శిఖరాలంటే ప్రాణం...

సాహసికుల స్వప్నం.. ఎవరెస్ట్‌ శిఖరం. ప్రాణాలకు తెగించి దాన్ని అధిరోహించింది నైనాసింగ్‌ థాకడ్‌. ఎవరెస్టే కాదు పేదరికం నుంచి వచ్చిన ఆ అమ్మాయి సంకల్పం ముందు ఇతర శిఖరాలూ తలవంచాయి. అందుకే ఆమెకి ఈ ఏడాది ‘టెంజింగ్‌ నార్గే నేషనల్‌ అడ్వంచర్‌ అవార్డ్‌’ వరించింది..

Updated : 01 Dec 2022 06:04 IST

సాహసికుల స్వప్నం.. ఎవరెస్ట్‌ శిఖరం. ప్రాణాలకు తెగించి దాన్ని అధిరోహించింది నైనాసింగ్‌ థాకడ్‌. ఎవరెస్టే కాదు పేదరికం నుంచి వచ్చిన ఆ అమ్మాయి సంకల్పం ముందు ఇతర శిఖరాలూ తలవంచాయి. అందుకే ఆమెకి ఈ ఏడాది ‘టెంజింగ్‌ నార్గే నేషనల్‌ అడ్వంచర్‌ అవార్డ్‌’ వరించింది..

నైనాసింగ్‌ బాల్యమంతా గడ్డు పేదరికంలోనే గడిచింది. తల్లికొచ్చే పింఛను తప్ప మరో ఆధారం లేకున్నా... నైనా కలలు మాత్రం శిఖరాల అంచుల చుట్టూనే విహరించేవి. అవే ఆమెని ముందుకు నడిపించాయి. ‘మాది చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ సమీపంలో ఉన్న ఏక్తాగుడా గ్రామం. నా అయిదేళ్లప్పుడే నాన్న చనిపోయారు. నాకిద్దరు సోదరులు. మా ముగ్గురినీ అమ్మ ఒంటిచేత్తో పెంచి పెద్దచేసింది. ఇంటి అవసరాలన్నీ అమ్మకొచ్చే కొద్దిపాటి పింఛనుతోనే గడిచేవి. ఆ పరిస్థితుల్లోనూ అతి ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించాలనే కల నన్ను వెంటాడేది. స్కూల్‌లో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపులో మొదటిసారి పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నా. ఎవరెస్ట్‌ని తొలిసారి అధిరోహించిన తొలిమహిళ బచ్చేంద్రీపాల్‌తో కలిసి భూటాన్‌లో జరిగిన స్నో మ్యాన్‌ ట్రాక్‌లో పాల్గొన్నా. నా ఆసక్తిని గమనించి మా జిల్లా కలెక్టరు ప్రోత్సహించారు. చదువుకుంటూనే పర్వతారోహణ చేసేదాన్ని’ అని చెప్పే నైనాసింగ్‌ గత ఏడాది జూన్‌లో ఎవరెస్ట్‌ని అధిరోహించింది.

ఎన్నో కష్టాల మధ్య..  

రెండేళ్లక్రితం ఎవరెస్ట్‌ని అధిరోహించడానికి ప్రయత్నం చేసినా ఆర్థిక ఇబ్బందులవల్ల అది వీలుపడలేదు. గత ఏడాది జూన్‌లో నైనా లక్ష్యం నెరవేరింది. కానీ ఆ సాహసం తన ప్రాణాలమీదికే తెచ్చింది. ‘లక్ష్యాన్ని చేరుకున్నాక బాగా అలసిపోయా. ఒక్క అడుగూ వేయలేని పరిస్థితి. కుప్పకూలిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. జగ్దల్‌పుర్‌ కలెక్టరు రాజత్‌ బన్సాల్‌ అందించిన సమాచారంతో నేపాల్‌లోని భారత రాయభార కార్యాలయం నుంచి సహాయక చర్యలు ప్రారంభించారట. అక్కడి వాతావరణం బాగా తెలిసిన షెర్పాల సూచనలతో నన్ను సాయంత్రానికి క్యాంపు వరకు చేర్చగలిగారు. అమ్మ ఆందోళన పడిపోయింది. అయితే ‘నువ్వు మా చత్తీస్‌గఢ్‌కే గర్వకారణం. మా బస్తర్‌ ముద్దుల బిడ్డవి’ అంటూ ముఖ్యమంత్రి ప్రశంసిస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది.’ అంటోన్న 32 ఏళ్ల నైనాసింగ్‌ ఈ ఏడాది ‘టెంజింగ్‌ నార్గే నేషనల్‌ అడ్వంచర్‌ అవార్డుతోపాటు రూ.15 లక్షలు నగదు బహుమతినీ అందుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్