నాకోసం అమ్మ బ్రెయిలీ నేర్చుకుంది..

నెలల వయసులో సోకిన అనారోగ్యం ఆమెకు చీకట్లను మిగిల్చింది. అయితేనేం.. తనలోని ప్రత్యేకతను గుర్తించి  సాధన చేసింది.

Updated : 14 Dec 2022 10:57 IST

నెలల వయసులో సోకిన అనారోగ్యం ఆమెకు చీకట్లను మిగిల్చింది. అయితేనేం.. తనలోని ప్రత్యేకతను గుర్తించి  సాధన చేసింది. తీయని గొంతుతో తానేంటో నిరూపించుకొని గుర్తింపు తెచ్చుకొంది. ఈమె ప్రతిభకు పురస్కారాలెన్నో వరించాయి. లక్ష్యానికి అంగవైకల్యం అడ్డు కాదంటూ స్ఫూర్తిగా నిలుస్తున్న శివానీ ఘోష్‌ ప్రయాణమిదీ...

‘మాది పశ్చిమబంగాలో కృష్ణా నగర్‌ గ్రామం. నాన్న ఆసిమ్‌ ప్రధానోపాధ్యాయులు. అమ్మ సుజాత అకౌంటెంట్‌. వారికి నేను లేకలేక కలిగిన సంతానం. పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. 3 నెలల వయసులో న్యుమోనియా సోకి కంటి చూపు ప్రభావితమైంది. అంధురాలినయ్యా. చిన్నప్పటి నుంచి ఏదైనా పాట వినిపిస్తే చాలు, ఏడ్చేదాన్ని కూడా మానేసి వినేదాన్నట. దాంతో నాకు సంగీతమంటే ఇష్టమని చిన్నప్పుడే గుర్తించారు. సంగీతం నేర్పించాలని అమ్మ నిశ్చయించుకుందట. అందరూ అమ్మతో అసలే ఆడపిల్ల, అందులోనూ చూపు లేదు. ఎలా పెంచుతావు, అనాథాశ్రమానికి పంపేయమని సలహాలిచ్చేవారట. అయితే అమ్మానాన్న నాకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రతి చిన్న అంశాన్నీ నేర్పారు. స్కూల్లో పిల్లలతో కలవలేక ఇబ్బంది పడుతుంటే, అమ్మ నన్ను రోజూ గ్రౌండ్‌కు, పార్కుకు తీసుకెళ్లి మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవడం నేర్పింది. అంధుల పాఠశాలలో బ్రెయిలీ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డా. అప్పుడు అమ్మ కూడా నాతోపాటు శిక్షణ తీసుకొంది. ఆ తర్వాత పాఠాలన్నీ నాకు చదివి వినిపించేది. తన ప్రోత్సాహంతోనే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా. 

ఛాంపియన్‌గా..

అమ్మ నన్ను సంగీతంలోనూ ప్రోత్సహించింది. గురువు వద్ద శిక్షణలో చేర్పించింది. రాత్రింబవళ్లూ సాధన చేసి గానంలో పట్టు సంపాదించా. ‘ఠాగూర్‌ విజన్‌’ నా మొదటి సీడీ ఆల్బం. నా తొలి ఆల్బంను కోల్‌కతా ఆకాశవాణి, ఆల్‌ ఇండియా రేడియో ద్వారా విడుదల చేయడం ఇప్పటికీ కలగానే ఉంటుంది. ఉత్తమ గాయకులకు బెంగాల్‌ ప్రభుత్వం అందించే ‘రోల్‌ మోడల్‌’, కలర్స్‌ బంగ్లా ఛానెల్‌ ‘టాలెంటినో’ పురస్కారాలను అందుకొన్నా. రవీంద్ర సంగీత్‌ పోటీల్లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌గా నిలిచా. కచేరీల్లోనూ పాడుతున్నా. రూపసి బంగ్లా, ఈటీవీ, ఛానెల్‌ ఒన్‌, హై న్యూస్‌ వంటి ఛానెళ్లలోనూ ప్రదర్శనలు ఇచ్చా. దాదాపు అన్ని ఎఫ్‌ఎం రేడియోల్లోనూ పాడా. పలువురు సినీ సంగీత దర్శకుల వద్ద ప్లేబ్యాక్‌ సింగర్‌గా పనిచేశా. రవీంద్ర భారతి విశ్వవిద్యాలయంలో వోకల్‌ మ్యూజిక్‌లో బీఏ చేస్తున్నా. మాస్టర్స్‌ చేసి సినీ గాయనిగా ఎదగాలన్నది నా లక్ష్యం. మనలో లోపం ఉంటే కుంగిపోనక్కర్లేదు. ప్రతి వారిలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించి సాధన చేసి విజేతగా నిలవాలి. నన్ను చూసి కొందరైనా స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా.’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్