మాటలే రాని నువ్వు మ్యాజిక్‌ ఎలా చేస్తావన్నారు..

పెదవి విప్పి మాట్లాడకపోతేనేం .. వేదికపై ఆమె చేసే ఇంద్రజాలం చాలు... ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తడానికి... అందరినీ కడుపుబ్బ నవ్వించడానికి. నువ్వేం చేయగలవన్న ప్రశ్నలకు... దేశవిదేశాల్లో వేల ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగింది... తనేంటో నిరూపించుకుంది.. అందులో ఏముంది అంటారా?

Updated : 24 Nov 2022 09:23 IST

పెదవి విప్పి మాట్లాడకపోతేనేం .. వేదికపై ఆమె చేసే ఇంద్రజాలం చాలు... ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తడానికి... అందరినీ కడుపుబ్బ నవ్వించడానికి. నువ్వేం చేయగలవన్న ప్రశ్నలకు... దేశవిదేశాల్లో వేల ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగింది... తనేంటో నిరూపించుకుంది.. అందులో ఏముంది అంటారా? ఆమె పుట్టుకతో బధిరురాలు... ఆత్మవిశ్వాసం, సాధించాలన్న పట్టుదలతో శీతల్‌ చేస్తోన్న మాయాజాలం ఇదీ...

మ్యాజిక్‌ అంటే ప్రేక్షకుల్ని మాటల్లో పెట్టి... ఏదో ఒకటి చెబుతూ.. చేస్తూ.. చేయిస్తూ.. భ్రమలో నింపాలి. శీతల్‌కు వారి కేరింతలూ, చప్పట్లూ వినబడవు. అయినా ఆమెకు వారి నాడి తెలుసు. వాళ్లనెలా నవ్వించాలో, ఆశ్చర్యంలో ముంచెత్తాలో తెలుసు. తన సైగలతోనే క్షణాల్లో ఎదుటి వారిని మాయ చేసేయగలదీమె. దీని వెనుక కఠోర సాధనా ఉంది. శీతల్‌ కిమ్మాట్కర్‌ది మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబం. ముందు మగబిడ్డ, ఈమె రెండో సంతానం. తనకు ఏడాది నిండక ముందే అన్నయ్య అనారోగ్యంతో చనిపోయాడు. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న శీతల్‌ను అపురూపంగా పెంచారు అమ్మానాన్న. ఎదిగేకొద్దీ మాటలు కూడా రాకపోవడంతో బధిరుల పాఠశాలలో చేర్పించారు.

అమ్మ నేర్చుకొని..

తోటి పిల్లలతో కలవడమెలాగో తెలిసేది కాదు శీతల్‌కి. ‘ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు కూడా అర్థమయ్యేవి కావు. సైగ భాష తెలియక చాలా ఇబ్బందులెదుర్కొన్నా. దాంతో అమ్మ సైగ భాష నేర్చుకొని నాకు నేర్పింది. నాతో మాట్లాడుతూ అవసరాలన్నీ తెలుసుకునేది. చదువుకొని పెద్ద ఉద్యోగంలో స్థిరపడాలని ప్రోత్సహించేది. వైకల్యంతోనే విజయం సాధించిన వారి కథలు చెప్పేది. అమ్మ చేయూతతోనే దూరవిద్యలో బీకాం చేయగలిగా. అయినా.. అప్పటి వరకు కెరియర్‌ ఎంపికలో సందిగ్ధంలోనే ఉండేదాన్ని. ఏదైనా ఉద్యోగంలో చేరినా సహోద్యోగులు నన్ను వారితో కలవనిస్తారా? నేను అందరితో కలవగలనా అనుకొనేదాన్ని. ఆ సమయంలో నేను చూసిన ఓ మ్యాజిక్‌ షో నా మార్గాన్నే మార్చేసింది’ అని చెప్పుకొచ్చింది శీతల్‌.

దేశవిదేశాల్లో..

శీతల్‌ ఒకసారి అమ్మతో కలిసి ఒక మహిళ  మ్యాజిక్‌ షో చూసింది. ‘ఆమెలా నేనూ ఇంద్రజాలికురాలిని అవ్వాలనే ఆలోచన మొదలైంది. మాట్లాడటమే రాని నువ్వెలా మ్యాజిక్‌ చేస్తావు అన్నారంతా. అమ్మ మాత్రం ప్రోత్సహించింది. ఈ రంగంలో ప్రముఖులైన గోఖలే గురూజీ దగ్గర శిక్షణలో చేర్పించింది.  ఆయన చెప్పిన తొలి విషయం... ‘నీ లోపాలను మరచిపో’ అని. తర్వాత ప్రతి చిన్న అంశాన్నీ నేర్పే వారు. మ్యాజిక్‌లో మెలకువలను నేర్చుకొనేటప్పుడు ఎదుటి వారిని నమ్మించగలిగేలా ఏకాగ్రతగా ఉండాలనే వారు. ఇక పట్టువచ్చిందని ఆయన భరోసా ఇచ్చాక, ప్రదర్శన ఇచ్చా. తొలిసారి నేను చేసిన మ్యాజిక్‌కు ప్రేక్షకులు కరతాళధ్వనులు చేశారు. అవేవీ నాకు వినిపించకపోయినా, ఆ ఆనందాన్ని వారి ముఖాల్లో చూడగలిగా. నా జీవితంలో అదో మరవలేని అనుభూతి. ఈ రంగంలోకి అడుగుపెట్టిన కొత్తలో చాలామంది నన్ను హేళన చేసేవారు. మహిళలు ఎక్కువగా అడుగుపెట్టని మ్యాజిక్‌లో, అదీ బధిరురాలిగా ఏం సాధిస్తావు అన్నట్లు ఉండేవారు. వారికి సరైన సమాధానం... దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చే స్థాయికి రావడమే అనుకొన్నా. ఆ పట్టుదలతోనే అమెరికా, యూరప్‌ దేశాల్లోనూ మ్యాజిక్‌ ప్రదర్శనలతో లక్షలమందిని మెప్పించగలిగా. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ విజేతగా నిలిచా. పురస్కారాలూ అందుకొన్నా. చికాగోలో జరిగిన ప్రపంచ బధిరుల మ్యాజిక్‌ ఫెస్టివల్‌ పోటీల్లో రెండోస్థానంలో నిలిచా. నాలాంటి అమ్మాయిలకు ఈ కళ నేర్పి, వారినీ నా అంతటి వారిగా తీర్చిదిద్దడమే లక్ష్యం’ అంటున్న శీతల్‌ నిజంగానే మాయ చేస్తోంది కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్