు 112 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్‌ చేయగలుగుతున్నా. చదువుపైనా శ్రద్ధ పెడుతున్నా. శివశివాని పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. పాఠశాలకు రోజూ వెళ్ల లేను కదా... అందుకే మా మాస్టార్లూ, స్నేహితులూ సాయం చేస్తుంటారు. చెస్‌, బ్యాడ్మింటన్‌ కూడా ఆడతా. భారత మహిళా క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్‌గా నిలిచిపోవాలన్నది నా లక్ష్యం. దాని కోసం ఎంత శ్రమైనా చేస్తూనే ఉంటా. దిగ్గజ పేసర్‌ జులన్‌ గోస్వామి నాకు ఆదర్శం. బుమ్రా, ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌లీ బౌలింగ్‌ ఇష్టం.

- చందు శనిగారపు, హైదరాబాదు


ముక్తకంఠం

భారత అండర్‌-19 జట్టు ఎంపిక కోసం ఇండియా - ఎ, బి, శ్రీలంక, వెస్టిండీస్‌లతో సిరీస్‌ పెట్టారు. అందులో బాగా ఆడటంతో మాకీ అవకాశం వచ్చింది.

* ఇప్పుడిక న్యూజిలాండ్‌ సిరీస్‌లోనూ సత్తా చూపడం పైనే మా దృష్టంతా. అక్కడా మెప్పిస్తామనే నమ్మకం.

*  సీనియర్‌ జట్టుకు ఆడాలనే లక్ష్య సాధనలో ఇది మా తొలి అడుగు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్